Ads

Showing posts with label తిరుమలలో వేంకటేశ్వరుని ఆనందనిలయం!. Show all posts
Showing posts with label తిరుమలలో వేంకటేశ్వరుని ఆనందనిలయం!. Show all posts

13 August, 2022

తిరుమలలో వేంకటేశ్వరునికి ఆనందనిలయం కట్టించిన తొండమాన్ చక్రవర్తి! History of Anandanilayam


తిరుమలలో వేంకటేశ్వరునికి ఆనందనిలయం కట్టించిన తొండమాన్ చక్రవర్తి!

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన
  వేంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి" అన్నది జగమెరిగిన సత్యం..

[వేంకటేశ్వర పద్మావతీ కల్యాణం 3 యుగాల చరిత్ర రహస్యాలు! https://youtu.be/Oteo6hAa0IY]

ప్రస్తుతం కాంచీపురంగా పిలువబడే ఒకప్పటి తొండై మండలం సామ్రాజ్యానికి అధిపతి, తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు..

''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మన మధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యే వరకూ, వేంకటేశ్వరుని అవతారంలో కొండ మీదే ఉంటాను. కనుక నువ్వు నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి, పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం, స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అని అన్నాడు.

వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగానే తక్షణం ఆలయం నిర్మిస్తాను..'' అని బదులిచ్చాడు.

అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలి పోతున్నట్టుగా ఉంది. స్వామి వారు తనకు స్వప్న దర్శనం ఇవ్వడం అంటే, సామాన్యమైన సంగతి కాదు. పైగా, తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యతను అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించ లేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసి పోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.

తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి, ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజ స్థంభంతో సరిపెట్టకుండా, బ్రహ్మాండంగా కట్టించాలని అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతి కాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైన పాకశాల, సువిశాలమైన గోశాల, గజ శాల, అశ్వ శాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.

ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందు కోసం, కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండు వైపులా దారులు ఏర్పరచారు. సోపానాలు నిర్మించారు. మార్గ మధ్యంలో, అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.

ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలూ పూర్తయిన తర్వాత, విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియ పరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలసి, శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి, వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై, ఆలయమున ఆనంద నిలయంలోకి ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూడటానికి, రెండు కళ్ళూ చాలవు.

వేంకటేశ్వరుడు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో, దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ఏర్పాటుజేశారు. దక్షిణ, తాంబూలాదులు ఇచ్చారు. వస్త్రాలూ, ఆభరణాలూ సమర్పించారు. ఆ విధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.

తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈ విధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని, చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవ రాజులు, తంజావూరు చోళులు, విజయ నగర రాజులూ, దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.

[తిరుమలలో దాగిన రహస్య తీర్థాల మాహాత్మ్యం! https://youtu.be/NP3o-Ynr15w]