పరమేశ్వరుడికి శాస్త్రం ముఖ్యమా, భక్తి ముఖ్యమా? శ్రీకృష్ణుడికీ ఉజ్జయినీ మహాకాళుడికీ సంబంధం!
శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే ।
శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః ।।
శివకేశవులకు బేధం లేదనే విషయాన్ని, మన వేదాలూ, పురాణాలలోని కొన్ని సంఘటనలూ, సుస్పష్టంజేస్తున్నాయి. హరిహరులు వేరుకారు, ఒక్కరే అన్న విషయాన్ని, మరింత రూఢి పరుస్తుంది, జగత్ ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయం. ఎన్నో లక్షల సంవత్సరాల నాటి ఆలయం, పరమశివుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం, అలనాటి అవంతీ పట్టణంలో ఉంది. ఆ పరమేశ్వరుడు భక్తులను రక్షించడానికి కొలువుదీరిన ఈ క్షేత్రం, పరమ పవిత్రం. సాక్షాత్తూ ఆ రుద్రుడే మహాకాళుడిగా వెలసిన పుణ్య క్షేత్రం వెనుక దాగిన గాథేంటి? అవంతీ నగరంలోని ఆలయ ఆవిర్భావానికీ, శ్రీ కృష్ణుడు గొల్లవాడైన నందుడి ఇంట్లో పెరగడానికీ, సంబంధం ఏంటి - వంటి విషయాలతోపాటు, సాక్షాత్తూ కృష్ణ పరమాత్ముడిని బిడ్డగా పొందడానికి, ఆ నందుడు చేసుకున్న గత జన్మ సుకృతాన్ని గురించీ తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూడండి..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/IALh_QX2n0c ]
అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం ।
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం ।।
మనకున్న సప్త మోక్ష పురులలో ఒకటి అవంతి. అదే నేటి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణమిది. నిత్యం వేదఘోషతో అలరారిన అద్భుత నగరం. ఇంద్రద్యుమ్నుడూ, విక్రమాదిత్యుడూ, భోజరాజూ, కాళిదాసూ, వరాహమిహురుడూ, చంద్రగుప్తుడూ, బ్రహ్మగుప్తుడూ, అశోకుడూ వంటి మహావీరులు పాలించిన ప్రాంతం, ఉజ్జయిని. పరమేశ్వరుడు మహాకాళుడిగా, పార్వతీదేవి మహాకాళిగా ఆవిర్భవించిన లయకారక మహా క్షేత్రమిది. ఈ పట్టణంలో, మహాకాళేశ్వరుడు స్వయంభువుగా వెలియడం వెనుక, ఒక గాథ దాగి ఉంది.
పూర్వకాలంలో, ఉజ్జయినీ పట్టణంలో, వేదప్రియుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతను త్రికాలములలో సంధ్యావందనం చేస్తూ, శివార్చనా శీలుడై, వేదం ఏం చెప్పిందో, దానిలో అపారమయిన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురూ సుగుణోపేతులే. అతని కుమారులు, దేవప్రియుడూ, ప్రియ మేథుడూ, సుకృతుడూ, సువ్రతుడూ, నలుగురూ తండ్రికి తగ్గ కుమారులే. అయితే, వారి గ్రామానికి ప్రక్కనే ఉన్న పర్వత శిఖరాలలో, దూషణుడనే రాక్షసుడు, తన సైన్యంతో కలసి, అందరినీ ఇబ్బంది పెడుతుండేవాడు. తనను తప్ప, మరే దేవుడినీ పూజించకూడదని షరతు విధించాడు. కానీ, ఉజ్జయినిలో వేదప్రియుడి నలుగురు కుమారులూ, శివార్చన చేయడం మానలేదు. ఆ విషయం తెలుసుకున్న దూషణుడు వాళ్ళ దగ్గరకు వచ్చి, 'మీరు నన్ను మాత్రమే అర్చించాలి. మీరు శివపూజను విడిచిపెడతారా? లేక ఈ లింగమును ధ్వంసం చేయమంటారా?' అని గద్దించాడు. రాక్షసుడి మాటలకు, వాళ్ళు కనీసం బెదరకుండా, కదలకుండా పూజలో నిమగ్నమై, శివ నామ స్మరణ చేస్తూనేవున్నారు.
