చెత్త కుప్పలో వదిలివేయబడ్డ జీవకుడు వైద్య శిఖామణిగా ఎలా ఎదిగాడు?
వైద్య శాస్త్రంలో ఎంతో కీర్తి గడించిన మహానీయుల ప్రస్తావన, మన పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉంది. మొక్కలూ, మూలికలతోనే అంతుచిక్కని వ్యాధులనుండీ, ప్రాణాపాయమైన వ్యాధులనుండీ, ఎన్నో ప్రాణాలను కాపాడిన వైద్యశిఖామణలున్నారు. వారిలో, అపర ధన్వంతరిగా పిలువబడే సుశ్రుతుడి గురించి, మన గత వీడియోలో తెలుసుకున్నాము. సుశ్రుతుడి గురించిన మన వీడియో చూడాలనుకుంటే, దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. మన సనాతన ధర్మ గొప్పతనాన్నీ, మన సంస్కృతిలో ఉన్న ఔన్నత్యాన్నీ చాటి చెప్పే మహానీయుల గాధలను మీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ప్రపంచానికి నాగరికత అంటే తెలియని సమయంలో, ఎన్నో అద్భుతాలు చేసిన మహర్షుల గురించీ, వైద్య ఆచార్యుల గురించీ వీడియోలు అందిస్తూ వస్తున్నాను. అటువంటి వారిలో, బుద్ధుని అంతరంగిక వైద్యుడిగా, మగధ రాజ్యానికీ, బింబిసారుడికీ ఆచార్య వైద్యుడిగా, మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయడంలో మేటి వైద్యునిగా, బౌద్ధ, జైన మత గ్రంథాలలో సైతం స్థానం సంపాదించుకున్న మేధావి, జీవకుడు. బుద్ధుడికీ, జీవకుడికీ పరిచయం ఎలా జరిగింది? అసలు జీవకుడి వృత్తాంతం ఏమిటి - అనే విషయాలతో పాటు, బుద్ధునికి ప్రధాన శిష్యుడిగా, అనుయాయుడిగా మారడానికి ఎటువంటి సంఘటనలు దోహదం చేశాయి - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/3AMFYlYPDVs ]
కొన్ని ఆధారాల ప్రకారం, జీవకుడు రాజగృహనగర వేశ్య కుమారుడు. ఆమె అతడికి జన్మనిచ్చి, చెత్తకుప్పలో వదిలి వెళ్ళిపోయింది. ఆ బాలుడిని మగధ రాజవంశీయుడైన అభయుడు తీసుకువచ్చి, జీవకుడిగా నామకరణం చేసి, అలనా పాలనా చూసుకున్నాడు. యుక్త వయస్సు వచ్చాక, విద్యాభ్యాసం కోసం తక్షశిలకు పంపించాడు, అభయుడు. ఏకసంథాగ్రాహి అయిన జీవకుడు, ఏడు సంవత్సరాలు వైద్య విద్యను అభ్యసించాడు. ఒకనాడు వైద్య గురువైన ఆత్రేయను కలిసి, "తన చదువు పూర్తయిందా?" అని అడిగాడు జీవకుడు. అందుకు గురువు ఒక గడ్డపారను చేతికిచ్చి, తక్షశిలకు ఎనిమిది మైళ్ళ కైవారంలో, వైద్యానికి పనికిరాని మొక్కలను తనకు తెచ్చివ్వమని చెప్పాడు. అలా గురువు గారి మాట ప్రకారం, కొన్నాళ్ల పాటు తక్షశిల చుట్టూ ఉన్న ప్రతీ మొక్కను పరిశీలించాడు. కానీ, అతనికి వైద్యానికి పనికి రాని మొక్కంటూ ఏదీ కనిపించకపోవడంతో, ఒట్టి చేతులతో తక్షశిలకు తిరిగి వచ్చాడు. సంగతి తెలుసుకున్న వైద్య గురువు ఆత్రేయ, జీవకుడి విద్య విజయవంతంగా పూర్తయిందని సంతోషించి, కొంత ధనం చేతబెట్టి, దీవించి పంపించాడు.
