Ads

Showing posts with label గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా?. Show all posts
Showing posts with label గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా?. Show all posts

16 September, 2022

గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా? Scientific Facts About River Ganga


గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా?

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా! నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే, అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా, గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా!’ అని సందేహం వెలిబుచ్చింది.

[ గంగ పవిత్రతకు సాక్ష్యాలుగా నిలుస్తున్న పరిశోధనలు!  = https://youtu.be/gSFGqtO5ABU ]

ఈశ్వరుడు చిరునవ్వుతో.. ‘దేవీ! నీవు నేను చెప్పిన విధంగా చేస్తే, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’ అంటూ, ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతీమాత, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘దయచేసి నా భర్తను కాపాడండి’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలోకి దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, ‘అయ్యా..! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే, వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదే విధంగా, ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాప రహితులు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’ అని హెచ్చరించింది.

ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకు పోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూ.. 'నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా?’ అని అడిగింది. అందుకా వ్యక్తి, ‘అమ్మా! నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడనయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’ అని చెప్పాడు.

పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి, తిరిగి విను వీధులలో విహరించ సాగారు. ‘చూశావా దేవీ! విశ్వాసం ఉంటే, గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’ అని అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది.

పని చేస్తుందా లేదా? అని అనుమానంతో వేసుకుంటే, ఔషధం కూడా పని చేయదు. దేనికైనా నమ్మకం ముఖ్యం..

ఓం నమః శివాయ!