Ads

Showing posts with label మహాభారతం ప్రతి ఒక్కరికీ నేర్పే జీవిత పాఠాలు!. Show all posts
Showing posts with label మహాభారతం ప్రతి ఒక్కరికీ నేర్పే జీవిత పాఠాలు!. Show all posts

29 April, 2021

మహాభారతం ప్రతి ఒక్కరికీ నేర్పే జీవిత పాఠాలు! What to learn from Mahabharata!

  

మహాభారతం ప్రతి ఒక్కరికీ నేర్పే జీవిత పాఠాలు! 

భారతీయుల ప్రాచీన, పురాణ గ్రంధాలలో, మహాభారతం ఒకటి. 'తింటే గారలే తినాలి, వింటే భారతమే వినాలి' అనే నానుడి మనందరికీ తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఫాస్ట్ ఫార్వార్డ్ గా ఉన్న మనం, కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడి పుస్తకంగానో చూస్తున్నాం. నిజానికి, ఇప్పటి రోజులకీ సరిపడేటట్లు, సామాజిక జీవన శైలిని ఎలా మలచుకోవాలో, మనకు మహాభారతం చెబుతుంది. మహాభారతం చెప్పిన కొన్ని ముఖ్యమైన పాఠాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6ilXFONjd4M ]

జీవితంలో గెలవడానికి, జాలీ, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు..

కర్ణుడు అంటేనే మంచితనానికీ, దాన, ధర్మాలకీ పెట్టింది పేరు. కానీ, సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలనా, చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కాబట్టి, జీవితంలో గెలవాలంటే, మంచితనంతో పాటు, చుట్టూ ఉండే సమాజ పరిస్థితులనూ, సమయాన్ని బట్టీ నడుచుకోవాలి.

చెడు స్నేహం, ఊహలకి కూడా అందని విధంగా మన జీవితం నాశనం చేయొచ్చు..

పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్నీ నాశనంజేసి, వారితో స్నేహంగా, వారి ఆస్థానంలో ఉంటూనే, వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారు, జీవితంలో చాలా మంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని దూరం పెట్టాలి.

ఎటువంటి బేధాలూ చూడని నిజమైన స్నేహం, జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది..

పాండవులు శ్రీ కృష్ణుడినీ, కౌరవులు కర్ణుడునీ పొందటం, అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే.. కుల, మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా, మంచి వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

అధికం అనేది అత్యంత ప్రమాదకరం..

కౌరవుల తల్లి అయిన గాంధారికి, వంద మంది పుత్రులు ఒకేసారి కలగటం వల్ల, వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ, వారి బాగోగులు చూస్తూ, క్రమశిక్షణతో పెంచటము కూడా, చాలా కష్టం. అలాగే, దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా, కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి, అన్ని చోట్లా, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది, అత్యంత ప్రమాదకరం.

ఎవరి పనులు వారే చేసుకోవాలి..

అరణ్య వాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి, వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగ పడ్డాయి. అలాగే, మనం కూడా మన అవసరాల కోసం, కొన్ని పనులు నేర్చుకోవాలి.

మనకి సంబంధించిన దాని కోసం, ఎంత కష్టమైనా పోరాడాలి..

కౌరవులతో పోల్చుకుంటే, పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా, పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని, చిత్తశుద్దితో పోరాటం చేసి, విజేతలుగా నిలిచారు.

అతి ప్రేమవలన కలిగే నష్టం..

ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా, వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ద్రుతరాష్ట్రుడు, తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక, వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే, విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీదయినా, అతి ప్రేమ, అతి నమ్మకం, నాశనానికీ, మోసానికీ దారితీస్తాయి.

జీవితాంతం విద్య నేర్చుకుంటూ ఉండటమే ఉత్తమం..

అర్జునుడు తన జీవితం ఆసాంతం, విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ద శాస్త్రం, ఇంద్రుడి ద్వారా దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులూ, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే, అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచింది. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడం వలన, ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు..

కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా, వాస్తవానికి వారిలో చాలా మంది, పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. బీష్మ, విదుర, ద్రోణులు, రహస్యంగా పాండవులకి ఎంత సహాయంజేశారో తెలిసినదే. ఇక విదురుడయితే, కౌరవుల ప్రతీ అడుగూ, పాండవులకు చేరవేయడం తెలిసినదే..

మిడిమిడి జ్ఞానం, అత్యంత ప్రమాదకరం..

పద్మవ్యూహం లోనికి ప్రవేశించటమే కానీ, బయటపడటం తెలియక, తనకున్న అర్ధ జ్ఞానముతో అభిమన్య్యుడి వంటి మహావీరుడు నేల రాలిపోయాడు. ఏ పనినయినా, పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే, ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

స్త్రీని అవమానించడం పతనానికి నాంది..

కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం, చివరికి కౌరవులనూ, వాళ్ళ సామ్రాజ్యాన్నీ, నామ రూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమాన పరచడం, పతనానికి దారి తీస్తుంది.

నీకు ఆసక్తి ఉంటే, నిన్ను ఎవ్వరూ ఆపలేరు..

చాలా మందికి తెలిసినంత వరకూ, అర్జునుడే ప్రపంచం మొత్తంలో, అత్యుత్తమ విలుకాడు. కానీ, కుటిల రాజకీయాల వలన, తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురుశిక్షణ లేకున్నా, అతనికి ఉన్న ఆసక్తే, అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున, ఏదైనా సాధించాలంటే, ముందుగా మనకు దానిమీద అమితమైన ఆసక్తి ఉండాలి. లేకపోతే సాధించలేము.

విజయానికి మంచి వ్యూహం తప్పనిసరి..

పాండవుల విజయానికి కృష్ణుడి పకడ్బందీ వ్యూహమే ముఖ్య కారణం. ఏ పని చెయ్యాలన్నా, ఒక మంచి వ్యూహం ఉండాలి. అలా అయితేనే, ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.

మహా భారతం మనకి మన చరిత్రతో పాటు, జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది.. 

కృష్ణం వందే జగద్గురుమ్!

Link: https://www.youtube.com/post/Ugx7EP6hWjwZ7TkW-R54AaABCQ