దాంతో కొపోద్రిక్తుడైన దూషణుడు, ఈ నలుగురు పిల్లల మీదకూ కత్తి దూయబోయాడు. వెంటనే వారు పూజించే పార్థివ లింగం నుండి, మహాకాళ స్వరూపంలో పరమేశ్వరుడు, ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యాడు. స్వామి అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ, ఒక్కసారిగా హుంకరించాడు. ఆ వేడికి దూషణుడూ, అతని సైన్యం, బూడిద రాశులయ్యారు. భగభగమండే ఆ వేడికి రాక్షసులందరూ మాడిపోయినా, ఆయన చెంతనే కూర్చున్న బ్రాహ్మణ కుమారులకు మాత్రం, ఆ సెగ కూడా తగలలేదు. వారు పరమేశ్వరుడి దివ్య దర్శనానికి ఆనంద పరవశులై, పరి పరి విధాలా స్తుతించారు. స్వయంభువుగా ఆ ప్రాంతంలో వెలసి, భక్తులను కాపాడమని వారు వేడుకోవడంతో, భక్త సులభుడైన పరమేశ్వరుడు, స్వయంభువు లింగంగా, మహాకాళేశ్వరుడిగా, ఉజ్జయినిలో అవతరించాడు. ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులలో ఉంటాయి. క్రింద ఉండేది మహాకాళ లింగం, మధ్యలో ఓంకార లింగం, ఆపైన నాగేంద్ర స్వరూపమైన లింగం, ఉంటాయి. సాధారణంగా భక్తులు దర్శనం చేసుకునే లింగం, క్రింద ఉండే మహాకాళ లింగం. నాగేంద్ర లింగాన్ని, కేవలం నాగుల చవితి నాడు మాత్రమే దర్శించుకోవడానికి, అనుమతి ఉంటుంది.
ఉజ్జయిని ఆలయంలో ఉండే మరో లింగం, కోటేశ్వర మహాకాళ లింగం. ఈ ఆలయానికీ, కృష్ణ పరమాత్ముడిని పెంచిన తండ్రి, గొల్ల వాడైన నందుడి గత జన్మకూ, సంబంధం ఉంది. చంద్రసేనుడనే మహారాజు, ఉజ్జయినీ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. అతని భక్తికి మెచ్చి, పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు, చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. 'ఈ మణిని నీవు కంఠ హారంగా ధరిస్తే, అది రాగీ, ఇనుమూ, ఇత్తడీ, దేనిని తగిలినా, అవి బంగారంగా మారిపోతాయి. నీ దేశంలో క్షామం ఉండదు. నీ ప్రజలందరూ, సుభిక్షంగా ఉంటారు' అని చెప్పాడు. చంద్రసేనుడు, ఆ మణిని ధరించే, ధర్మబద్ధమైన పాలనను సాగిస్తుండేవాడు. మిగిలిన రాజులందరూ, చంద్రసేనుడి రాజ్యాన్ని చూసి ఓర్వలేక, అతని సంపదకూ, ఐశ్వర్యానికీ కారణమైన ఆ మణి హారాన్ని కైవసం చేసుకోవాలని, యుద్ధానికి సిద్ధమయ్యారు. వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజు, మూకుమ్మడిగా యుద్ధానికి వచ్చే రాజులను గెలవడం అసాధ్యమని తలచి, ఆ గడ్డు పరిస్థితుల నుండి తనను కాపాడమని, మహాకాళుడిని వేడుకున్నాడు. ఆలయానికి వెళ్ళి, పరమేశ్వరుడిని పరి పరి విధాలా స్తుతిస్తూ, పూర్తిగా శివారాధనలో నిమగ్నమైపోయాడు.
