'మాయ' – మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు..
'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (11 – 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/0cA4EOR8RYE ]
శ్రీ కృష్ణుడు తన శక్తులను, ఈ విధంగా మరింత విపులీకరిస్తున్నాడు..
00:45 - బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ।। 11 ।।
భరత వంశీయులలో శ్రేష్టుడా.. బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను. ధర్మ విరుద్ధము కాని లైంగిక క్రియలను నేను.
మోహము అనేది, మనం పొందలేని వస్తువులపై ఉన్న కోరిక. అనురాగము అంటే, ఒకసారి అనుభవించిన తరువాత, కోరుకున్న వస్తువు మరింత కావాలనే ఉద్వేగాన్ని రగిల్చే, స్తబ్దముగా ఉండే మానసిక భావం. కాబట్టి, శ్రీ కృష్ణుడు కామ-రాగ-వివర్జిత, అంటే, “మోహము-అనురాగము లేకుండా” అని, తన బలము యొక్క స్వభావం గురించి చెబుతున్నాడు. మనుష్యులకు, వారి వారి క్రమం తప్పకుండా, విరామం లేకుండా, తమ ధర్మాలను ఆచరించటానికి కావలసిన బలాన్ని ఇచ్చే నిర్మలమైన, మహనీయమైన శక్తి స్వరూపం, శ్రీ కృష్ణుడే. నియమానుసార రహితంగా, ఇంద్రియ సుఖాలకోసం చేసే లైంగిక కార్యకలాపాలు, మృగ ప్రాయమైనవి. కానీ, గృహస్థాశ్రమంలో భాగంగా, ధర్మ విరుద్ధం కాకుండా, సంతానం కోసమే అయితే, అది శాస్త్ర అనుగుణంగా ఉన్నట్టే. ఇటువంటి ధర్మబద్ధమైన, నియంత్రణలో ఉన్న, వైవాహిక సంబంధానికి లోబడి ఉన్న లైంగిక కార్యము తానే అని, శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.
02:08 - యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ।। 12 ।।
భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములైన సత్త్వము, రజస్సు, తమస్సు, నా శక్తి వల్లనే వ్యక్తమయ్యాయి. అవి నా యందే ఉన్నాయి. కానీ, నేను వాటికి అతీతుడను.
ఈ ప్రకృతిలో సహజమైన సత్త్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు, భగవంతుడి శక్తి వల్లనే ఏర్పడ్డాయి. సమస్త వస్తువులూ భగవంతుని నుండే ఉద్భవించినా, ఆయన మాత్రం, వాటికంటే భిన్నమైనవాడు. వాటికి అతీతుడు.
02:46 - త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ।। 13 ।।
మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై, ఈ లోకంలోని జనులు, శాశ్వతమైన, మరియు సనాతనమైన నా గురించి, తెలుసుకోలేకున్నారు.
మాయ యొక్క త్రిగుణములు మన బుద్ధిని కప్పివేయటం వలన, క్షణభంగురమైన శారీరిక సుఖాలకు ఆకర్షితులమవుతున్నాము. ‘మాయ’ అంటే, “మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు” అని అర్థం. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది, ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హత సాధించని జీవాత్మల నుండి, పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచటమే, అది చేసే సేవ. మాయ అనేది, ఈశ్వరుని నుండి విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎర వేసి, మోహమునకు గురి చేస్తుంది. అదే సమయంలో మాయ, జీవాత్మలను మూడు రకాల భౌతిక బాధలకు గురిచేస్తూ, ఎన్నోరకాల కష్టాలతో దుఃఖాన్ని కలుగచేస్తుంది. ఈ విధంగా, ఈశ్వర పాద పద్మములను చేరే వరకూ సంతోషము లేదన్న విజ్ఞానాన్ని, జీవాత్మలకు తెలియచేయడానికి ప్రయత్నిస్తుంది, మాయ. ప్రతీ ఒక్కరూ, ఈ మాయకు లోబడి, భౌతిక విషయములపై ఆసక్తులై, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, దానిని తెలుసుకో లేక పోతున్నారు.
04:11 - దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। 14 ।।
ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ'. దీనిని అధిగమించడం, చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు, దానిని సునాయాసముగా దాటి పోగలరు.
