కచ దేవయానిల గాథ! నేటికీ మానవులు ఎదుర్కొంటున్న శుక్రాచార్యుడి కఠోర శాసనం!
రాక్షస రాజైన వృషపర్వుడి ఆస్థానంలో ఉంటూ, దానవులకు శుక్రుడు ఆచార్యుడిగా ఉండేవాడు. ఇంద్రుడి కుమార్తె జయంతి, శుక్రాచార్యుడి భార్య. వీరికి దేవయాని అనే కుమార్తె ఉంది. మన గత వీడియోలో, శుక్రాచార్యుడు మృత సంజీవనీ విద్యను ఎలా సంపాదించుకున్నాడు? జయంతిని వివాహం చేసుకోవడానికి గల కారణాలూ తెలుసుకున్నాము. చూడని వారి కోసం, ఆ విడియో లింక్ ను, క్రింది డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాను. ఇక ఈ రోజుటి మన వీడియోలో, రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర, మృత సంజీవనీ విద్యను నేర్చుకోవడానికి వచ్చిన, దేవ గురువు బృహస్పతి కొడుకు కచుడి గురించీ, దేవయానీ కచుల భగ్న ప్రేమ గురించీ తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Dx7C2ueSyt4 ]
పూర్వం దేవ దానవ సంగ్రామం తరచుగా జరుగుతూ ఉండేది. దేవతలతో యుద్ధం చేస్తున్న సమయంలో, చనిపోయిన దానవులందరినీ తక్షణమే బ్రతికించేవాడు శుక్రుడు. దాంతో దేవదానవ సంగ్రామంలో దేవతల సైన్యం రాను రాను క్షీణించసాగింది. ఇక దానవ సైన్యం తరుగూ విరుగూ లేకుండా శుక్రాచార్యుని మృత సంజీవని ప్రభావం చేత, నిత్య నూతనంగా ఉండేది. దేవతలకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాగే కొనసాగితే, సంగ్రామంలో దేవతలకు పరాజయం తప్పదని, గురువైన బృహస్పతిని ఆశ్రయించారు. ఆయనను పలు విధాల ప్రార్థించారు. బృహస్పతి ఈ సమస్యకు పరిష్కారంగా, దేవతలలో ఎవరో ఒకరు మృత సంజీవనీ విద్యను, శుక్రాచార్యుడి దగ్గర అభ్యసించి రావాలని, సెలవిచ్చాడు. అందుకు సమర్ధుడు, బృహస్పతి కుమారులలో జేష్ఠుడైన కచుడే అని, ఏకగ్రీవంగా తీర్మానించారు దేవతలు.
కచుడిని సమీపించి, 'ఓ పురుషోత్తమా, శుక్రుని మృత సంజీవని ప్రభావంతో, యుద్ధంలో చచ్చి కూడా బ్రతికేస్తున్నారు రాక్షసులు. మన సేనలు నానాటికీ బలహీనమైపోతున్నాయి. ఇలాగే జరిగితే, మనకు పతనం తప్పదు.' అని సమస్యను సమూలంగా విన్నవించారు. దానికి కచుడు సరేనని చెప్పి, చేయాల్సిన పనిని వివరించమన్నాడు. అప్పుడు దేవతలు, ‘నీవు మహాతేజస్వీ, తపస్వీ అయిన శుక్రాచార్యుని ఆశ్రయించి, విద్యాభ్యాసం చేసి, మృత సంజీవనిని పరిగ్రహించాలి. ఈ కార్యానికి అన్ని విధాలా నువ్వే అర్హుడవు. నీ సదాచార సంపత్తీ, సద్భావనా స్వభావం, మాకు శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ఈ దేవకార్యం తప్పక పూర్తి చేయాలని, పరిపరి విధాలా ప్రార్థించారు. దేవతల విన్నపాన్ని ఆలకించిన కచుడు, రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు బయలుదేరాడు.