అయితే, ఆ సమయంలో ఒక గోల్ల బాలుడు, తన తల్లితో కలసి, పరమేశ్వరుడి దర్శనం చేసుకోవడానికి, ఆలయానికి వెళ్ళాడు. అయితే, ఆ పిల్లవాడు రాజు చేస్తున్న పూజను చూసి, ఆశ్చర్యపోయాడు. ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్ళినా, వాడి ధ్యాసంతా, రాజు చేస్తున్న శివార్చన మీదే ఉంది. రాజులాగే తాను కూడా శివార్చన చేయాలని తలచి, ఒక గుండ్రాయిని తెచ్చి శివలింగంగా భావించి, ప్రక్కనున్న చెట్ల ఆకులను తెచ్చి పూజచేయడం, ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజ, ఆచారాలతో, నియమ నిష్ఠలతో కూడుకున్నది. కానీ, ఈ బాలుడు చేసే పూజ, భక్తితో నిండినది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు. నైవేద్యం లేదు. కానీ, ఒక్కొక్క ఆకు తీసి, 'శివ' అంటూ పరిపూర్ణ భక్తితో, ఆ రాయి మీద వేస్తున్నాడు. వాడు మనస్సులో, ఆ రాయిని మహాకాళ లింగంగా భావించి, పూజ చేస్తున్నాడు. ఇలా శివార్చనలో పిల్లవాడు నిమగ్నమవ్వగా, తల్లి అన్నం పెట్టడానికి పిలిచింది. ఎంత పిలిచినా పలుకక పోవడంతో, వాడు కావాలని ఆటలో పడి, వినపడనట్లు నటిస్తున్నాడని భావించి, కోపంతో ఆ బాలుడు పూజిస్తున్న గుండ్రాయిని తీసి, దూరంగా విసిరేసింది. ఆకులన్నింటినీ కాలితో నెట్టేసింది. ఇంట్లోకి రా, అన్నం పెడతాను అని కసురుకుని, లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో పిల్లవాడు కళ్ళు తెరిచాడు.
ఎదురుగా పెట్టిన శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. తన స్వామిని రమ్మని పిలిచాడు. స్వామి కనపడలేదన్న బెంగతో, మూర్ఛిల్లాడు. తనకోసం అంతగా పరితపించిపోతున్న ఆ పిల్లవాడిని చూసిన శంకరుడు, పరవశించిపోయాడు. వెంటనే అక్కడ, బంగారు కాంతులతో, ధగధగ మెరిసే గోపురంతో, ఒక పెద్ద దేవాలయం, అందులో పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద, పట్టు పంచెతో కూర్చుని, పూజ చేస్తున్నాడు. వాడికి సమస్తమయిన శివజ్ఞానం భాసించింది. శాస్త్రోపేతంగా చేస్తున్న మంత్రోఛ్ఛారణల ఘోష ఆ తల్లికి వినపడి, బయటకు వచ్చి చూసి, తెల్లబోయింది. నీవు భక్తితో శివ పూజ చేస్తున్నావని తెలియక, నేను తప్పుచేశాను. నీ వలన నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ.. అంటూ, బిడ్డను గట్టిగా హత్తుకుని, ఆనందంతో పరమేశ్వరుడికి నమస్కరించింది. ఆ సమయంలో, 'హనుమంతుడు' అక్కడ ప్రత్యక్షమై, 'ఎవరు నొసట భస్మరేఖలను పెట్టుకుంటారో, లలాటమునందు విభూతిని ధరిస్తారో, మెడలో రుద్రాక్షమాల ధరించి ఉంటారో, స్వప్నకాలమందుసైతం శివనామమును స్మరిస్తుంటారో, వారికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి శాస్త్రాలూ, వేదాలూ, మంత్రాలూ ఏమీ తెలియక పోయినా, పరమేశ్వరుడిని నమ్మాడు. ఆర్తితో పూజించాడు. అందుకే, ఈ బాలుడు గోప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు.
