Ads

Showing posts with label మహాభారతం. Show all posts
Showing posts with label మహాభారతం. Show all posts

24 January, 2021

‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు! Mahabharatam in Telugu


‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు!

కృష్ణ ద్వైపాయనుడూ, గొప్ప రుషీ అయిన వేద వ్యాసుడు, కేవలం మహాభారత గ్రంథరచయితే కాదు, మన ఇతిహాస వేదాలను కూడా సకలనం చేసి, భావి తరాలకూ, యుగయుగాలకూ అందించిన మహోన్నత మహాపురుషుడు. వ్యాసుడు రచింపక ముందు, లక్షల సంవత్సరాల నుండీ, వేదాలు మన భూమండలాన్ని శాసిస్తున్నాయి. ఆనాటి కాలంలో, ఒక తరం నుండి మరొక తరానికి వేదాలు, మౌఖికంగా ప్రచారం కాబడ్డాయి. వారు శబ్ద ప్రాముఖ్యతా, ప్రభావం అర్ధం చేసుకున్నారు కాబట్టి, వేదాలు లిఖితపూర్వకంగా వినియోగించడానికి, నిరాకరించారు. భౌతికంగా, మన వాడుకలో ఉన్నవాటన్నింటిలోకీ, సూక్ష్మమైనది శబ్దం. విద్యుదయస్కాంత శక్తి, దీని పైస్థాయికి చెందింది. మన మెదడులో తిరిగేది కూడా, అదే శక్తి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bDCCIC1IwDk ]

అతి సూక్ష్మమైన శబ్ద ప్రాముఖ్యతను తెలుసుకుని, దానిని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చో గుర్తించారు, మన పూర్వీకులు. ఆనాటి కాలంలో, వేదాలను మౌఖికంగా పలకడమే సంప్రదాయం. ఆ సమయంలో, గంగాతీరంలో వచ్చిన 14 సంవత్సరాల సుదీర్ఘ కరవు కారణంగా, ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. పంటలు ఎండిపోయాయి. ఆనాటి నాగరికత చిన్నాభిన్నమైంది. పొట్టనింపుకోవడానికి ఆహార పోషణలో పడిపోయిన ప్రజలు, వేదాలను వల్లెవేయటం, మరచిపోయారు.  సంప్రదాయాలను పూర్తిగా వదులుకున్నారు. ఆ తరువాత కరవు ప్రభావం తగ్గింది. కానీ, నాగరికత నాశనమైంది. ఆ సమయంలోనే, వ్యాసుడు వేదాలను లిఖిత పూర్వకంగా అందించాడు. ఆనాటి సత్యయుగంలో, మానవులకు మానసిక శక్తి ఎక్కువగా ఉన్నందున, మౌఖికంగా ప్రసారం చేయడానికి, తగిన ఙ్ఞాపకశక్తి ఉండేది. కలియుగం సమీపిస్తున్న కొద్దీ, మానవ మానసిక, ఙ్ఞాపక శక్తి తగ్గపోతుండండంతో, భావి తరాల కోసం వ్యాసుడు, గణపతి ద్వారా వేదాలను రాయించాడు. అవే, ఋగ్వేదం, అథర్వణ వేదం, సామ వేదం, యజుర్వేదం. ఇదే సంప్రదాయ వరుస క్రమం, రాను రాను, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం అనే వరుస క్రమం ఏర్పడింది.

