Ads

Showing posts with label ఈ రోజు 20/10/2021 - 'శరత్ పౌర్ణమి' కోజాగరి వ్రతం విశిష్టత!. Show all posts
Showing posts with label ఈ రోజు 20/10/2021 - 'శరత్ పౌర్ణమి' కోజాగరి వ్రతం విశిష్టత!. Show all posts

20 October, 2021

ఈ రోజు 20/10/2021 - 'శరత్ పౌర్ణమి', కోజాగరి వ్రతం విశిష్టత!

  

ఈ రోజు 20/10/2021 - 'శరత్ పౌర్ణమి', కోజాగరి వ్రతం విశిష్టత!

ఆశ్వీయుజ పౌర్ణమినే శరత్ పౌర్ణమి అని అంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు.

[ అంపశయ్యపై ఉన్న భీష్ముడు, ధర్మరాజుకు చెప్పిన కథ! = https://youtu.be/7GJOkcKzvio ]

మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన, దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి, పౌర్ణమి వరకూ 15 రోజుల పాటు చేస్తారు.

ఏడాదిలో ఈ పౌర్ణమినాడు మాత్రమే, చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన, ఈ శరత్ పౌర్ణమి రోజున, చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన, చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్ర నామ పారాయణ చేయడం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి, రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని, శాస్త్రం చెబుతోంది. 

చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం, చంద్ర కిరణాలలో ఉన్న ఔషధీ తత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం, ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి.

ఈ పౌర్ణమికే కోజాగరి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణమి రోజున, లక్ష్మీ దేవిని పూజిస్తారు.

లక్ష్మీ దేవికి ప్రియమైన వ్రతం, ఈ  'కోజాగరి వ్రతం'. సంపదలనూ, సౌభాగ్యాన్నీ ప్రసాదించే చల్లని తల్లిగా, శ్రీ లక్ష్మీ దేవిని పూజిస్తాము. లక్ష్మీ దేవికి అత్యంత ప్రియమైన వ్రతం, దారిద్ర్య వినాశక వ్రతం, 'కోజాగరి వ్రతం'.

దారిద్ర్యం తొలగిపోయి, లక్ష్మీ దేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని, మహర్షులు వాలిఖిల్య మహర్షిని కోరగా, ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లు, పురాణ విదితం.

పూర్వం మగధ దేశంలో, వలితుడనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడు. అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ, అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి, పరమ గయ్యాళి. తనకు బంగారం, పట్టు వస్త్రాలూ కొని ఇవ్వలేదని, వలితుడి మాటలను ధిక్కరించి, వ్యతిరేకంగా ప్రవర్తించేది.

వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధను చూసి, 'నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో, దానికి వ్యతిరేకంగా పని చేయమని, నీ భార్యకు చెప్పు. అప్పుడామె, నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది.. కాబట్టి, నీ పని జరుగుతుంది' అని సలహా ఇచ్చాడు..

కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగా వలితుడు, 'రేపు మా తండ్రిగారి ఆబ్ధికం.. అయినా, నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు' అని భార్య చండితో అన్నాడు.

భర్త మాటలు విన్న చండి, మామ గారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో, వలితుడు భార్య చండితో, 'పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి' రమ్మన్నాడు. వెంటనే చండి, పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది.

ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో, ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు..

కొంతకాలం తరువాత, ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయింది. ముగ్గురు నాగకన్యలు వచ్చి, నదిలో స్నానం చేసి, లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి, నాలుగో మనిషి లేకపోవడంతో, ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు.

వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి, తాను ఆడనని వారికి వివరించాడు. ఈ రోజు పాచికలు ఆడటం నియమమని, నాగకన్యలు వలితుడికి చెప్పి, పాచికలాడడానికి ఒప్పించారు.

లక్ష్మీ సమేతుడైన విష్ణువు, భూలోకంలో ఎవరు మేలుకుని వున్నారో చూడడానికి రాగా, వారికి ఈ ముగ్గురు నాగకన్యలూ, వలితుడూ, పాచికలాడుతూ కనిపించారు.

దీనికి సంతోషించిన లక్ష్మీ దేవి, వారికి సర్వ సంపదలనూ ప్రసాదించారని, వాలిఖిల్య  మహర్షి వివరించారు..

కాబట్టి, ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి, ఆ రాత్రి జాగరణ చేస్తూ, పాచికలాడే వారికి సర్వసంపదలూ చేకూరుతాయని, పురాణాలు చెబుతున్నాయి.

🕉️ ఓం లక్ష్మ్యై నమః 🕉️