ఈ బాలుడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత, సాక్షాత్తూ పరబ్రహ్మమే, గోపాలబాలుడిగా ఈ భూమ్మీద నడయాడుతాడు. అప్పుడు ఈ బాలుడు నందునిగా, శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రిగా, తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు.' అని శివభక్తి విశేషమును ఆవిష్కరించి, వారిని ఆశీర్వదించి, అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రసేనుడు, అక్కడ వెలసిన స్వామి వారిని చూసి, పరమానంద భరితుడయ్యాడు. అయితే, ఈ వార్త ఊరంతా పాకింది. రాజ్యం బయట యుద్ధానికి సిద్ధమైన శత్రు సైన్యాలకూ, తెలిసింది. వారు ఆశ్చర్యంతో, అంత భక్తి పరిపుష్టి కలిగిన ఆ బాలుడున్న రాజ్యంపై యుద్ధం చేస్తే, తమ బ్రతుకులు ఏమవుతాయో, తమ వంశములు ఏమవుతాయో అని భయపడి, చంద్రసేనుడికి క్షమాపణలు చెప్పి, యుద్ధాన్ని విరమించుకుని, తిరిగి వెళ్ళిపోయారు.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడికి, అసురసంధ్య వేళలో, చిత్ర విచిత్రమైన నీరాజనములు సమార్పిస్తారు. దానికోసం, ప్రత్యేక మహంతులు కూడా వస్తారు. దీపారాధనతో కూడిన జ్వాలను, మహాకాళేశ్వరుడికి నీరాజనంగా చూపించేముందు, కోటేశ్వర మహాకాళుడికి పూజ చేసి, నీరాజనములు ఇచ్చి, ఆ తరువాత మహాకాళేశ్వరుడికి ఇస్తారు. కాబట్టి, మహాకాళేశ్వరుడిని దర్శించే వారు, తప్పక కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా, చేసుకోవాలి. ఉజ్జయినీ మహాకాళేశ్వరాలయంలో, సంవత్సరానికి ఒకసారి, వర్షాకాలానికి ముందు, పంటలు బాగా పండాలనీ, సరైన సమయంలో వర్షాలు కురవాలనీ, ‘పర్జన్యానుష్టానము’ చేస్తారు. ఇది పూర్తి అవగానే, ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి, వర్షం కురుస్తుంది. ఇప్పటికీ, ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోందంటే, అతిశయోక్తి కాదు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే, శంఖు యంత్రం ఉంది. శంఖం విజయానికి గుర్తు. అందుకే, మహాకాళేశ్వరుని దర్శనం చేసుకున్నవాడు, ఎందులోనైనా విజయాన్ని పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. కోరిన కోర్కెలు తీరుతాయి. ఈ ఆలయంలో, వేల సంవత్సరాల నుంచీ, రెండు జ్యోతులు వెలుగుతున్నాయి. ఈ రెండు జ్యోతులనూ, అఖండ దీపములని పిలుస్తారు.
ఇక ఈ దేవాలయంలో జరిగే భస్మాభిషేకం, మరింత ప్రత్యేకం. ఆలయంలోని భస్మ మందిరంలో ఉన్న లింగానికి, భస్మాభిషేకాలు చేస్తారు. అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆవు పిడకలను కాల్చిన తరువాత వచ్చే భస్మంతో చేసే, అభిషేకం. దీనిని అందరూ వీక్షించవచ్చు. మరొకటి, తెల్లవారు జామున 4 గంటల సమయంలో, శవభస్మముతో చేసే అభిషేకం. ఇది నాగసాధువుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ అభిషేకానికి, కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ఈ ఆలయంతో పాటు, ఈ పట్టణం కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బలరామ కృష్ణులు విద్యాభ్యాసం చేసింది కూడా, ఇక్కడే. వీరి గురువైన సాందీపని ముని ఆశ్రమాన్ని, నేటికీ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడున్న గోపాల మందిరాన్ని కూడా, తప్పక దర్శించి తీరాలి. అంతేకాకుండా, భారత శాస్త్రీయ భాషయిన సంస్కృత భాష అధ్యయన కేంద్రంగా పేరుగాంచిన కాళిదాస్ అకాడమీ, జై సింగ్ రాజు నిర్మించిన వేదపాఠశాలా, ఖగోళశాస్త్ర అధ్యయనాలకు ప్రసిద్ధి చెందిన విక్రం విశ్వవిద్యాలయం, ఈ ఉజ్జయినీ నగరంలోనే కొలువుదీరి ఉన్నాయి. ఉజ్జయినీ, ఆధ్యాత్మిక ప్రాంతంగా మాత్రమే కాక, విజ్ఞాన కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. ఈ ప్రాంతం, శివ, కేశవ భక్తులకూ, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి భక్తులకూ, అత్యంత పవిత్రమైనది.