Ads

Showing posts with label ద్రౌపది - పంచ పాండవుల గత జన్మల రహస్యం!. Show all posts
Showing posts with label ద్రౌపది - పంచ పాండవుల గత జన్మల రహస్యం!. Show all posts

16 August, 2021

ద్రౌపది - పంచ పాండవుల గత జన్మల రహస్యం! Shocking facts about Draupadi’s life in Mahabharata

  


ద్రౌపది - పంచ పాండవుల గత జన్మల రహస్యం!

పంచమవేదంగా భాసిల్లుతోన్న గ్రంధరాజం మహాభారతం. ఇందులో అనేక అధ్యాత్మిక, ధార్మిక విశేషాలు మాత్రమే కాక, ఎన్నో శాస్త్రపరమైన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ధర్మార్ధ కామ మోక్షాలకు సోదాహరణంగా నిర్వచించబడే మహాభారతంలో, ఎన్నో నిగూఢ సత్యాలు దాగి ఉన్నాయి. మహాభారతంలో ఎంతో మంది వీరులున్నా, ధీరులున్నా, మహా మహా నాయకులున్నా, వారందరికీ పోటీనిచ్చే ధీటైన వ్యక్తి, ద్రౌపది. భారతంలో ఆమెది అగ్రస్థానం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Yzs7_uZcMrg ​]

ద్రౌపది పంచ పాండవులను వివాహం చేసుకోవడానికి గల కారణాలు, అనేకం ఉన్నాయి. స్వయంవరంలో గెలుచుకున్న ద్రౌపదిని, తల్లి కుంతీ దేవి మాటతో, తన సోదరులతో పాటు పంచుకున్నాడు అర్జునుడు. అయితే, ద్రౌపది పాంచాలిగా మారడానికి, ఆమె గత జన్మలలోని సంఘటనలే కారణం. ద్రౌపది మొదటి జన్మలో వేదవతిగా, తరువాత మౌద్గల్యుడి భార్య ఇంద్రసేనగా, ఆ తరువాత కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. కాశీరాజుకు జన్మించిన అనామిక, పతి కోసం ఘోరమైన తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

శివ సాక్షాత్కారంతో ఉప్పొంగిపోయిన అనామిక మైమరచిపోయి, పతి, పతి, పతి అని, అయిదుసార్లు పలికింది. ఆ భోళాశంకరుడు తథాస్తు అని, అనామికకు ఐదుగురు పతులను అనుగ్రహించాడు. వారే పంచ పాండవులు. ఈ కథ మనలో చాలా మందికి తెలుసు. కానీ, మార్కండేయ పురాణం ప్రకారం, ద్రౌపది, ఇంద్రుడి భార్య శచీ దేవి అంశ. ఇంద్రుడు చేసిన తప్పిదాల వల్లనే, పాండవుల జననం సంభవించిందా? పంచ పాండవులందరూ ఇంద్రుని రూపాలేనా? పాండవుల జననానికి గల కారణం ఏంటి? ద్రౌపది, అయిదుగురిని తన భర్తలుగా ఎందుకు స్వీకరించింది? పురాణంలో ప్రస్థావించబడిన అసలు కథేంటి - అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

ఒకనాడు వ్యాస మహాముని శిష్యుడైన జైమిని మహర్షికి, మహాభారత కథనంలో కొన్ని సందేహాలు కలిగాయి. వాటి గురించి తెలుసుకుని, తన సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం, మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ‘పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతంలో, కొన్ని విషయాలు రహస్యంగా దాగి ఉన్నాయి. వాటిలోని యథార్థాన్ని నాకు బోధించండి’ అని మహర్షిని అడిగాడు. అందుకు సమాధానంగా మార్కండేయుడు, "జైమినీ, నీ సందేహాలకి తగిన సమాధానాలు, వింధ్య పర్వత గుహల్లో నివసిస్తున్న పక్షులు చెబుతాయి. అవి మామూలు పక్షులు కావు. శాపవశాన పక్షులుగా మారిన ద్రోణ మహర్షి కుమారులు. అవి ధర్మ పక్షులు. మానవుల్లా మాట్లాడగలవు. వాటికి అన్ని విషయాలూ తెలుసు. కాబట్టి, నీవక్కడికి వెళ్లి, నీ సందేహ నివృత్తి చేసుకో" అని చెప్పి పంపాడు. అలా ఆ పక్షుల దగ్గరకు వెళ్లిన జైమిని, వాటిని అయిదు ప్రశ్నలు అడిగాడు. అందులోని రెండవ ప్రశ్న, నేటి వీడియో కథాంశం, "ద్రౌపది అయిదుగురికి భార్య అయిన కారణం". జైమిని మహర్షి అడిగిన ప్రశ్నకు, ఆ పక్షులు ఈ విధంగా సమాధానమిచ్చాయి.

