దైవము - పురుష ప్రయత్నము!
ఒక రోజు ధర్మరాజు భీష్ముడితో, 'పితామహా, దైవ బలము - పురుషప్రయత్నములలో ఏది గొప్పదో వివరించండి' అని అడిగాడు..
[ అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ = https://youtu.be/t43ByMxiNNs ]
దానికి భీష్ముడు, 'ధర్మనందనా, ఇదే ప్రశ్నను పూర్వము వశిష్ఠుడు, బ్రహ్మ దేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని, నీకు చెబుతాను విను..
క్షేత్రము, మానవ ప్రయత్నము, విత్తనము, ఈ మూడూ వేరు వేరు. మూడూ కలిస్తే కానీ, విత్తనము మొలకెత్తదు. భూమిలో విత్తనము వేస్తే, విత్తనములు మొలకెత్తుతాయి. విత్తనము భూమిలో వేయడానికి, పురుష ప్రయత్నము కావాలి. కేవలము భూమిలో విత్తనము ఉన్నంత మాత్రాన, అది మొలకెత్తదు. కనుక, పురుష ప్రయత్నము కావాలి.
అన్నీ దైవమే చూస్తాడనుకుంటే, ఫలితము రాదు. కనుక పురుష ప్రయత్నము అవసరము. పురుష ప్రయత్నము ఉంటేనే, దైవ బలము కూడా తోడౌతుంది. ఉదాహరణగా, నిప్పురవ్వ చిన్నదే అయినా, బాగా గాలి వీస్తేనే, అది పెద్ద మంటౌతుంది. మనము చేసే పని చిన్నది అయినా, దైవబలము తోడైతే, అది బలపడుతుంది.
నేతితో దీపము పెట్టినప్పుడు, నెయ్యి తగ్గిన తరువాత, దీపము కొడిగట్టి పోతుంది. అలాగే, మనము చేసే పనులలో దైవ బలము లోపిస్తే, ఆ పని విజయవంతము కాదు.
పరశురాముడూ, భృగువూ, బలిచక్రవర్తీ, గొప్ప వాళ్ళే అయినా, వారికి, వారు చేసే పనిలో పవిత్రత లోపించిందిగనుక, దైవ బలము లోపించిందిగనుక, వారు అపజయం పాలయ్యారు.
కనుక, ఏపనికైనా దైవానుకూలము ముఖ్యము. ఏ పనికైనా, పురుష ప్రయత్నమూ, దైవ బలమూ సమానంగా కావాలి. కనుక రెండూ ముఖ్యమైనవే' అన్నాడు భీష్ముడు..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgxrNLykEywAjgTosEF4AaABCQ