అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునికి ఒక గృహస్త రూపం కూడా ఉంది. అటువంటి గృహస్త రూప దత్తునకే "అనఘస్వామి" అని పేరు. ఆ స్వామి అర్ధాంగికి "అనఘాదేవి" అని పేరు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. దత్తాత్రేయ స్వామి బాలునిగా అత్రి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పటినుండి, మహర్షులు, సిద్దులు, దేవతలు, దత్త స్వామి యొక్క అనుగ్రహం కోసం, ఆయన చుట్టూ చేరేవారు. దాంతో, దత్తస్వామి నర్మదా నదిలో వెయ్యి సంవత్సరాలు "బ్రహ్మోత్తరమనే" తపస్సు చేశారు. అప్పటికీ ఆయన రాకకై ఎదురు చూస్తున్న మహర్షులు, సిద్దులు, ప్రజలను పరీక్షించదలచి, ఒక స్త్రీని తోడ్కొని వారి ముందు ప్రత్యక్షమయ్యారు. స్వామి యొక్క వివాహం గురించి ఎటువంటి వివరాలూ లేనందున, అందరూ స్త్రీ లోలునిగా భావించి, ఆయనను వదిలి వెళ్ళిపోయారు. దాంతో దత్తస్వామి చిద్విలాసంగా ఆ స్రీని తోడ్కొని, సహ్యాద్రికి చేరుకున్నారు. ఆమెనే అనఘాదేవి (మధుమతి). ఈ మాత లోకానికి మొదటిసారిగా పరిచయం అయినది అప్పుడే.
[ దత్త చరిత్ర! = ఈ వీడియో చూడండి: https://youtu.be/O32mt8zkdsE ]
ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ, భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, కామావసాయితా, మహిమా) పుత్రులై అవతరించారు. జంభాసురుడిచే పీడింపబడిన దేవేంద్రునికి అభయం ఇచ్చిన దత్త స్వామి, అనఘాదేవిని ఆశ్రయించమని తెలిపాడు. ఆ తల్లి దయ వలన జంభాసురుడు నిర్వీర్యుడై, ఇంద్రునిచే వధింపబడినాడు. అప్పుడే మొదటిసారిగా, మహాలక్ష్మి స్వరూపిణి అయిన అనఘాదేవి యొక్క మహిమ, లోకానికి తెలిసినది. నిస్తేజుడైన కార్తవీర్యార్జునుడు దత్త స్వామి శరణు పొంది, తన సేవలతో స్వామిని ప్రసన్నం చేసుకున్న తరుణంలో, శ్రీ దత్తాత్రేయ స్వామి అనఘా దేవిని సేవించి, తరించమని చెప్పాడు. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో, సహస్ర బాహు బల సంపన్నుడై, లోకాలను పాలించాడు. ఆ రోజు మార్గశిర కృష్ణ అష్టమి. అనఘా దేవి మాత అనుగ్రహించిన కారణంగా, అనఘాష్టమి అని పేరు వచ్చింది. కార్తవీర్యార్జునుడు తన రాజ్యములో సకల ప్రజానీకం, అనఘాష్టమీ వ్రతం జరుపుకునే విధంగా శాసనం చేయించాడు. తాను కూడా, ప్రతి మాసంలో, కృష్ణ పక్ష అష్టమి రోజున, అనఘాష్టమీ వ్రతం చేసుకునేవాడు.
మాత అనఘాదేవి యొక్క అనుగ్రహం వలన దేవేంద్రుడు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, పింగళనాగుడు, మొదలైనవారు, అనుగ్రహ ప్రాప్తులై, వారి యొక్క అభీష్టము నెరవేర్చుకున్నారు. యోగేశ్వరి జగన్మాత, యోగంలో ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశ వృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలనూ సిద్ధింపజేస్తుంది. కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే "మధుమతి" అనే పేరు కూడా ఉంది. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము. "అఘము" అంటే పాపము. ఇది మూడు రకాలు. అనఘము అంటే, ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం. అనఘాష్టమీ వ్రతానికి ముఖ్యమైన రోజు, మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతీ సంవత్సరం, ఈ వ్రతం చేయడం చాల మంచిది.
అలాగే ప్రతీ నెలా కృష్ణ పక్ష బహుళ అష్టమి రోజు కుడా చేయవచ్చు. ఈ వ్రతం ప్రతీ సంవత్సరం చేసుకునే వారికి, మూడు రకాల పాపాలు తొలగి, వారు "అనఘులు" గా అవుతారు. కాబట్టే, ఈ వ్రతాన్ని "అనఘాష్టమీ వ్రతం" అంటారు. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం. వ్రత పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. భందుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. వ్రత పూజ పూర్తైన తరువాత, ఐదు అధ్యాయాల కధలను చదవాలి. వాటిని అందరూ శ్రద్ధగా వినాలి. ఈ వ్రతమును చేయకపోయినా, శ్రద్ధగా మనసుతో మానసికంగా ఆ దేవిని ధ్యానించి, అనఘా దేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి.
Link: https://www.youtube.com/post/UgxgZUaMRwtI6TwHLL54AaABCQ