పూర్వం త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశిరుడనేవాడు, శీర్షాసనం వేసి, ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సు ఇంద్ర పదవి కోసమేనని భావించిన ఇంద్రుడు భయంతో, త్రిశిరుడిని సంహరించాడు. అలా బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్న ఇంద్రుడిలో తేజస్సు హరించుకుపోయి, ధర్మదేవతలో ప్రవేశించింది. తన కుమారుడిని ఇంద్రుడు సంహరించాడన్న విషయం తెలుసుకున్న త్వష్టప్రజాపతి ఆగ్రహాంతో, తన జటను పీకి, అగ్నిహోత్రంలో వేశాడు. వెంటనే మహాభీకర శరీరంతో, జ్వాలలను మాలలుగా ధరించి, వృత్తుడనే అసురుడు ఉద్భవించాడు. మహాపరాక్రమవంతుడైన వృత్తాసురుడు, తనను చంపడానికే జన్మించాడని తెలుసుకుని ఇంద్రుడు, ఆ అసురుడి దగ్గరకు దూతలను పంపి, సంధి చేసుకున్నాడు. కానీ, ఏనాటికైనా వృత్తాసురుడి నుండి ముప్పు తప్పదని గ్రహించి, ఇచ్చిన మాటను తప్పి, వృత్తాసురుణ్ణి వంచించి, వధించాడు. ఆ అసురుడు కూడా త్వష్ట ప్రజాపతి కుమారుడే కావడంతో, తిరిగి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. దాంతో, తన శక్తి మరింత క్షీణించి, అతడిలో ఉన్న తేజస్సు తొలగిపోయి, వాయుదేవునిలో ప్రవేశించింది. తరువాత ఇంద్రుడు, గౌతమ ముని భార్య అహల్యని రహస్యంగా, మారువేషంలో వచ్చి అనుభవించడంతో, మరికొంత తేజస్సూ, బలం, క్షీణించాయి. అతడి లావణ్యం, తేజస్సూ, అశ్వినీ కుమారుల శరీరంలో ప్రవేశించాయి.

ఇదిలా ఉండగా, ఎంతో బలవంతులైన అసురులు, మదోన్మత్తులైన రాజులుగా, భూలోకంలో జన్మించారు. వారి భారాన్ని తట్టుకోలేని భూదేవి, దేవతలతో తన గోడు చెప్పుకుంది. ఆమె బాధలను విన్న దేవతలు, తమ తేజోభాగాలతో, స్వర్గం నుండి వచ్చి, భూలోకంలో అవతరించారు. అలా, కుంతీ దేవికున్న మంత్ర ప్రభావంతో, ధర్మదేవతలోని ఇంద్ర తేజస్సు ఆమె గర్భంలో చేరగా, ధర్మరాజు జన్మించాడు. వాయుదేవుడిలోని ఇంద్ర తేజస్సుతో, భీముడు పుట్టాడు. ఇంద్రుడి అర్ధ తేజస్సుతో, అర్జునుడు ఉద్భవించాడు. ఇక ఇంద్రుడి లావణ్యాన్నీ, తేజస్సునూ పొందిన అశ్వినీకుమారుల వలన, నకుల-సహదేవులు జన్మించారు. ఇలా తన అయిదు అంశలతో, భూలోకంలో పంచపాండవులుగా అవతరించాడు, ఇంద్రుడు.

ఇక పాండవులకు భార్య అయిన ద్రౌపది, అయోనిజగా, అగ్నిగుండం నుండి ఉద్భవించింది. ద్రుపదుడు చేసిన యాగంలో, శిశువుగా కాకుండా, కన్యగానే పుట్టింది ద్రౌపది. ఇంద్రుడి భార్య శచీ దేవే, ద్రౌపదిగా భూలోకంలో ఆవిర్భవించింది. అందుకే, ఇంద్రుడి అంశలైన పంచ పాండవులను భర్తలుగా స్వీకరించింది. పాండవుల ద్వారా ద్రౌపదికి అయిదుగురు కుమారులు కలిగారు. ధర్మరాజుకూ, పాంచాలికీ ప్రతివింధ్యుడూ, భీమునికి శ్రుతసోముడూ, అర్జునుడికి శ్రుత కీర్తీ, నకులుడికి శతానీకుడూ, సహదేవునికి శ్రుత సేనుడూ కలిగారు. అయితే, వీరందరూ కురుక్షేత్రంలో ఉండగా, తన తండ్రి అయిన ద్రోణుడిని సంహరించారన్న కోపంతో, అశ్వత్థాముడు రాత్రికి రాత్రే, ద్రౌపది కుమారులను సంహరించాడు.

ఉపపాండవులైన వీరు, అవివాహితులుగా, అనాథలుగా ఎందుకు చంపబడ్డారు? ఇచ్చిన మాట కోసం రాజ్యాన్నీ, సకలాన్నీ కోల్పోయిన సత్య హరిశ్చంద్రుడి కథకీ, కోపిష్టిగా పేరోందిన విశ్వామిత్రుడి శాపానికీ, భారతంలోని ద్రౌపది కుమారుల మరణానికీ ఉన్న సంబంధమేంటో, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..