అలా జీవకుడు, ప్రకృతిలో పనికిరాని మొక్కంటూ ఏదీ లేదని తెలుసుకోవడమే కాక, ఎన్నో సందర్భాలలో నిరూపించాడు కూడా. అయితే, జీవకుడు విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయంలో, అయోధ్యా నగరంలో, ఒక శ్రేష్టిగారి భార్య, శిరస్సుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా, జీవకుడు ఆమె వ్యాధిని నయం చేశాడు. దాంతో సంతోషించిన శ్రేష్టి, ఆనాటి సోమ్ము ప్రకారం, 12 వేల కహాపణాలనూ, ఇద్దరు నౌకర్లనూ, గుర్రపు బగ్గీనీ బహుకరించి పంపించాడు. ఆ ధనాన్ని తెచ్చి అభయుడికిచ్చి, అతని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆనాటి నుండీ మగధ రాజ్యానికి రాజ వైద్యునిగా, అనేక సేవలు అందించాడు. అప్పటిలోనే జీవకుడు, కపాలాన్ని ఛేదించి, మొదడులోని రెండు యెటిక పాములు, అంటే tape warmsని తీశాడని, బౌద్ధ గ్రంథంలో వివరించబడి ఉంది.
వేరు మూలికలతో కషాయం, లేపనాలూ, పిండికట్లూ, ఔషధగుణాలూగల నూనెలను వాడటం, శస్త్ర చికిత్సలోనూ, పలురకాల వైద్యవిధానాలను అవలంభించాడు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు, ముందుగా రక్తాన్ని గడ్డకట్టించి, ఆ తరువాత పదునైన కొమ్మును వాడి, చికిత్స చేసేవాడు. వైద్యంలో ఎన్నో మెరుగైన పద్ధతులను అనుసరించేవాడు. జీవకుడు వైద్యునిగా, చుట్టు ప్రక్కల అన్ని రాజ్యాలలో ఎంతో పేరుగడించాడు. ఒకనాడు బుద్ధుడికి ఆరోగ్యం పాడైయింది. విపరీతమైన దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలేమి, నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతుంటే, తన శిష్యుడైన ఆనందుడి సలహాతో, జీవకుడిని పిలిపించారు. జీవకుడు వస్తూనే, బుద్ధుడిని ఆనారోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. “దగ్గు వచ్చేటపుడు నోట్లోంచి శ్లేష్మం పడుతుందా? అది విషపు వాసన వేస్తుందా? రోజులో ఎంతసేపు వస్తోంది? పొడిదగ్గు మాత్రమేనా? ఊపిరి తీసుకోవడంలో ఛాతీ నెప్పులున్నాయా?” వంటి అనేక ప్రశ్నలను అడిగాడు జీవకుడు. వాటన్నింటికీ బుద్ధుడు సమాధానాలు చెప్పాక, “మీకు ఉన్నది ఊపిరితిత్తులలో సమస్య. దానికి నేను మూడు మందులు పట్టుకొస్తాను. వాటిని నేరుగా నోట్లోంచి తీసుకోనక్కర్లేదు. మందును మూడు ఫలాల్లో పెట్టి ఇస్తాను. వాటిని మూడు గంటలకోసారి వాసన చూస్తూ ఉండండి. వారం రోజుల్లో ఆరోగ్యం కుదుట పడుతుంది.” అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ మర్నాడు మందు తీసుకువచ్చి, దానిని ఎలా వాడాలో చెప్పి, తిరిగి వెళ్ళబోతుండగా, ఈ మందుకీ, వైద్యానికీ ఖర్చు ఏమైనా ఇవ్వాలా? అని ఆనందుడు అడిగాడు. అందుకు తల అడ్డం తిప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జీవకుడు. ఆ తరువాత కొన్ని రోజులకు జీవకుడు, తన సేవకుడి ద్వారా ఒక రత్న కంబళిని బుద్ధుడికి పంపించాడు. ఆనందుడు ఆ కంబళిని చూసి, రాజుల దగ్గర మాత్రమే ఉండే ఇంత ఖరీదైన రత్న కంబళి, తన దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని విచారణ చేశాడు. జీవకుడు ఉజ్జయిని రాజైన చండప్రజ్యోతుడికి, కామెర్లు తగ్గించాడు. దాంతో అబ్బురపడి, రాజు ఓ రెండు రత్న కంబళీలు బహుమానంగా ఇచ్చాడు. అయితే, బుద్ధుడి బోధనలపట్ల ఆకర్షితుడైన జీవకుడు, ఒక కంబళీని ఆయనకు కానుకగా పంపించాడు. కానీ, బుద్ధుడు ఆ కంబళిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి, ప్రతీ సన్యాసికీ ఓ ముక్కను ఇచ్చాడు. బుద్ధుడు చేసిన పని తెలుసుకున్న జీవకుడికి, బుద్ధుడి ధర్మమార్గంపై మరింత ఆసక్తి ఏర్పడి, ఆయన శిష్యుడిగా మారిపోయాడు.