భౌతిక శక్తి అనేది మిథ్య అని, కొంత మంది అంటారు. మనం అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి, మనకు మాయ గోచరిస్తున్నది అంటారు. ఒక వేళ మనం జ్ఞానంలో స్థితులమై ఉంటే, మాయ అనేది ఉండదు. భ్రాంతి తొలగిపోయి, ఆత్మనే పరమ సత్యమని తెలుసుకుంటామని అంటారు. కానీ, శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం, మాయ అనేది మిధ్య కాదు; అది భగవంతుని యొక్క శక్తి స్వరూపం. మాయ అనేది, అధిగమించటానికి చాలా కష్టమైనది. ఎవరైనా మాయను వశ పరుచుకున్నారంటే, దాని అర్థం, ఆ వ్యక్తి భగవంతుడిని జయించినట్టే. ఎవ్వరూ కూడా భగవంతుడిని జయించలేరు కాబట్టి, ఎవ్వరూ కూడా మాయని కూడా జయించలేరు. మనస్సనేది మాయతో తయారయినదే కాబట్టి, ఏ యోగీ, జ్ఞానీ, లేదా కర్మీ కూడా, కేవలం స్వీయశక్తిచే మనస్సుని విజయవంతంగా నియత్రించలేరు. అయితే, పరమేశ్వరుడికి శరణాగతి చేస్తే, అప్పుడు, ఆయన కృపచే, మనలను ఈ భౌతిక జగత్తు అనే సాగరాన్ని దాటింపచేస్తాడు. ఎప్పుడైతే ఈ భౌతిక శక్తికి భగవంతుని నుండి సూచన వస్తుందో, అది ఆత్మను తన బంధము నుండి, సునాయాసంగా విడిచిపెడుతుంది. మనలను బాధించే భౌతిక మాయా శక్తి, భగవంతుని అధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా, మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
06:01 - న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ।
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ।। 15 ।।
నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు. జ్ఞానము లేని వారూ, నన్ను తెలుసుకునే సామర్ధ్యం ఉన్నా, సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారూ, బుద్ధి భ్రమకు గురైనవారూ, ఆసురీ ప్రవుత్తి గలవారు.
ఇక్కడ చెప్పినట్టు, భగవంతునికి శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గురించి, చూద్దాము..
1) అజ్ఞానులు - వీరు ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారు. వారు, తాము నిత్యమైన ఆత్మలమే అన్న నిజ స్వరూపాన్ని ఎరుగరు. జీవిత లక్ష్యాన్ని, భగవత్ ప్రాప్తి అని ఎరుగరు. ప్రేమయుక్త భక్తితో, ఈశ్వరునికి శరణాగతి చేసే ప్రక్రియను ఎరుగరు. జ్ఞానం లేకపోవటమే, వారిని శరణాగతి చేయనివ్వదు.
2) సోమరితనంతో, తమ నీచ స్థాయి స్వభావాన్నే అనుసరించేవారు - వీరు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారు. ఏమి చేయ్యాలో, వారికి తెలుసు. కానీ, వారు నిమ్న స్థాయి జడత్వంచే, శరణాగతి చేయటానికి తగినంత పరిశ్రమ చెయ్యరు. ఆధ్యాత్మిక సూత్రాలను పాటించటం కోసం పరిశ్రమించటానికి అవరోధంగా ఉన్న ఈ సోమరితనం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పెద్ద అవరోధం.
3) బుద్ధి భ్రమకు లోనయినవారు - వీరు తమ బుద్ధి యందు, ఎంతో గర్వంతో ఉంటారు. వీరు మహాత్ముల, మరియు శాస్త్రాల ఉపదేశాలను విన్నా, వాటిని విశ్వాసంతో ఒప్పుకోవటానికి, అంగీకరించరు. ఏది ఏమైనా, అన్ని ఆధ్యాత్మిక సత్యాలూ, ఒకేసారి అర్థం కావు. ప్రారంభంలో మనం విశ్వాసం కలిగి ఉండి, అభ్యాసం మొదలు పెట్టాలి. అప్పుడే, మనం అంతర్గత విజ్ఞానం ద్వారా, ఆ ఉపదేశాలను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కనిపించే వాటిని తప్ప, వేరే వాటిని ఎవరైతే నమ్మరో, వారు ఇంద్రియములకు గోచరించని భగవంతునికి, శరణాగతి చేయరు.
4) ఆసురీ స్వభావము కలవారు - ఈ కోవకు చెందిన వారికి, భగవంతుడు ఉన్నాడని తెలుసు. కానీ దుర్మార్గంగా, ఈ లోకంలో భగవంతుని సంకల్పానికి పూర్తి విరుద్ధంగా పని చేస్తుంటారు. తెలియపరచబడిన భగవంతుని వ్యక్తిత్వాన్ని, రాక్షస ప్రవృత్తి కారణంగా, అసహ్యించుకుంటారు. ఎవరైనా, ఆయన కీర్తిని పాడుతున్నా, లేక ఆయన భక్తిలో నిమగ్నమై ఉన్నా, వారు తట్టుకోలేరు. స్పష్టంగానే, ఇలాంటి వారు భగవంతునికి శరణాగతి చేయరు.
08:35 - ఇక మన తదుపరి వీడియోలో, భగవంతుడు స్వయంగా, ఎటువంటి వారిని తన స్వరూపంగా భావిస్తాడో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!