Ads

Showing posts with label ఆత్మ సాక్షాత్కారము!. Show all posts
Showing posts with label ఆత్మ సాక్షాత్కారము!. Show all posts

16 October, 2021

ఆత్మ సాక్షాత్కారము! Aatma Sakshatkaram

  

ఆత్మ సాక్షాత్కారము!

స్ధిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్ధితధీః కిం ప్రభాషేత మాసీత వ్రజేత కిమ్‌ ।। అని అడిగిన అర్జునుని ప్రశ్నకు భగవానుడు ఉత్తరమిస్తూ.. ఎవడైతే తన కోరికలనూ, రాగద్వేషాలనూ జయించి, నిశ్చలమైన మనస్సుతో ఉన్నాడో, అతడే స్థితప్రజ్ఞుడని అన్నారు. అట్టి వ్యక్తి, బాహ్యాలోచనల నుండి తన మనస్సును విముఖం చేసి, ఆత్మచింతన కోసం, అంతర్ముఖం చేస్తాడని అన్నారు. 

[ సంపూర్ణ భగవద్గీత = https://bit.ly/bhagawadgita ]

ఆత్మ సర్వగతం. అది అంతటా నిండి ఉంటుంది. తాబేలు ఏదైనా ఆపద వచ్చినట్లు పసిగట్టినపుడు, తన కరచరణాలను ఏవిధంగా లోనికి లాగుకుంటుందో, అదే విధంగా, స్థితప్రజ్ఞుడూ, అనవరతమూ బహిర్గతమయ్యే స్వభావంగల ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తున్నాడు. ఎందుకు? ఆత్మను ధ్యానించడానికి మనస్సులో ఏదో ఒక వెలితి ఉండటం చేత, ఒక వస్తువు ఆ వెలితిని తొలగిస్తుందన్న భావన చేత, మనం ఆ వస్తు ప్రాప్తికై పరిశ్రమిస్తుంటాము.

'మనం మనం' అని మనము చెప్పుకొంటున్న ఈ 'మనము' ఎవరో మనము ఎరిగినట్లైతే, అది సంపూర్ణానందమని తేలుతుంది. మనమే సంపూర్ణానందమైనప్పుడు, ఇక మనకు ఆనందమిచ్చే వస్తువు, వేరుగా ఎక్కడుంటుంది? ఆ ఆనందమే లబ్దమైనప్పుడు, ఇంద్రియాల మూలంగా మనం అనుభవించే సౌఖ్యం, క్షణికమని తెలుసుకుంటాము. అగ్నిని అగ్నితో ఆర్పలేకపోగా, వృద్ధి చేస్తాం. అలాగే, విషయాలను అనుభవించిన కొద్దీ, 'కోరికలు' అనే విషయాలు, ఇంకా పెరుగుతూ ఉంటాయి. అదే సందర్భంలో, భగవానుడు అర్జునుడికి బోధిస్తూ, ఆత్మ నిగ్రహం పూలబాట కాదనీ, దానికి నిరంతర సాధన, లేక అభ్యాసం అవసరమనీ సెలవిచ్చారు.

మనం యత్నిస్తూ ఉన్నా, మధ్య మధ్యలో జారిపోతూ ఉంటాము. నిరుత్సాహంతో, అంతటితో స్వస్తి చెప్పక, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ, జయం కలిగేటంత వరకూ యత్నం చేస్తూనే ఉండాలి. ఉపవాసం మొదలైనవి, ఆత్మ నిగ్రహానికి తోడ్పడతాయి. జ్వరగ్రస్తుడూ, ఉపవాసమున్నవాడూ, సంగీతం వినాలని కోరడు. ఆ సమయంలో అది పెద్దగా రుచించదు. అదే విధంగా, నానావిధ భక్ష్య భోజ్యాల ఆశ, అతడికి ఉండదు. అవి అతడిని ఆశ పెట్టలేవు. ఐతే, వాటిపై కోరికలు, అతడి మనస్సులోనుంచి పూర్తిగా తొలగిపోవు. ఉపవాసం విరమించిన పిదప, లేదా జ్వరం తొలగి స్వాస్థ్యం లభించేసరికి, మనస్సు మళ్లీ వాటి వైపుకి లాగుతూ ఉంటుంది. అంటే ఈ కోరికలన్నీ, నివురుగప్పిన నిప్పులాగా ఉంటాయన్నమాట. 

దీని వల్ల తేలేదేమిటంటే, ఉపవాసాదికాల చేతగానీ, ఇతర విధాలైన తపశ్చర్యల చేతగానీ, ఇంద్రియ విజయమూ, ఆత్మ నిగ్రహమూ పరిపూర్తిగా మనకు స్వాధీనం కాదని.. ఏదో జయించినట్లే ఉంటుంది, నిగ్రహించినట్లే ఉంటుంది.. బలా బలాల పరీక్ష వచ్చే సరికి, మనస్సు యొక్క దుర్బలత తెలిసిపోతుంది. అందుచేతనే భగవానుడు గీతలో, పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కావాలనీ, సద్వస్తు జ్ఞానం కలుగిలానీ, అంటే, మనం పూర్తిగా భగవంతుని శరణుజొచ్చితేగానీ వీలుకాదని, పదే పదే సెలవిచ్చాడు. తపస్సూ, ఉపవాసమూ మొదలయినవి, ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన పూర్వరంగాన్ని కల్పించవచ్చు. కానీ, పరిపూర్ణ నిగ్రహం, భగవదనుగ్రహము చేతనే కలగాలి.

'వాసుదేవస్సర్వమితి'.. జ్ఞానం కలిగేంత వరకూ, పరిపూర్ణ మనోజయం సిద్ధించదు. సర్వమూ వాసుదేవ మయం. ఈ సర్వములో తానూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకు ఈ జ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఇంద్రియ సౌఖ్యాలపై విముఖత ఏర్పడి, బాహ్య విషయాలు మనోవికారం కలిగించడానికి అశక్తాలై, పరిపూర్ణ మనో నిగ్రహం సిద్ధించి, ఎంతటి కష్టాలు వచ్చినప్పటికీ, జారిపోని మానసిక నిశ్చలత, మనశ్శాంతీ ఏర్పడుతుంది. తీరిన కోరికలు క్రోత్త కోరికలను చిగురిస్తాయి. కోరికకు నిరోధం కలిగినప్పుడు, క్రోధం కలుగుతుంది. బంతిని గోడకేసి కొడితే, అది మళ్లీ మిమ్మల్ని తిరిగి కొడుతుంది. కోపంలో ఉన్నవారికీ, కోరికలతో సతమతమౌతున్న వారికీ, వివేచనాశక్తి అంతరించిపోతుంది. అందుచేత, వారు చేసే ప్రతి పనీ, దుర్మార్గంలోనే నడుస్తూ ఉంటుంది. అలా కాక, ఇచ్ఛలన్నీ మనస్సుకు లొంగిపోతే, మనస్సు నిశ్చలమై, సతతమూ ఆత్మ ధ్యానం చేస్తుంటుంది. అలా ఎడతెగక ఆత్మ చింతన చేసే వ్యక్తికి, అచిరకాలంలో, 'ఆత్మ సాక్షాత్కారము' కలుగుతుంది..

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