శుక్రాచార్యుడిని సమీపించి, దండ ప్రణామాలర్పించాడు. అనేక విధాలా స్తుతించాడు. 'మహాత్మా! నేను కచుడను, అంగీరసుని పౌత్రుడను. బృహస్పతీ పుత్రుడను. మీ వద్ద, విద్యనర్థించ కోరి వచ్చాను. నన్ను మీ శిష్యునిగా అంగీకరించి, కృతార్థుడను చేయండి' అని ప్రార్ధించాడు కచుడు. అతని వాక్కులకు శుక్రుడు ఆనందభరితుడయ్యాడు. 'బృహస్పతీ నందనా! నీవు నాకు ప్రేమపాత్రడవయ్యావు. నిన్ను సత్కరిస్తే, సాక్షాత్తూ బృహస్పతిని సత్కరించినట్లే. నిన్ను అనుగ్రహిస్తున్నాను'. అని కచునికి బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించాడు శుక్రాచార్యుడు.
అది మొదలు, వ్రత నియమాలు పాటిస్తూ, ఇంత మంచి శిష్యుడు లేడనిపించాడు కచుడు. ఆచార్యుడైన శుక్రుడినీ, ఆయన ముద్దుల పుత్రిక దేవయానినీ, నిత్యం సేవిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. పథకంలో భాగంగా, గురుపుత్రిక దేవయానికి మరీ విధేయుడిగా, ఆమె కనుసన్నల్లలో మసలుతూ ఉండేవాడు. నవ యవ్వన శోభతో ఉన్న కచుడు, మధురంగా పాడుతూ, ఉల్లాసంగా ఆడుతూ, యవ్వన వసంత ఊహలలో విహరిస్తున్న దేవయానిని, సంతోషపెట్టసాగాడు. ఆమె కొరినదే తడవుగా, ఫలపుష్పాదులను తెచ్చి ఇచ్చేవాడు. తండ్రీ కూతుళ్లకు ఇలా ఎన్నో సంవత్సరాలు శుశ్రూష చేశాడు, కచుడు. అతను ఒక్క నిముషం లేకపోతే గడిచేది కాదు, శుక్రుడికి. కచుడే సర్వం, సమస్తం అయిపోయింది దేవయానికి. ఇదంతా చూసి సహించలేకపోయారు, దానవులు. కచుణ్ణి ఎలాగైనా సంహరించాలని భావించారు.
కచుడి తండ్రియైన బృహస్పతిపై వారికి గల వైరం ఒక కారణం కాగా, శుక్రాచార్యుని వద్ద ఉన్న మృత సంజీవనీ విద్య ఎక్కడ కచుడికి స్వాధీనమవుతుందో, అనే భయం వారి ద్వేషానికి ప్రబల కారణమైంది. ఒకనాడు అడవిలో ఒంటరిగా ఆవులను కాస్తున్న కచుణ్ణి పట్టుకుని కిరాతకంగా చంపేశారు రాక్షసులు. అతడి శవాన్ని ఓ చెట్టు మొదలుకు కట్టివేసి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సాయంత్రమయ్యేసరికి, పశువులన్నీ ఆశ్రమానికి చేరాయి. కచుడు మాత్రం రాకపోయేసరికి, దేవయాని మనస్సు కీడు శంకించింది. హృదయ వేదనతో రగిలిపోయింది. దేవయాని తండ్రిని సమీపించి, 'నాన్నా! సాయం సంధ్యలో, మీ అగ్ని క్రతువులు పూర్తయ్యాయి. చీకట్లు ముసురుతున్నాయి. ఆవులన్నీ ఆశ్రమం చేరాయి. కచుడు మాత్రం రాలేదు. ఎందుకో గానీ, నా మనస్సు తీవ్రంగా కలత చెందుతోంది. కచుడు లేడనే ఊహను కూడా తట్టుకోలేకపోతున్నాను.' అని విలపించింది.
చింతించకు దేవయానీ, నిన్నలా చూడలేను. అంటూ, తన దివ్యదృష్టితో జరిగిన తంతు తెలుసుకున్నాడు, శుక్రుడు. విషయం అవలోకించి, మృత సంజీవనీ విద్యను ఉపాసించి, కచుడిని పునర్జీవుడిని గావించాడు. తనను తిరిగి బ్రతికించిన గురువుకు, శిరమోడ్చి నమస్కరించాడు కచుడు. శుక్రచార్యుడు, కచుడిని మృత సంజీవని చేత బ్రతికించాడని తెలుసుకున్నారు, రాక్షసులు. మరికొంతకాలం గడిచింది. రాక్షసులు మరొక పన్నాగం పన్నారు.
ఒకనాడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి, 'గురుదేవా, మీకిష్టమని, రుచికరమైన మద్యాన్ని, ప్రత్యేకించి తీసుకు వచ్చాము.' అని మధు పాత్రను చేతికిచ్చారు. ఆ మద్యంలో, కచుడిని చంపి కాల్చిన బూడిదను కలిపారు, రాక్షసులు. ఆ విషయం తెలియని శుక్రాచార్యుడు, ఆ మద్యాన్నంతా తాగేశాడు. పువ్వులు తెస్తానని అడవికి వెళ్ళిన కచుడు, పొద్దెక్కినా ఇంటికి రాకపోవడంతో, మళ్ళీ గాబరా పడింది దేవయాని. ఈ విషయం తండ్రికి చెప్పింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి, ‘పోనీలే తల్లీ, రాక్షసులు కచుడంటే మండిపడుతున్నారు. మళ్ళీ చంపేసి ఉంటారు. చచ్చి స్వర్గానికే పోతాడు. మధ్యలో నీకెందుకు విచారం? ఊరుకో.. అంటూ సముదాయించాడు. 'నాన్నా కచుడు బుద్ధిమంతుడు. నా మనస్సుకు ఆహ్లాదం కలిగించినవాడు. అలాంటి ఉత్తముడు, మన దగ్గర ఉంటూ, అకారణంగా మరణించడం నేను భరించలేక పోతున్నాను. కచుడు లేకుండా నేను జీవించలేను' అంటూ దేవయాని రోదించసాగింది.
కొంతసేపయ్యాక, నిషా తగ్గిన శుక్రాచార్యుడికి, తన ముద్దుల కూతురి దు:ఖాన్ని చూసి, హృదయం ద్రవించింది. తన యోగ దృష్టితో, కచుడి ఆచూకీ కోసం చూశాడు. పద్నాలుగు లోకాల్లో, ఎక్కడా కనబడలేదు. తుదకు చూస్తే, తన ఉదరంలోనే బూడిద రూపంలో ఉన్నాడు కచుడు. ఇదంతా మద్య పానం వలన కలిగిన అనర్థమని గ్రహించాడు, శుక్రాచార్యుడు. 'ఎన్నో జన్మలెత్తి సంపాదించిన జ్ఞానమంతా, క్షణంలో నాశనం చేస్తుంది మద్యం. ఇకపై మద్యం తాగడమే కాదు. కనీసం తాకనన్నా తాకకూడదు' అనే నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాదు.. ఒక కఠోర శాసనం కూడా చేశాడు. 'నేటి నుండీ, మనిషన్న వాడు మద్యపానం చేయకూడదు. ఇది నా శాసనం. కాదని తాగినవాడు, కఠోరమైన నరక యాతనలు అనుభవిస్తాడు' అని శపించాడు.
మళ్లీ మృత సంజీవని ఉపయోగించి, తన కడుపులో ఉన్న కచుడిని బ్రతికించాడు. అప్పుడు కడుపులో ఉన్న కచుడు, శుక్రుడిని కడుపులోంచే ప్రార్థించాడు. 'ప్రాణం పోసి బ్రతికించారు. అలాగే మీ కడుపులోంచి పైకి వచ్చే మార్గం కూడా ప్రసాదించండి' అని కోరాడు. శుక్రుడు ఆలోచించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కడుపు చీల్చుచుకుని గానీ, కచుడు బయటకు రాలేడు. అలా చీలిస్తే, తన గతేంకాను? శుక్రాచార్యుడి పరిస్థితి, ముందు నుయ్యీ వెనుక గొయ్యీ అన్నట్లుగా తయారయ్యింది. గత్యంతరం లేక, కచుడికి మృత సంజీవనీ విద్యనుపదేశించాడు. ఆ తరువాత కచుడితో, 'నాకడుపు చీల్చుకుని బయటకురా, తిరిగి మృత సంజీవనితో నన్ను బ్రతికించు.' అని ఆదేశించాడు శుక్రుడు. ఆచార్యుడి ఆదేశం మేరకు, కడుపు చీల్చుకుని బయటకు వచ్చాడు, కచుడు. అలాగే, నిర్జీవంగా పడివున్న తన గురువును, మృత సంజీవనితో బ్రతికించాడు.కడకు బ్రహ్మచర్య దీక్ష పూర్తయ్యింది. మృత సంజీవనీ విద్య ప్రాప్తించింది. వచ్చిన దేవ కార్యం, ఎలా అయితే నేం, నేరవేరింది. కొన్నాళ్లయ్యాక, గురువు గారి దగ్గర సెలవు తీసుకుని, దేవలోకానికి పయనమయ్యాడు కచుడు.
