Ads

Showing posts with label పంచభూతాల 'ప్రాణ శక్తి'!. Show all posts
Showing posts with label పంచభూతాల 'ప్రాణ శక్తి'!. Show all posts

22 June, 2021

పంచభూతాల 'ప్రాణ శక్తి'!

 

పంచభూతాల 'ప్రాణ శక్తి'!

ఆయురారోగ్యాలు ఉంటేనే, మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరి సంపదలూ, పదవీ వైభవాలు ఎన్ని ఉన్నా, వాటిని అనుభవించాలంటే, మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడయ్యి ఉండాలి. ఈ దేహమనే యంత్రం దృఢంగా, పది కాలాల పాటు సక్రమంగా పని చేయాలంటే, దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధార పడినట్లు, ప్రాణం పైనే దేహం పని తీరు ఆధార పడి ఉంటుంది.

[ సప్త చక్రాలూ వాటివెనుక వున్న 'అద్భుత సైన్స్'! = https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gbf0SATAiKQiEtlw4vmPv5I ]

మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్త ప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకూ కావలసిన శక్తి, ప్రాణంనుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా, ప్రాణం మెలకువగానే ఉండి, జీర్ణ శ్వాస క్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది.

ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం, మనిషిలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? హృదయగుహలో పురీతత్‌ అనే నాడీ మండలంలో, ఆత్మ నీడగా, ఆత్మను అనుసరించి, మనస్సుతో అనుసంధానమై, జ్యోతిరూపంగా, ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. సృష్టిలో, అది రెండు మహాకార్యాలను నిర్వహిస్తుందంటుంది శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివి, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచభూతాలనూ, సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనో బుద్ధులనూ సమైక్యపరచి, జీవసృష్టి చేయడం, వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం, ఈ రెండు పనుల్లో భాగంగానే, ప్రాణం శరీర ధారణ, శ్వాస ధారణ చేస్తుంది.

శరీరాన్ని అంటి పెట్టుకున్న ప్రాణం, ఆ శరీరాన్ని కాపాడేందుకు, విశ్వమంతా నిండి ఉన్న మహా ప్రాణంతో, అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణ వాయువును, శ్వాస రూపంలో గ్రహిస్తుంది. సూర్యుడి ప్రాణ శక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణంచేసి, దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగేందుకు వీలుగా, ప్రాణం తనను తాను, అయిదు విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగూ లేని సూర్యకిరణం పట్టకంలో ప్రవేశించి, వివిధ వర్ణాలుగా వెలువడినట్లు, ప్రాణం శరీరాన్ని దాలిస్తే, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, అనే పంచ వాయువులుగా మారుతుంది. వీటినే వాయు పంచకమనీ, పంచ ప్రాణాలనీ అంటారు.

వాయు పంచకంలో మొదటిదైన మూల ప్రాణాన్ని, ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయ స్థానంలో ఉండి, చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపాన వాయువు, శరీరంలోని అధో భాగంలో సంచరిస్తూ, మల, మూత్ర, వీర్య విసర్జన క్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. వ్యాన వాయువు, వేలకొద్దీ నాడుల్లో సంచరిస్తూ, ప్రాణ శక్తిని శరీరమంతా నింపుతుంది. ఉదాన వాయువు, కంఠస్థానంలో ఉండి, మనసును గాఢ నిద్రలోకి దించి, సేద దీర్చి, శాంతిని అందిస్తుంది. సమాన వాయువు, నాభి స్థానంలో ఉండి, జీర్ణ క్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది.

శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే, ఆరోగ్యం.. లేకపోతే అనారోగ్యం. ప్రాణ శక్తి క్షీణిస్తే, మరణం తప్పదు. దీర్ఘ కాలం మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ప్రాణ శక్తిని పెంచుకోవాలి. ప్రాణ చలనాన్ని నిరోధిస్తేనే, ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే, ప్రాణ చలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే, ప్రాణాయామం. దీర్ఘ శ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే, ప్రాణాయామమంటారు. పూజలూ, యజ్ఞయాగాదుల ఆరంభంలోనూ, ధ్యానయోగ ప్రక్రియల్లోనూ, దీనిని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం, మూడు మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువునూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించడంతోపాటు, చిత్త చాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సునూ, ధ్యానాన్నీ సిద్ధింపజేస్తుంది..

శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/Ugz1gYljrKBCznpRW-54AaABCQ