కొత్త జీవితం!
మార్పనేది సృష్టి సహజ స్వభావం. పరిణామక్రమంలో, ప్రపంచం ముందుకు వెళ్తుంటుంది. చలనశీలంలోనే పురోగతి ఉంది. నిశ్చలంగా నిద్రించే చెరువుకూ, నిరంతరం గలగలా ప్రవహించే గోదావరికీ ఎంత తేడా!
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VA4Ieaa6wbE ]
ప్రవహించే మార్గాన్నంతా, నది సస్యశ్యామలం చేస్తుంది. చెరువు గ్రీష్మంలో ఎండి, వర్షరుతువులో మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. జీవనదులు ప్రవహిస్తూనే ఉంటాయి.
అజ్ఞానులూ, అతిస్వార్థపరులూ చెరువులాంటివారు.
అందరికీ తనతో పని ఉంటుంది, తన దగ్గరకే అందరూ వస్తారనుకుంటుంది చెరువు. అలా వచ్చినవారి పొగడ్తలు ఆశిస్తుంది. తన కారణంగానే వారికి ప్రాణరక్షణ జరుగుతోందనే అపోహతో, అహంకరిస్తుంటుంది. నదులు అందుకు భిన్నం!
అనంత జలరాశి సముద్రంకూడా, మధుర జలాలతో తన వద్దకు వచ్చే నదుల నీటికోసం తహతహలాడుతుంది. కానీ, ఎన్ని నదులు కలిసినా, సముద్రజలం రుచి మారదు. ఎందరో ధనపిపాసుల పరిస్థితీ అలాగే ఉంటుంది. కోట్లాది రూపాయల ధన సంపద ఉన్నా, ఇంకా ఇంకా విలువైనవి రాబట్టాలనే తహతహతో ఉంటారు. మంచివారి స్నేహం, మంచిమాటల బోధలతో, వారి స్వభావం కించిత్తయినా మారదు. మారడమన్నది రెండు విధాలు. చెడు నుంచి మంచి, మంచి నుంచి చెడు. మొదటి మార్పువల్ల, జీవితం ఉన్నతస్థితికి చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. రెండోది, శిఖరం నుంచి లోయలో పడటంలాంటిది. దీనినే, ‘వివేక భ్రష్ట సంపాతముల్’ అన్నాడు నీతిశతకకారుడు.
మనలోని లోపాలు, మనకు తెలిసినంతగా ఇతరులకు తెలియవు. వాటిని చాలావరకు బయటపడకుండా కప్పిపుచ్చుకుంటాం. లోపాలు వేరు, దుర్గుణాలు వేరు. దుర్గుణాలు నిప్పులో దాచినా దాగవు. ఏదో సమయంలో అవి బయటపడక తప్పదు.
సృష్టిలో మనిషికి మాత్రమే, తనను తాను సరిదిద్దుకుని, సంస్కరించుకునే సదవకాశం ఉంది. అలా చేసుకోగలిగితే, కొత్తజీవితం మొదలవుతుంది. అక్షరజ్ఞాన శూన్యుడు, కృషితో విద్యావంతుడైతే, నాస్తికుడు సత్యం తెలుసుకుని ఆస్తికుడైతే, బలహీనుడు వ్యాయామంచేసి దృఢకాయుడవుతాడు. పాతజీవితం గతంలో కలిసిపోయి, నవజీవనం ప్రారంభమవుతుంది.
బోయవాడిగా బతికినంతకాలం దారి దోపిడీ దొంగగా, భార్యాబిడ్డల సుఖమే పరమావధిగా గడిపిన వ్యక్తి- నారదుడి బోధతో పాతజీవితాన్ని, చిరిగిన, మలిన వస్త్రంలా విసర్జించాడు. రామనామ తారకమంత్రోపాసనతో, సర్వపాపాల నుంచీ విముక్తుడై, భగవత్సమానుడైన వాల్మీకి మహర్షిగా మారిపోయాడు. ఆనాటినుంచీ, కొత్త జీవితం మొదలైంది.
మనలో చాలామంది, తమలోని లోపాలను సరిదిద్దుకుని, కనీసం శేషజీవితాన్ని పవిత్రంగా, ఆదర్శంగా గడపాలనుకుంటారు. దాన్ని ఆచరణలో పెట్టలేకపోతుంటారు. అందుకు అలసత్వం, సోమరితనం, పట్టుదల లేకపోవడం లాంటివి కారణాలు. ప్రయత్నరహితంగా ఏదీ సాధించలేము. ఏవీ తమకు తాముగా మనకు సిద్ధించవు.
పూర్వకాలంలో, దశలవారీగా జీవితం గడుపుతూ, అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. వార్ధక్యంరాగానే, వానప్రస్థానానికి వెళ్లి, తపోదీక్షతో, గతకాల కర్మలనూ, ఫలితాలనూ దహించివేసి, కైవల్యం కోసం కృషి చేసేవారు. ఇప్పుడు ఎందరినో, చివరి శ్వాసవరకూ, ప్రాపంచిక ప్రలోభాలు వదలడంలేదు. ప్రలోభాలు కామపిశాచాల్లాంటివి. ఒక పట్టాన విడిచిపెట్టవు.
వైరాగ్య, వివేకంతో వాటిని వదిలించుకోవచ్చు. అలా చేయగలిగిన వారందరికీ, కొత్త జీవితం స్వాగతం పలుకుతుంది!
Link: https://www.youtube.com/post/Ugx7EQVH5mp7LMuXs094AaABCQ