Ads

Showing posts with label కార్యా-కారణ సంబంధం!. Show all posts
Showing posts with label కార్యా-కారణ సంబంధం!. Show all posts

23 January, 2021

కార్యా-కారణ సంబంధం!


కార్యా-కారణ సంబంధం!

కుండకు కారణం మట్టి.. కుండలో నుండి మట్టిని తీసేస్తే, కుండ ఉండదు. నగలకు కారణం బంగారం.. నగలలో నుండి బంగారాన్ని తీసేస్తే, నగ ఉండదు. కారణం లేకుండా ఏ కార్యమూ ఉండదని అర్థం. చిన్నతనంలో ఏడు చేపల కథను పరిశీలించండి. వేటకు పోయిన రాజు ఏడు చేపలు తెచ్చి ఎండబెడితే, ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు గడ్డిమోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపా ఎందుకు అడ్డం వచ్చావు ఆవు మేయలేదు. ఆవూ! ఆవూ ఎందుకు మేయలేదు గొల్లవాడు మేపలేదు. ఇలా ఒక కార్యానికి, స్థితికి, కారణం వెతుకుతూ వెళ్తూ వెళ్తూ '' నా పుట్టలో వేలు పెడితే నే కుట్టనా!'' అని చీమ సమాధానం చెబుతుంది. అంటే అసలు కారణాన్ని చెబుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం అదన్నమాట. ఈ కథంతా మనకు తెలియకుండానే కార్య-కారణ సంబంధాన్ని మనకు అవగతం చేయిస్తుంది.

[ విదుర చరిత - మహాభారత కథ! = ఈ వీడియో చూడండి httpsyoutu.beAGnQFCI51O0 ]

అలాగే, సంసారానికి కారణం అజ్ఞానం.. కనుక అజ్ఞానాన్ని తొలగిస్తే, ఇక సంసారం ఉండదు. అజ్ఞానాన్ని తీసేయాలంటే, జ్ఞానం కావాలి. చీకటిని పారద్రోలాలంటే, వెలుగు కావాలి. అలాగే, అజ్ఞానాన్ని పారద్రోలాలంటే, ఆత్మజ్ఞానం కావాలి.. తత్త్వజ్ఞానం కావాలి..

అసలు ఈ కార్యాకారణ సంబంధాన్ని ఎలా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం జరిగింది అనేది కూడా పరిశీలించాలి.. చరిత్రలోకి వెళ్తే, ప్రపంచాన్ని గూర్చి తెలుసుకునే దారిలో, మానవుడు తన మనుగడ కోసం చేసే పోరాటంలో, సాంఘిక ఆచరణ మార్గంలో, కార్యాకారణం పరిశీలించడం మొదలైంది. ఈ ప్రపంచగమన నియమాలు, కార్యాకారణ అభివర్గం ద్వారానే, మన ఆలోచనకు అందుతాయి. ఫలానా దానికి ఫలానాది కారణం అని తెలిసినప్పుడు, ఆ జ్ఞానం మన ఆచరణకి ఆలంభనగా ఉంటుంది. అనేక కార్యాలకు కారాణాన్ని మనిషి తెలుసుకోవడం ద్వారానే, ప్రగతినీ పురోగతినీ సాధించాడు, నాగరికతను సాధించాడు.. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పొంది, సౌకర్యాలను పొందగలుగు తున్నాడు.. కార్యాకారణ సంబంధం గురించిన కచ్చితమైన అవగాహన రావడానికి, ఆచరణ గీటురాయి. ఆచరణ ఫలితాలలోంచే, కారణాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ లోపుగా అనేక కారణాలను ఊహిస్తూ ఉంటాము.

ఫలానా కారణం వల్ల, ఫలానా కార్యం విధిగా రావడంతోపాటు, కారక సంబంధంలో, కాల క్రమం కచ్చితంగా ఉంటుంది. కార్యానికి ముందే, కారణం ఉండి తీరాలి. అయితే, ముందుగా కనిపించేదంతా, ఆ తర్వాత వచ్చే దానికి కారణం కాదు. కార్యత్వ సంబంధం లేకుండా, కొన్ని ఘటనలు జరుగవచ్చు. శీతాకాలం వచ్చింది, తరువాత వసంతం వస్తుంది.. వసంతం రావడానికి, శీతాకాలం కారణం కాదు.. 'పొద్దుటే వీడి మొఖం చూశాను.. ఏం జరుగుతుందో ఏమో!' అని వాపోతారు కొందరు.. పొద్దుటే చూసిన దాన్ని బట్టి, ఘటనలు జరగవు. కారణ సంబంధంలో కూడా, మిగిలిన విషయాలలో లాగానే, భౌతిక వాదులకూ, భావవాదులకూ తీవ్రమైన విభేదం ఉంటుంది. మన కోరికలకు సంబంధం లేకుండా, సంకల్పాలకు ప్రమేయం లేకుండా, కార్యాకారణ సంబంధం ఉందని, భౌతిక వాదులంటారు. కార్యాకారణ సంబంధం కూడా దేవుని సృష్టి అనీ, మహత్తులూ, మహిమలూ ఉంటాయనీ అంటారు.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనేది వీరి వాదన.. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, కార్యాకారణ సంబంధాన్ని సరిగ్గా గ్రహించడం అవసరమని, గతితార్కిక భౌతికవాదం చెబుతుంది..

ఈ కార్యకారణ సంబంధాన్నే, ఉపమానాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ శ్లోకాలలో..

వయసిగతేకః కామవికారః..

వయస్సు అంటే, యౌవనం. యౌవనంలో శరీరం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. నరాలలో పటుత్వం ఉంటుంది, చర్మం బిగుతుగా ఉంటుంది, కండరాలు కఠినంగా ఉంటాయి, రక్తం ఉప్పొంగుతుంది.. అప్పుడు కళ్ళు మూసుకుపోయేంత కామోద్రేకం కలుగుతుంది. దానితో వికార చేష్టలు చేస్తారు.

అయితే, ఆ వయస్సు కాస్తా జారిపోతే, ఈ ఉద్రేకాలు చల్ల బడతాయి. చర్మంలో బిగువు సడలిపోతుంది. నరాలలో పటుత్వం తగ్గుతుంది. రక్తం యొక్క వేగం తగ్గుతుంది. శరీరం ముడతలుపడి, అందవిహీనంగా కనిపిస్తుంది.. కనుక, కామ వికారాలకు కారణమైన యవ్వనం పోతే, కామ వికారాలు కూడా పోతాయి..

క్షీణే విత్తే కః పరివారః..

ఎవడి దగ్గరైనా డబ్బుంటే చాలు, ఆశ్రితులూ, స్నేహితులూ, బంధుమిత్రులూ, అందరూ చేరతారు. డబ్బున్నది గనుక, పనులు చేసి పెట్టటానికి సేవకులు వస్తారు.. అయితే, సొమ్ము పోతేనో.. ధన హీనుడైతేనో.. అతడు ఇక సేవకులను ఏ మాత్రం పోషించే స్థితిలో ఉండడు.. అప్పుడు వారంతట వారే తొలగిపోతారు.. 

ఈ విధంగా, కారణం తొలగితే కార్యం తొలగిపోతుందనే విషయాన్ని ఉపమానాల ద్వారా తెలియజేసి, ఈ సంసారం తొలగాలంటే, దీనికి కారణమైన అజ్ఞానం తొలగాలనీ.. అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కావాలనీ.. కనుక, జ్ఞానం ద్వారా సంసారాన్ని తొలగించుకోమనీ చెబుతున్నారు..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/Ugyu_IkmC4ORhI_YeDN4AaABCQ