మరోసారి, బుద్ధుడి కాలికి గాయంకావడంతో, జీవకుడు చికిత్స చేయడానికి వెళ్ళాడు. దెబ్బ బాగా లోతుగా తగలడంతో, కుట్లు వేసి కట్టు కట్టి, మూడు వారాల వరకూ విప్పకూడదని చెప్పి, ఈ దెబ్బ ఎలా తగిలిందని బుద్ధుడిని అడిగాడు. అందుకు ఆనందుడు చొరవ తీసుకుని, బుద్ధుడి మీద కోపం పెంచుకున్న దేవదత్తుడు, రాయిని విసిరాడు. దాని వల్లే ఈ గాయం అయిందని వివరించాడు. ఆ సంగతి విని కోపగించుకున్న జీవకుడు, “మిమ్మల్ని చిన్నప్పటినుండీ కష్టపెడుతూ, ప్రతీ పనికీ అడ్డుతగులుతూ, మీ మీద కోపంతో, ఈర్ష్యతో రగిలే మనుషులను, మీరెందుకు మీ సంఘంలో చేర్చుకుంటున్నారు?” అని ప్రశ్నించాడు. అందుకు చిరునవ్వుతో, “దొంగతనం చేస్తుంటే, ఓ దొంగకి దెబ్బ తగిలింది.. లేదా, కసాయి జంతువధ చేస్తుంటే, ప్రాణాంతకమైన దెబ్బ తగిలింది. వారు నీ దగ్గిరకి వైద్యం కోసం వచ్చారు. అప్పుడు నువ్వు వైద్యం చేస్తావా? లేక వాళ్లు చేసిన పనిని బట్టి, వైద్యం చేయాలా వద్దా అని ఆలోచిస్తావా?” అని తిరిగి ప్రశ్నించాడు. ఛెళ్ళున చెంపమీద కొట్టినట్టు మ్రాన్పడిపోయిన జీవకుడు, మాట తడబడుతూండగా, “రోగి ఎటువంటివాడు, ఏం చేస్తుంటే రోగం తగిలిందీ? అన్న విషయం వైద్యుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోరాదు.” అని సమాధానమిచ్చాడు. అప్పుడు బుద్ధుడు, “ఈ సన్యాసం ఇవ్వడం, సంఘంలో జేర్చుకునే విషయం కూడా అటువంటిదే” అని చిరునవ్వుతో చెప్పాడు.
