Ads

Showing posts with label గురుపౌర్ణమి. Show all posts
Showing posts with label గురుపౌర్ణమి. Show all posts

13 July, 2022

అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.. స్వార్థం దుఃఖ హేతువు! Selfishness

 

అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.. స్వార్థం దుఃఖ హేతువు!

మనుషులలో అత్యధికులు స్వార్ధపరులే. నేను-నాది అని నిత్యం తపిస్తూ, సంపద కూడబెట్టడమే పరమార్ధమనుకుంటారు. భగవంతుడి సృష్టిని మొత్తం తామే అనుభవించాలనుకుంటారు. ధర్మమా, అధర్మమా అని ఆలోచించకుండా సంపాదించే స్వార్థపరులు, తమ సంపాదనకు సహకరించాలని సృష్టికర్తనే అర్ధిస్తారు. నాకిది, నీకిది అంటూ భగవంతుడికే తమ అక్రమార్జనలో వాటా ఇవ్వజూపుతారు. ఒక కోరిక తరువాత మరో కోరిక తీరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, అంతులేని కోరికలతో సతమతమవుతుంటారు.

స్వార్ధం మనిషి ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. మానవత్వాన్ని మంటగలుపుతుంది. స్వార్థపరత్వం, మాత్సర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఎదుటివారి పతనాన్ని కోరుకుంటుంది. స్వార్థపరుడు లోభిగా మారతాడు. లోభం మనస్సులో ఆశలు రేపుతుంది. దురాశ ధర్మ విరుద్ధమైన పనులను ప్రోత్సహిస్తుంది.

పాండవులకు అయిదు ఊళ్లయినా ఇవ్వబూనని దుర్యోధనుడి స్వార్థం, కౌరవ వంశ నాశనానికి దారితీసింది. తన కుమారుడికే రాజ్యాభిషేకం చేయాలన్న కైకమ్మ స్వార్థపరత్వం, దశరథుడి ప్రాణాలు తీసింది. తన స్వార్థం కోసం ఇతరులను బాధించాలనుకోవడం వినాశకరం.

దానం సర్వ శ్రేష్ఠమైనదనీ, న్యాయార్జిత విత్తాన్ని పాత్రుడికి దానం చేస్తే పరలోకంలో ఉన్నతమైన ఫలం లభిస్తుందనీ, అరణ్యవాస సమయంలో వ్యాసమహర్షి ధర్మరాజుకు ఉపదేశించినట్లు, మహాభారతం చెబుతోంది. పాండవుల మహాప్రస్థానంలో, ఒక కుక్క వారిని అనుసరించింది. దారిలో ద్రౌపది, సోదరులూ పడిపోగా, ధర్మరాజును కుక్క చివరి వరకూ అనుసరించింది. ఇంద్రుడు రథంపై వచ్చి, సశరీరంగా ధర్మరాజును స్వర్గానికి తీసుకు వెళతానన్నాడు. ధర్మరాజు తనను అప్పటిదాకా అనుసరించిన కుక్కకు కూడా స్వర్గప్రాప్తి కలి గించమన్నాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించక పోతే, ధర్మరాజు తానూ స్వర్గానికి రాలేనన్నాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత యుధిష్ఠిరుణ్ని కొనియాడుతూ, ఒక కుక్క కోసం ఇంద్రుడి రథాన్ని కూడా పరిత్యజించిన ధర్మరాజుకు సమానులెవరూ స్వర్గంలో లేరని అన్నాడు. అలా ధర్మరాజు, పరమోత్కృష్టమైన దివ్యగతిని పొంది, సశరీరంగా స్వర్గానికి వెళ్లాడు.

నిస్వార్థ సేవకు ప్రతీక ప్రకృతి. నిస్వార్థంగా సేవ చేయాలన్న సత్యాన్ని మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఇతరుల ప్రయోజనాలు విస్మరించి, అన్నీ తనకే కావాలన్న స్వార్థపరత్వం, దుఃఖానికి హేతువవుతుంది. పరమేశ్వరుడైన తనను నిరంతరం, అనంత భక్తితో చింతన చేస్తూ, నిష్కామ భావంతో సేవించేవారి యోగక్షేమాలను తానే వహిస్తానని, భగవానుడి గీతోపదేశం. భగవంతుడు మనిషికి సేవ చేసే శక్తినీ, బుద్ధినీ ప్రసాదించాడు. నిస్వార్థంగా సేవచేసే వారికి, భగవంతుడి అండ లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు..

మానవ జన్మ ఉత్తమమైనది. మానవుడు జ్ఞానవంతుడు. జ్ఞానానికి వివేకం తోడైతే, మనిషి రాణిస్తాడు. మంచి చెడుల విచక్షణ తెలుసుకుని, స్వార్థాన్ని కట్టడి చేయగలవాడే ఉత్తముడు. ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే, మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పరిఢవిల్లుతాయి. నిస్వార్థ సేవకులతో సమాజం శోభిస్తుంది.

శ్రీ రామానుజులవారు గురువుగారి నుంచి మంత్రోపదేశం పొందారు. మంత్రార్థాన్ని తన ఊరి వారందరికీ బోధించారు. గురువుగారు కోపగించారు. వాగ్దాన భంగం చేసినందుకు, తానొక్కడే నరకానికి వెడతానని, ఎంతోమంది భక్తులు ముక్తిమార్గంలో పరమాత్ముడిని చేరుకో గలిగితే కలిగే ఆనందం, నరకం కన్నా మిన్న అన్న శ్రీ రామానుజుల వారు, పూజనీయులయ్యారు. నిస్వార్థ భావం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

శ్రీ గురుభ్యో నమః