కార్యదీక్షాపరుడు ఎలా ఉండాలి?!
హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి, విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన 'నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేను' అని చెప్పాడు.
[ ఔరంగజేబుని హడలెత్తించి పరుగెత్తించిన ఆంజనేయస్వామి! = https://youtu.be/pmdh0JhWyMY ]
అలా ఎందుకంటే, ఒకే చోట కూర్చునుంటే, లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదే వేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్లి పోవడమంటే, ఏ ప్రక్క ఊరికో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టి వస్తాడు. అంత వేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయలుదేరినప్పుడు, దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు, అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం. సాధారణంగా, ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే, మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడ అలా కుదరదు. అలాగని గురువుగారి ప్రక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే, రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల, ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం? గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ, అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచి పెట్టకుండా, నాలుగు వేదాలూ, 9 వ్యాకరణాలూ నేర్చుకున్నాడు.
ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే, ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి..
లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే, అంత వైశిష్ట్యం పొందడానికి కారణం, అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే..
హనుమ జీవితాన్ని ఒకసారి గమనించండి..
ఆయన పుట్టీ పుట్టగానే. సూర్యుడిని చూసి పండనుకుని, ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, ఎడమ దవడ విరిగి, అక్కడినుంచి క్రింద పడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి, ఎన్నో శక్తులు ధారపోశారు.
అన్ని శక్తులు పొందిన హనుమ, తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా?! లోకంలో ఎవ్వరూ, ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను, ఆయనొక్కడే సంకల్పించాడు..
శతయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది, దాటడమే కాకుండా, తానొక్కడే రామభక్తుడిగా ఉండి, చుట్టూ రాక్షసులున్నా, నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి, అంతే వేగంతో తిరిగి వచ్చాడు..
అంతటి బలవంతుడూ, శక్తిమంతుడూ, అంతటి పండితుడూ, వ్యాకరణ వేత్తా, తనగురించి చేసుకున్న పని ఒక్కదాన్ని చూపగలరా?! ఎన్ని గ్రంథాలు వెతికినా, ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి..
శ్రీ ఆంజనేయం!
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాల నుంచి..
Link: https://www.youtube.com/post/Ugzdl22ftuuk8vyMRU94AaABCQ