ఆరవ రోజు అనగా 21.12.2020 సోమవారము..
6వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ..
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము:
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.
శ్రీకృష్ణ పరమాత్మ రేండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాల్లు పడుకొని ఉంటారు, అందరు పడుకొనే వద్ద వాల్లు మెలుకువగా ఉంటారు. సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దషల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.
ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్ " పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాల్లు ఒక గుర్తుగా చెప్పారు.
లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! " ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవార లేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. "ఎళుందిరాయ్"- మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్" ముణులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా! మరి వాల్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది.
"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు - దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు.
"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి.
"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది..
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..
Link: https://www.youtube.com/post/UgySWnPpiVpBZ5_YZ1d4AaABCQ