ఇరవై ఆరవ రోజు అనగా 10.01.2021 ఆదివారము..
26 వ రోజు - శ్రీ కృష్ణుడి సామర్థ్యం..
ఆండాళ్ తిరువడిగలే శరణం
శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను, వక్షస్థలమును, నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు. వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను "గోపికలారా! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు. మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలెనని కోరిక ఉన్నవారు, వేరోక దానిని కాంక్షించారు కదా? మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహము కలుగుతున్నది" అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను. వారు దానికి 'భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకార బుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము' అని గోపికలు చెప్పారు. అంత శ్రీ కృష్ణ పరమాత్మ 'సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి? దానికి ప్రమాణము ఏమి? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి' అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు అర్ధించుచున్నారు ఈ పాశురములో..
పాశురము:
మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా "శెయ్యాదన శెయ్యోం" మన పూర్వులు చేయనివి చెయ్య కూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతి కేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి. ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై "మేలైయార్ శేయ్-వనగళ్" ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా "నానే తాన్ ఆయిడుగ" నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి "మేలైయార్ శేయ్-వనగళ్" సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.
స్వామిలోని ప్రేమను కనిపెట్టి “మాలే మణివణ్ణా” ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిప్పెట్టేసారు, ఇక ఎక్కడ లోంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. “మార్-గరి నీరాడువాన్” మార్గశీర్ష స్నానం చేయాటానికి మేం వచ్చామయా అని చెప్పారు. అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. “మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన” మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు. అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. “కేట్టియేల్” వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు. అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. “ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ద్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన” నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం ఈ అసాదారణ ఆయుదాలు ఉంటాయికదా.
ఈ మద్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శణ చక్రం కావాలయ్యా అనిడిగాడట. ఇది ఇతరులకు లోంగి ఉండదు అని చెప్పి చూసాడు, ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీవెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమ శివుడు కూడా వేంచేసాడు. అయితే పరమ శివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమ శివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని, ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేసాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగిచూసాడట, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేదికాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట. శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.
ఆనాడు యుద్దరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందంవేసింది, కాని ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలి పోయాయి, ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుజ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలికదా, అందుకే మొట్ట మొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు. శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మన దైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది, ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏంచెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్తలయందు వాడి సేవ చేయవలె. ఇదే శేశత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అను కున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు.
మాకు ఇంకా “పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే” శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా “పల్లాండిశైప్పారే” పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా “కోలవిళక్కే” ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా “కొడియే” ద్వజం కావాలి, ఇంకా “వితానమే” మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు.
ఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, “ఆలిన్-ఇలైయాయ్” అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలం పై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిదిలేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా “యరుళ్” నీ దయ అని స్వామిని కోరారు.
ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేశుడు వెళ్ళడు కనక, తాను దరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళకు అదే చాలు.
తాత్పర్యము:
ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చామ దయచేసి ఆలకింపుము.
భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పఱవంటి వాద్యములు కావలెను. మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి.
వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మఱ్ఱి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతముసాంగోపాంగముగ పూర్తీయగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము.
శ్రీ సూక్తి మాలిక
ఉపాయము, ఫలము _ రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని సుత్తించి, కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు. వ్రేపల్లెలోని పెద్దల కోరికమేరకు యీ మార్గ శీర్షవ్రతాన్ని వర్షాలు కురియటంకోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం. కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమమే! మార్గశీర్ష స్నానమనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్ధం ఇలా చేసే యీ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు యీ (ప్రాశురంలో) కోరుతున్నారు.
(అమృతవర్షిణి - అదితాళము)
ప.. ఆశ్రితవత్సల ! నీల శరీరా!
ఆశ్రితులమురా! కృపజేయుమురా!
అ..ప.. ఆశ్రయించితిమి వటపత్రశాయి!
ఆశ్రితర్డాముల నవధరించరా!
1. చ.. లోకములదరగ ఘోషించేడి నీ
శంఖపుసరి వాద్యముల నీయరా!
మాకోసగిన ఘన వాద్య విశేషము
గైకొని మావ్రత మాచరించెదము
2. చ.. మంగళముల నాలపించువారిని
మంగళమౌ దీపమ్ము, ద్వజమ్మును
మంగళకరమౌ వితానమ్మును
సంగితితో మాకొసగు దేవరా!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..
Link: https://www.youtube.com/post/UgzLJqYWjKo4nLKxiDZ4AaABCQ