వ్యాసుడు సంకలనం చేసిన ఈ నాలుగు వేదాలూ, నేటికీ మానవ చరిత్రలోని అతి గొప్ప లిఖిత ప్రతులుగా పరిగణింపబడ్డాయి. ఆ తర్వాత వ్యాసుడు, అన్ని కాలాల ప్రజలకీ యుక్తమైన ఒక శాశ్వత గ్రంథాన్ని రచించాలని, సంకల్పించాడు. వెంటనే గణపతి ద్వారా, మహాభారతగాధను, అద్వితీయ గ్రంధంగా రచించ పూనుకున్నాడు. వ్యాసుడు వివరిస్తుండగా, అతని శిష్యుడైన వైశంపాయనుడు వింటుండగా, గణపతి లిఖించాడు. అంతటి అత్యద్భుతమైన ఆ గ్రంథాన్ని, దేవతలు దొగిలించారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, ఈ గాథను యుథిష్టరుడి రెండో తరం వారసుడైన జనమేజయునికి వివరించాడు, వైశంపాయనుడు. నేడు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటున్న మహాభారతం, గణపతి లిఖించినది కాదు. వైశంపాయనుడికి జ్యప్తికి ఉన్నది మాత్రమే. ఇప్పుడున్న ఈ 1,00,000 శ్లోకాలూ, వ్యాసుడు చెప్పిన వాటిలో, కేవలం కొద్ది భాగం మాత్రమే. పంచమవేదమైన మహాభారతం 18 పర్వాలూ, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా, ఖ్యాతిగడించింది. 

''యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్'' అంటే, ఇందులో ఏది ఉందో, అదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది మరెక్కడా ఉండదు’ అని దాని అర్ధం. ఎంతో పవిత్ర గ్రంథాలుగా భావించే, భగవద్గీతా, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా, మహాభారతంలోని భాగాలే. ద్వాపర యుగం నాటి సంఘటనల సమాహారంగా విరాజిల్లుతోన్న మహాభారతంలోని ఘట్టాలూ, సన్నివేశాలూ, నేటి కాలానికి, అనేక పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిలో దాగిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం..

జీవితంలో గెలవడానికి జాలీ, దయా, మంచితనం మాత్రమే ఉంటే చాలదనీ, పరిస్థితులూ, సమయాన్ని బట్టి నడుచుకోవాలనేది, కర్ణుడి పాత్ర తెలియజేస్తుంది. మంచితనానికీ, ధానగుణానికీ, కర్ణుడు మారుపేరుగా నిలిచినా, సమయాన్ని బట్టి నడుచుకోకుండా, అధర్మంవైపు నిలబడి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

చెడు స్నేహం జీవితం నాశనం చేస్తుందని, శకుని జీవితం వివరిస్తుంది. కౌరవులతో స్నేహం నటిస్తూనే, వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి, పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. 

బేధాలు చూడని నిజమైన స్నేహం, జీవితంలో, ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి, కృష్ణుడూ, కర్ణుడి పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడూ, కౌరవుల పక్షాన కర్ణుడూ నిలిచి, ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో, అందరికీ తెలిసిందే. 

మనకి సంబంధించిన దాని కోసం, ఎంత కష్టమైనా పోరాడాలని, పాండవుల దృఢవైఖరి తెలియజేస్తుంది. కౌరవులతో పోల్చుకుంటే, పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కానీ, పాండవులు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్దితో పోరాటం చేసి, విజేతలుగా నిలిచారు.

పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి, ధ్రుతరాష్ట్రుడు ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమా, ఇంకోవైపు తాను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య, ధ్రుతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసినా, వారు చేస్తోన్న దురాగతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక, క్రమశిక్షణలో పెట్టి ఉంటే, విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా, అతి ప్రేమ, అతి నమ్మకం, నాశనానికీ, మోసానికీ దారితీస్తాయి.

విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతనడానికి, అర్జునుడు ఉదాహరణ. తన జీవితం ఆసాంతం, విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుడి నుంచి అస్త్ర విద్యలూ, ఇంద్రుడి నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగం, మహదేవుడి నుంచి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుంచి రాజనీతులను, ప్రతీ దశలోనూ అభ్యసించడమే, అర్జునుడిని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. నిత్యం నేర్చుకోవడం వలన, కచ్చితంగా విజయం వరిస్తుందనడానికి, అర్జునుడి పాత్ర కీలకం.

కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనడానికి, మహాభారతంలో కొన్ని పాత్రలున్నాయి. విదురుడూ, ద్రోణుడూ, భీష్ముడూ, కౌరవుల పక్షాన ఉన్నా, పాండవులకు సహాయపడ్డారు.

మహిళలను ఆపదల నుంచి కాపాడాలనీ, అలా కాకపోతే అనర్థాలు తప్పవనడానికి, ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల, ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం, చివరికి వారినీ, వారి సామ్రాజ్యాన్నీ, నామ రూపాలు లేకుండా చేసింది.

