ఆత్మ దర్శనం!
ప్రాణము, మనస్సు ఒక చోటునుండి పుట్టుకొస్తున్నాయి. అదే ఆత్మ. అందుచేత ఉచ్చ్వాస, నిశ్వాసాలు లేక మనస్సు (తలంపులు) ఎక్కడనుండి పుట్టుకు వస్తున్నాయో గమనిస్తూ వుంటే, ఆత్మ దర్శనం అవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని అనుష్టించినా చాలు. మనస్సును పరిశీలిస్తూ వుంటే, ఒక నాటికి తలంపులన్నీ ఆగిపోతాయి. అప్పుడు పూర్ణశాంతి లభిస్తుంది. అదీ నీ స్వరూపమే. జనక మహారాజు యిట్లా అన్నాడు. 'ఇప్పుడు నేను దొంగను (మనస్సు) పట్టుకున్నాను. ఇతడే నా నిజమైన 'నేను'ను దొంగిలించాడు. ఇప్పుడు ఇతనిని వధించి తీరుతాను.' మనం తలంపులకు చోటిచ్చామంటే ఆత్మను పోగొట్టుకున్న వారమౌతున్నాం. మనం పరిశీలించనంత వరకే మనస్సు యొక్క బడాయి. పరిశీలించామా అదృశ్యమౌతుంది. ఆత్మ దర్శనమౌతుంది.
[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]
లోకంలో పుట్టిన ప్రతి మనిషీ, మరణించేవరకూ, అనునిత్యం, త్రిస్థితులు అంటే, మూడు అవస్థలు అనుభవిస్తుంటాడు. అవి, జాగృత్, స్వప్న, సుషుప్తులు. అంటే, మేల్కొని ఉండటం, కలలు కనడం, నిద్రపోవడం. ఈ మూడు అవస్థలూ, బుద్ధిపరమైనవే గానీ, ఆత్మకు సంబంధించినవి కావని, వేదాంతులు చెబుతారు. మసక చీకటిలో, నేలపై పడి ఉన్న తాడును చూసి, పాము అనుకుని భయపడటం సహజం. వెలుతురులో చూసినప్పుడు, అది పాము కాదనీ, తాడు అని నిర్ధారించుకోవడమూ సహజమే. పాము కాని తాడు పాములా ఎలా కనపడిందో, అలాగే, ఆత్మలో లేని మూడు అవస్థలు, ఆత్మలో ఉన్నట్లనిపిస్తాయి. వెలుతురు వంటి జ్ఞానంతో చూసినప్పుడు, ఆ మూడు అవస్థలూ, బుద్ధికి సంబంధించినవే గానీ, ఆత్మకు చెందినవి కావని తేలుతుంది.
మేల్కొని ఉన్నప్పుడు, కలలు కనడం, నిద్రించడం ఉండవు. కలలు కంటున్నప్పుడు, మేల్కొనడం, నిద్రించడం ఉండవు. నిద్రిస్తున్నప్పుడు, మేల్కొనడం, కలలు కనడం జరగవు. ఒక అవస్థలో ఉన్నప్పుడు, వేరొక అవస్థను బుద్ధి తెలుసుకోలేదు. ఆత్మ అన్ని అవస్థలనూ తెలుసుకుంటుంది. ఆత్మ నిత్యమనీ, బుద్ధి అనిత్యమనీ దాని సారాంశం. జాగృదావస్థలో, అంటే, మేలుకొని ఉన్న వేళలో, మనిషి తన చుట్టూ ఉన్న వాటినీ, పదార్థాలనూ తెలుసుకోవటానికి, సూర్యుడూ, దీపం, ఇంద్రియాలూ, బుద్ధీ తోడ్పడతాయి. అవి లేకుంటే, మనిషి ఏ పదార్థాన్నీ చూడలేడు, తెలుసుకోలేడు..
