Ads

Showing posts with label 'అతిరథ మహారథులు' ఎవరు?. Show all posts
Showing posts with label 'అతిరథ మహారథులు' ఎవరు?. Show all posts

01 July, 2022

'అతిరథ మహారథులు' ఎవరు? Ranks of Warriors in Mahabharata War

   

'అతిరథ మహారథులు' ఎవరు?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. మహా మహా గొప్ప వాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. అయితే, ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం..

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.. ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

1. రథి
2. అతిరథి
3. మహారథి
4. అతి మహారథి
5. మహామహారథి..

1) రథి.. ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, సుదక్షిణుడు, శకుని, శిశుపాలుడు, ఉత్తర, కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు మరియు ద్రౌపది కొడుకులు.. వీరంతా 'రథులు'..

2) అతి రథి (రథికి 12 రెట్లు).. 60,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు..

లవకుశులు, కృత వర్మ, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, ద్రుపదుడు, యుయుత్సు, విరాటుడు, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, ఘటోత్కచుడు, ప్రహస్తుడు, అంగదుడు, దుర్యోధనుడు, జయద్రథుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విరాటుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు మరియు ప్రద్యుమ్నుడు.. వీరంతా 'అతిరథులు'.

3) మహారథి (అతిరథికి 12 రెట్లు).. 7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు..

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగదుడు, అశ్వత్థామ, అతికాయుడు, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రావణుడు, భగదత్తుడు, నరకాసురుడు, లక్ష్మణుడు, బలరాముడు మరియు జరాసంధుడు.. వీరంతా 'మహారథులు'..

4) అతి మహారథి (మహారథికి 12 రెట్లు).. 86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభై వేల) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు..

ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు మరియు భైరవుడు.. వీరు 'అతి మహారథులు'..

రామ రావణ యుద్ధంలో పాల్గొన్నది, ఇద్దరే ఇద్దరు అతి మహారథులు. అటు ఇంద్రజిత్తు, ఇటు ఆంజనేయుడు.. రామ, లక్ష్మణ, రావణ, కుంభకర్ణులు 'మహారథులు' మాత్రమే..

5) మహా మహారథి (అతి మహారథికి 24 రెట్లు).. ఏక కాలంలో 207,360,000 (ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేల) మందితో ఏక కాలంలో యుద్ధం చేయగలడు..

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గా దేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.. వీరంతా 'మహా మహారథులు'..

మహా మహారథులలో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే, ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి, ఏకంగా ఇరవై కోట్ల మందికంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం, మామూలు విషయం కాదు.

జై దుర్గా మాత!
లోకా సమస్తా సుఖినోభవంతు!
శ్రీ మాత్రే నమః!