అనేక అడ్డంకులు ఎదురైనా, భారీగా గాలీ వానా కురుస్తున్నా, కంసుడి బారి నుండి కృష్ణుడిని రక్షించడానికి వసుదేవుడు, కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకుని వెళ్ళాడు. పరిస్థితులకు ఎదురీది, కృష్ణుడిని కాపాడాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, మన కర్తవ్యం మనం నెరవేర్చాలి.

ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యను నేర్పించేందుకు, అంగీకరించలేదు. కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోలేదు. అయినా, మొక్కవోని దీక్షతో, తనపై తనకున్న నమ్మకంతో, విలువిద్యలో మంచి పట్టును సాధించాడు.

ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించి, అనుకున్న పనిని పూర్తిచేయాలి. ఫలితం మీద దృష్టి పెట్టడం వలన, చక్కటి పనితీరును ప్రదర్శించలేరు. ఏకాగ్రత లోపం, ఏర్పడవచ్చు. 

ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయాన్నే, కృష్ణుడు మహాభారతంలో, స్పష్టంగా వివరించాడు. మార్పు అనేది, ప్రకృతి యొక్క సహజ ధర్మం. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే, తన జీవితంలో అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కున్నాడు. కన్నవారు ఒకరు, పెంచినవారు ఒకరు. గోకులంలో, అలాగే బృందావనంలో, ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. అయితే, తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం, ఆ ప్రదేశాలను విడిచి వెళ్లవలసివచ్చింది. అదే విధంగా, రాధతో ప్రేమలో పడినా, రుక్మిణిని పెళ్లాడాడు. జీవితంలో ఎదురైన అనేక మార్పులనూ, పరిస్థితులనూ, చక్కగా ఎదుర్కున్నాడు. 

శ్రీకృష్ణుడు, జన్మించిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు.. ఆ విధంగా కంసుడి బారి నుంచి రక్షింపబడ్డాడు. గోకులాన్నీ, తన స్నేహితులనూ విడిచాడు. అందువలన రాక్షసుడు వధించబడ్డాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరగినప్పుడు, శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. కృష్ణుడిపై ఆమె నమ్మకం, వమ్ము కాలేదు. ధర్మాన్ని నిలబెట్టాడు. తన గతజన్మలో పాపాల వలన, తానీ విధమైన ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుందా? అని ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించినప్పుడాయన, ‘బాధలకు గురయ్యే వారు, గతజన్మలో పాపాలు చేసినవారు కాదు.. పాపాలు చేసే వారే, గతజన్మలో కూడా పాపి అవడం వలన, అదే ఫలితాన్ని అనుభవిస్తున్నాడు’ అని వివరించాడు. అందువలన, ఏది జరిగినా మంచికే జరుగుతుందని, మహాభారతం స్పష్టం చేస్తోంది.

మహాభారత యుద్ధం తరువాత, శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు, ఆమె కృష్ణుడిని శపించింది. కృష్ణుడి వంశం కూడా, తన వంశం నాశనమైన విధంగానే నాశనమవ్వాలని కోరుకుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా, కృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని, ఆమె తన బాధను వెళ్ల గ్రక్కింది. కృష్ణుడు కేవలం ధర్మం వైపు నిలబడి, దానిని గెలిపించాడు.

ఇటువంటి అనేక అంశాలు, మహాభారతం నుండి మనం గ్రహించవలసిన జీవిత సత్యాలు. వీటి వెనకున్న అర్థాలను గ్రహిస్తే, ఆ వ్యక్తి జీవితం, ఎంతో బాగుంటుంది. ఎటువంటి మానసిక సంక్షోభాలకూ గురవ్వడు. జరిగేదంతా మంచికేనని అర్థం చేసుకుంటాడు. ప్రతివ్యక్తి లక్ష్యం, ధర్మాన్ని కాపాడటం అయి ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత:

Link: https://www.youtube.com/post/UgwCa7RQRaRYfvCz3yF4AaABCQ