వారి సంభాషణ ముగిసిన తరువాత, మరో మూడు వారాల్లో కట్టు విప్పడానికి వస్తానని చెప్పి, జీవకుడు వెళ్ళిపోయాడు. మూడు వారాలు తిరిగేసరికి, భగవానుడి కట్టువిప్పడానికి బయల్దేరుతుంటే, శ్రావస్తిలో ఒకరికి ప్రాణపాయంగా ఉంది. తప్పక మీరు రావాలని, రోగి బంధువు కోరడంతో, తప్పనిసరి పరిస్థితిలో అక్కడికి బయలుదేరాడు, జీవకుడు. అయితే, ప్రాణం మీదకి వచ్చిన మనిషికి నయంకావడానికి, చికిత్స చేశాడు. కానీ, ఆయన కుదుట పడడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఆ రోజు సాయంత్రం జీవకుడు, బుద్ధుడి కాలికి కట్టిన కట్టు విప్పడానికి, విహారంలో ఎవరూ లేరన్న విషయం గుర్తుకు వచ్చి, ఏమి చేయాలో తోచని పరిస్థితిలో కళ్ళుమూసుకున్నప్పుడు, మానసిక ప్రకంపనలు కలగడం తెలియవచ్చింది. మనస్సులో ఎవరో తనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థమయ్యింది. దాంతో కాసేపు మౌనంగా ధ్యానం చేయడం మొదలు పెట్టాడు, జీవకుడు. అయితే, తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నది బుద్ధుడేమోననీ, కాలికట్టు ఎలా విప్పాలో చెప్పమని అడుగుతున్నాడేమోననీ భావించి, ఓ సారి ఆ కట్టుకట్టిన విధం, దాన్ని ఎలా విప్పాలో మనసులో విశదంగా, ఒక్కో మెట్టూ గుర్తు చేసుకున్నాడు. తరువాత, ఒక్కసారిగా మనసులో ప్రకంపనలు ఆగిపోయి, ప్రశాంతగా అనిపించింది.
తాను ఆ రోజు బుద్ధుడితో ప్రత్యక్షంగా మాట్లాడిన అనుభూతి కలిగింది. తరువాత మూడు వారాలకు శ్రావస్తి నుంచి వెనక్కొచ్చిన జీవకుడు, హుటాహుటిన వెళ్ళి బుద్ధుని కాలికేసి చూసి ఆశ్చర్యపోయాడు. కట్టు విప్పేసి ఉంది. గాయం మానిపోయి, దాని రూపు కూడా కనబడడంలేదు. నేను ధ్యానంలో మీకు చెప్పిన విధానాన్ని, మీరు నిజంగానే అవలంభించారా? అదెలా సాధ్యం అయింది? అని ప్రశ్నించాడు జీవకుడు. “ఆ రోజు నువ్వు ధ్యానంలో కుట్లు ఎలా విప్పాలో విశదంగా గుర్తుచేసుకున్నావు. దానిని గ్రహించిన నేను, నువ్వు చెప్పినట్టే చేసి, కుట్లు విప్పుకున్నాను. ఎప్పుడైతే ఇద్దరి మానసిక తరంగాలు ఏకం అవుతాయో, అప్పుడు ఆలోచనలు ఒకరికొకరికి తెలియడం, అంత కష్టం కాదు. మాట్లాడుకోవడానికి మనిషి ఎదురుగా ఉండాల్సిన పని లేదు. అందుకే భిక్షువులు ఎంత దూరంగా ఉన్నా, నేనెప్పుడూ వాళ్లతో ఉన్నట్టే.. భౌతికంగా, ఎదురెదురుగా ఉండాల్సిన అవసరం లేదు.” అని బుద్ధుడు ఉపదేశించాడు. అప్పుడు జీవకుడికి అర్థమయ్యింది, బుద్ధుడు కారణ జన్ముడని. నాటి నుండి, బుద్ధుడి ప్రధాన శిష్యునిగా, అనుయాయునిగా మారిపోయాడు, జీవకుడు. ఇంతటి వైద్య పరిజ్ఞానం కలిగిన జీవకుడి గురించి, మన దగ్గరున్న పాఠ్యపుస్తకాలలో గానీ, అందరికీ అందుబాటులో ఉండే గ్రంధాలలో గానీ సమాచారం లేకపోవడం, గమనార్హం.
మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కాలంలో రాజ వైద్యుడిగా ఉన్న జీవకుడు, ఎందరో రాజులకు ప్రాణం పొసి, ప్రాణదాతగా అందరి మన్ననలనూ పొందాడు. మగధ రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యంగా మలచిన బింబిసారుడికి సంబంధించిన మరింత సమాచారం, మన గత వీడియోలో ఉంది. దాని లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.
ధర్మో రక్షతి రక్షితః!