Ads

Showing posts with label మహాభారతంలో చెప్పబడిన అక్షయపాత్ర!. Show all posts
Showing posts with label మహాభారతంలో చెప్పబడిన అక్షయపాత్ర!. Show all posts

17 January, 2021

మహాభారతంలో చెప్పబడిన అక్షయపాత్ర! Akshaya Patra the Mystical Vessel


మహాభారతంలో చెప్పబడిన అక్షయపాత్ర!

మహాభారతం, వేదాలు మొదలుకొని పురాణాలవరకూ గల భారతీయ వాఙ్మయంయొక్క సారాంశాన్ని అందించటమేగాక, ఆయా అంశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు, వాటికి సామరస్యపూర్వక మార్గాన్ని నిర్దేశించే 'సమన్వయ సంహిత'గా పేరుగాంచింది. ధర్మ ప్రచారంలోనూ, ధర్మ పరిరక్షణలోనూ ఎనలేని పాత్రను పోషించే మహాభారతంలోని ప్రతిఘట్టం, అమూల్యమే.. అటువంటి వాటిలో అక్షయ పాత్ర కూడా ఒకటి.. అక్షయ పాత్ర అంటే, దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అక్షయ పాత్ర అనే పదానికి అర్థం, ‘క్షయం కానిది, నిత్యమైనది’ అని. ద్వాపర యుగంలో, పాండవులు అక్షయపాత్రను వరంగా పొందినట్లు, మహాభారతంలో వివరించబడింది. అయితే, అక్షయ పాత్రను పాండవులు ఎందుకు తీసుకున్నారు? సాక్ష్యాత్తూ సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర విశిష్ఠతలేంటి? అనేటటువంటి ఆసక్తిర విషయాలను, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tKfZ0NJJy5I ]

మహాభారతంలో, పాండవ వనవాసం సమయంలో, అక్షయ పాత్రకు సంబంధించిన ఘట్టం ఉంది. శకుని, కుయుక్తితో ధర్మరాజును జూదంలోకి దించి, వారిని ఓడించి, సుయోధనుని చేత పాండవులకు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక యేడాది అజ్ఞాతవాసం విధింపజేశాడు. అందులో భాగంగానే, పాండవులు ఆయుధాలతో ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టారు. పాండవులతో పాటు, ద్రౌపదీ, సుభద్రా, అభిమన్యుడూ, ఉపపాండవులూ, వీరి సైనికులూ కలిసి, సుమారు 14 వేల రథాలతో, అరణ్యవాసానికి బయలుదేరారు. వారు వెళుతున్న సమయంలో, హస్తిన రాజ్యంలో ఉన్న సుమారు, 10 వేల మంది బ్రాహ్మణులు, పాండవులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. ధర్మం లేని రాజ్యంలో, దుర్మార్గులు పాలిస్తున్న కౌరవ సామ్రాజ్యంలో, తాముండలేమని బ్రాహ్మణులు విన్నవించారు. అప్పుడు ధర్మరాజు, ‘మీరు మాపై చూపిస్తున్న అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. కానీ, మీరు అరణ్యవాసానికి వచ్చి,  మాతో పాటు కందమూలాలు తింటూ బ్రతకడం కష్టతరం. కాబట్టి, మీరు నగరానికి తిరిగి వెళ్లండి’ అని చెప్పాడు.