కలలు కంటున్నప్పుడు, ఆ కలల్లో కనిపించే వస్తువులనీ, దృశ్యాలనీ బుద్ధి గ్రహిస్తుంది. మేల్కొన్న తరవాత కూడా, తాను కలలో చూసిన వాటిని, బుద్ధి గుర్తుంచుకుంటుంది. అందుకే, ‘కలలో ఆ దృశ్యాలు చూశాను’ అని మేల్కొన్న తరవాత మనిషి చెబుతాడు. కలలో కనిపించేవన్నీ యథార్థాలు కావు కానీ, అవి నిజంగా ఉన్నట్లే, బుద్ధికి అనిపిస్తాయి. ప్రతినిత్యం బుట్టలోని పూలను చూసే మనిషి, ఏదో ఒకరోజు, అందులో పూలు లేకున్నా, దాన్ని ‘పూల బుట్ట’ అని గుర్తిస్తాడు. కలలో చూసిన వాటి విషయంలోనూ, ఇదే సూత్రం వర్తిస్తుంది.
సుషుప్తి అంటే నిద్ర. ఈ అవస్థలో మనిషి బుద్ధి, అజ్ఞానంలో దేన్నీ గుర్తించలేని స్థితిలో ఉంటుంది. నిద్రావస్థలో ప్రాణమనే పదార్థం పనిచేస్తుంటుంది. అదే లేకుంటే, మనిషికి శరీరం ఎక్కడిది? ఆత్మను తెలుసుకోవాలంటే, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థల్ని వదిలి వేయాలని, వేదాంతులు ఉపదేశిస్తారు. ఆ మూడు దశల తరవాత, నాలుగో దశలోనే, ఆత్మను దర్శించడం సాధ్యపడుతుంది. అందువల్ల, ఆత్మ ‘తురీయం’ (నాలుగవది, లేదా చిట్టచివరిది) అని శాస్త్రజ్ఞులంటారు..
మసక చీకటిలో నేలపై పడి ఉన్న తాడును, నిజమైన జ్ఞానదృష్టితో చూడనందువల్ల, అది పాముగా, కర్రగా, పూలదండగా, బుద్ధికి తోచవచ్చు. దీపం వెలుగులో చూసినప్పుడు, అది పాము కాదనీ, తాడు అనీ తెలియడం, యథార్థం అవుతుంది. అలా యథార్థంగా తెలుసుకోవలసి ఉన్నదే, ‘ఆత్మ’స్వరూపం!
మేలిమి బంగారం ముద్దలో, పైకి చూసినా, లోపల చూసినా, కనిపించేది శుద్ధమైన బంగారమే. అలాగే, పైన, లోపల, ఎక్కడ చూసినా, అన్నిచోట్లా యథార్థంగా కనిపించేది, ‘ఆత్మ’. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. దాన్ని తెలుసుకుంటే చాలు.. అన్నీ తెలుసుకున్నట్లే..
శరీర ధారణ ద్వారా సంక్రమించిన జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలను, మనిషి తన ప్రమేయం లేకుండా పొందుతూనే, ఆత్మ స్వరూపం తెలుసుకోవడానికీ ప్రయత్నించాలి. ఆత్మశోధన లేకుండా, కేవలం తినటం, నిద్ర, కలలకే పరిమితం కావడం, మనిషి చేయాల్సిన పనులు కావు. ఆత్మ శోధనలోనే, యోగులు తరించారు. మనిషికి, ఆ మాటకొస్తే, సమస్త ప్రాణికోటికీ చివరి గమ్యం, ‘ఆత్మ దర్శన’మే. అది సంభవమైనప్పుడు, లోకంలో ఇంకేదీ అవసరం ఉండదు!
ప్రాతఃస్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వమ్
సచ్చిత్ సుఖం పరమ హంసగతిం తురీయమ్ |
యత్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యమ్
తద్ బ్రహ్మ నిష్కలమహం న చభూతసంఘ: ||
'ప్రాతఃకాలంలో నేను నా హృదయంలో స్ఫురించే ఆత్మ తత్త్వాన్ని స్మరిస్తున్నాను. ఏదైతే ఆత్మ సచ్చిదానంద స్వరూపమై ఉందో, ఏదైతే పరమ హంసల అంతిమ ధ్యేయమో, ఏదైతే తురియావస్థ రూపమో, ఎవరైతే జాగృత్, స్వప్న, సుషుప్తి దశలను ఎల్లప్పుడూ తెలుసుకుంటారో, ఎవరైతే శుద్ధ బ్రహ్మమో, అదే నేను అయి ఉన్నాను. పంచ మహాభూతాలతో (ఆకాశం, నీరు, భూమి, గాలి, అగ్ని) తయారైన దేహాన్ని నేను కాను..
Link: https://www.youtube.com/post/Ugzz2uq5SncyqbnVExZ4AaABCQ