జనన మరణాలు!
ఆ దైవం కంటికి కనిపించడు.. కదిలే కాలమూ కంటికి కనిపించదు.. అయితే, కనిపించని కాలాన్ని మనకు తెలియజెప్పేది, ఆ కనిపించని దైవమే.. అదే, కాలానికీ దైవానికీ ఉన్న అవినాభావ సంబంధం.. మరి ఆ దైవం ఎవరు? ఇంకెవరు?? సూర్య భగవానుడే.. ఆయన కదలికే కాలం కదలిక. అందుకే, సూర్యుని ‘ప్రత్యక్ష దైవం’ అన్నారు. ఇది నిరంతర ప్రయాణం. మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా? ఏమిటా గమ్యం? జననం నుంచి జననం అనే గమ్యానికి చేరడమే, ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం. ఇదేమిటి? జననానికి మరణమే కదా చివరి గమ్యం? అనే ప్రశ్న మీకు కలుగవచ్చు. మరణమే చివరి గమ్యమైతే, అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగి పోయినట్లే. మరి కాలం ఆగదు కదా!
[ అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన కథ - ‘పగ’! = ఈ వీడియో చూడండి: https://youtu.be/t43ByMxiNNs ]
జననానికి మరణం ఓ మజిలీ మాత్రమే. ఇక్కడే మీరు నిశితంగా పరిశీలించాలి. జన్మించిన జీవి, కాలం తీరాక మరణించి, మరో జీవిగా జన్మించి, ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే, ఈ ప్రయాణం, మరణం అనే మజిలీ గుండా సాగుతుంది. అంతే.. ఈ కాల రథానికి సారధి, ‘సూర్యుడు’. ఎందుకంటే, జీవికి ఉత్పత్తీ, ఎదుగుదల, నాశనము అనే మూడు దశలు ఉన్నట్లే, సూర్యుడికి ఉదయమూ, పూర్ణ వికాసమూ, అస్తమయమూ అనే మూడు దశలున్నాయి. బాల భానుడిగా ఉదయించిన సూర్యుడు, మధ్యాహ్నానికి పూర్ణ వికాసుడై, సాయం కాలానికి అస్తమిస్తాడు. నిజానికి సూర్యుడికి అస్తమయం ఉందా? లేదే.. ఇక్కడ ఆయన అస్తమయం, మరొక చోట ఉదయానికి నాంది.. అంతే.. అలాగే, జీవికి మరణం, మరో చోట జననానికి నాంది.. అందుకే, అస్తమయం లేని సూర్యుడు, జననం నుంచి జననం అనే గమ్యానికి చేర్చే సారధి అయ్యాడు. జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియ చెప్పడమే, ఆయన ఉదయ, మాధ్యాహ్నిక, సాయం సంధ్యల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే, ఈ త్రిసంధ్యలలో సూర్యుని ఉపాసించాలనే నియమాన్ని మనకు ఏర్పాటు చేసారు, మన ఋషులు.
సూర్యోపాసన వల్ల తేజస్సు, బలము, ఆయువు, ఆరోగ్యము వృద్ధి పొందుతాయి. అంతేకాదు.. జన్మించిన జీవి, మరో జన్మ అనే గమ్యం చేరాలంటే, ‘మరణం’ అనే మార్గం గుండానే వెళ్లాలని చెప్పాను కదా.. ఈ మరణ మార్గం, సూర్య లోకం గుండానే సాగుతుంది. మరల జన్మే లేక పోతే, కాలం ప్రయాణం ఆగదు కానీ, ఆ జీవికి ప్రయాణం ఆగిపోతుంది. అదే ‘మోక్షం’.. ఆ మోక్ష మార్గమే, పరమాత్ముని సన్నిదికి చేర్చే ‘పరమపద సోపాన మార్గం’. జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియజెప్పడమే, సూర్య గమనం యొక్క సారాంశం. అందుకే, ఆ ప్రత్యక్ష దైవాన్ని, త్రిసంధ్యలలోనూ ఉపాసించాలి. అదే మనం చేసే ఈ జనన-మరణ ప్రయాణానికి, మనం చెల్లించే ప్రయాణ మూల్యం.. సర్వేజనాః సుఖినోభవంతు!
[ గణపతిని పూజించే పాశ్చాత్య దేశాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PU6pP-tN6Ts ]
Link: https://www.youtube.com/post/Ugx4SFmHq5pyQTXcM494AaABCQ