అందుకు ఆ బ్రాహ్మణులు, ‘అన్యాయం ప్రభవిల్లుతున్న చోట మా మనుగడ అసాధ్యం. మేము కూడా మీతో పాటే అరణ్యవాసంలో, మీరు తినే కంద మూలాలనే తింటాం. మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటాం’ అని చెబుతూ, పాండవులు వారిస్తున్నా వినకుండా, అరణ్యానికి ప్రయాణమయ్యారు. వారిని చూసి ధర్మరాజు చాలా దు:ఖించాడు. అప్పుడు శౌనక మహర్షి, ‘బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకూ మూలంగనుక, ఆశను వదిలి పెట్టు. ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బిందువులా ఉండు’ అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు, ‘ధనం నా కోసం కాదు.. నాతో పాటు ఉన్న ఈ జనులకు భోజనం పెట్టాలి కదా! వారు మా అతిధులు. గృహస్తుకు, అతిధి పూజ పరమ ధర్మం కదా! ఆర్తునకు శయ్యా, భయంతో ఉన్నవాడికి శరణూ, అలసిన వాడికి ఆసనం కూర్చడం, గృహస్తు ధర్మం. కనుక, అతిధి సత్కారం చేయడం నా విధి’ అని తెలియజేశాడు.

అందుకు శౌనకుడు, ‘ధర్మరాజా! జీవకోటికి ఆహారాన్నీ, నీటినీ ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుణ్ణి ప్రార్ధించి, నీ కోరిక నెరవేర్చుకో’ అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలు అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో, సూర్య భగవానుడిని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై, ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ‘ధర్మరాజా! ఈ పన్నెండేళ్ళ అరణ్యవాసంలో, మీరు అడవిలో సేకరించిన కంద మూలాలూ, ఫలాలూ, మీ భార్య ద్రౌపదిచే వండించినట్లయితే, అది నాలుగు విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి’ అని వరం ఇచ్చాడు. అందుకే, దానిని అక్షయ పాత్ర అంటారు. ఆ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే, ఎంతమందికైనా, దాని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెప్పాడు. అయితే, అక్షయ పాత్రకు ఒక నిబంధనను విధించాడు, సూర్య భగవానుడు. ‘దానిని ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, కడిగి బోర్లిస్తే మాత్రం, అది దాని శక్తిని కోల్పోతుంది. ఇక ఆ రోజు ఎలాంటి ఆహారం మనకు లభించదు. కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి’ అని చెప్పి వెళ్లిపోయాడు ఆదిత్యుడు.

వరంగా పొందిన ఆ అక్షయ పాత్రతో, చాలా కాలం పాటు బ్రాహ్మణోత్తములూ, పాండవులూ, వారి పరివారం, ఎటువంటి లోటూ లేకుండా జీవించారు. ఒకనాడు దూర్వాస మహర్షి, అరణ్య మార్గం గుండా వెళ్తూ, పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్లారు. దూర్వాసుడు స్నానానికి బయలుదేరుతూ, ‘నేను స్నానం చేసి వస్తాను. ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి’ అని వారితో చెప్పారు. పాండవులంతా కలిసి, మహర్షి ఆతిథ్యానికి అన్నీ సిద్ధం చేయమని, ద్రౌపదిని ఆదేశించారు. ముక్కోపి అయిన దూర్వాస మహర్షికి ఆతిథ్యం ఏర్పరిచే కంగారులో, అక్షయపాత్రను కడిగేసింది ద్రౌపది. దాంతో, అక్షయ పాత్ర దాని మాహాత్మ్యాన్ని కొల్పోయింది. విషయం తెలుసుకున్న పాండవులు, కంగారుపడ్డారు. మహర్షిని ఆతిథ్యానికి ఆహ్వానించి, భోజనం పెట్టకపోవడం, మహాపాపం అని భావించి, పాండవులంతా కలిసి కృష్ణుడిని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు, ద్రౌపదితో, ‘అక్షయపాత్రని సరిగ్గా చూడమనీ, కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందనీ’ సూచించాడు. కృష్ణుడి మాటతో, మరోసారి పాత్రలో చూడగా, ఒకేఒక్క అన్నం మెతుకు దొరికింది. దానిని ఉపయోగించి, కృష్ణ మాయతో, వారందరి కడుపులూ నిండేలా చేశాడు, ఆ భగవానుడు.

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugz1unVIUiCYyqMp7qp4AaABCQ