బయలుదేరే ముందు, చెప్పి వెళదామని, దేవయాని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు దేవయాని, భావోద్వేగ భరితురాలై, 'కచుడా! నీ సదాచార జీవనం, భావనాపటిమ, నన్నెంతగానో ముగ్ధురాలిని చేశాయి. నీ దీక్షాకాలంలో, నువ్వు అనుకోని గండాలెన్నో ఎదుర్కున్నావు. అటువంటి ఆపద సమయంలో, నేను నీకు అండగా నిలిచాను. ఇంతకాలం, నా మనంబున నిన్నే ఊహించుకున్నాను. నీ దీక్ష సమాప్తమయ్యింది. మృత సంజీవని, నీ వశమైంది. దాంతో పాటు, నన్ను కూడా అర్థాంగిగా స్వీకరించు' అని అన్నది. కచుడు ఒక్క క్షణం, నిర్ఘాంతపోయాడు. తేరుకుని, 'దేవయానీ, నీవు నా గురుపుత్రికవు. నా సహోదరితో సమానం. నేను సదా నిన్ను ధర్మ దృష్టితో చూశానే కానీ, ఏనాడూ కామ దృష్టితో చూడలేదు. నీవు నాపై చూపిన ఆదరాభిమానాలు, ఎన్నటికీ మరువలేను. వెళ్ళేముందు నీ ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. నన్ను కృతార్థుణ్ణి చేయి' అని కోరాడు కచుడు. ఆ మాటలు కర్ణ కఠోరంగా వినిపించాయి దేవయానికి. కచుడి నిరాకరణం, సహించలేకపోయింది. దెబ్బతిన్న త్రాచులా లేచింది. 'నా కొరికను నిరాకరించావు. నన్ను కాదనుకుని వెళ్ళిపోతున్నావు. వెళ్ళు. నీవు నేర్చుకున్న మృత సంజీవని నీకు పనిచేయకుండు గాక.' అని శపించింది.
ఆమె ఇచ్చిన శాపం మిక్కిలి బాధించింది, కచుడిని. వెంటనే దేవయానితో, 'అకారణంగా, అనాలోచితంగా నన్ను శపించావు. మృత సంజీవని నాకు పని చేయకపోతే పోయింది. నా వల్ల ఉపదేశం పొందిన వాళ్ళకు, అది పనిచేస్తుంది. ఇక అహంకారంతో, అధర్మంగా నన్ను శపించావు. నిన్ను బ్రాహ్మణుడన్న వాడు పెళ్లాడకూడదు గాక' అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇక ఒక్క క్షణం కూడా నిలవకుండా, సురలోకం బయలుదేరాడు కచుడు. దేవహితార్థమై, ఎన్నో కష్టనష్టాలను భరించి, మృత సంజీవనీ విద్యను గ్రహించి వచ్చిన కచునికి, దేవతలందరూ ఘన స్వాగతం పలికారు. అంతేగాక, కచుని కీర్తి స్థిరంగా ఉంటుందనీ, యజ్ఞ భాగంలో, కచునికి కూడా ప్రాతినిధ్యం ఉంటుందనీ, శాసనాన్ని చేశారు.
ఇక మరో భాగంలో, కచుడు నిరాకరించిన దేవయాని, ఆ తరువాత ఏం చేసింది? తన వివాహం ఎవరితో జరిగింది? తన జీవితంలో ఎదురైన సంఘటనలేంటి – వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాము..