Ads

09 September, 2022

నేనేగనుక లేకపోతే? What will happen if I was not there?


నేనేగనుక లేకపోతే? అందరూ ఈ విధంగా ఆలోచిస్తే అంతా శుభమే..

మనస్సు చంచలమైనది. దానిని అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాకపోయినా, అసాధ్యమైతే కాదు. లంకలో బంధింపబడిన సీతామాతను చూసిరమ్మని, హనుమంతులవారిని రామచంద్ర ప్రభువు పంపినపుడు, అక్కడ ఆయన ఆలోచనలను గమనించి, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోగలిగితే, ఎన్నో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆ విషయాలను ఈ రోజుటి మన మంచిమాట వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/r51zgQeMEEE ]

అశోక వనంలో రావణుడు, సీతమ్మ వారి మీదకోపంతో కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు, హనుమంతుడనుకున్నాడు.. ఎవరి దగ్గరనుంచైనా కత్తిని తీసుకుని, రావణాసురుని తలను ఖండించాలని.. కానీ, మరుక్షణంలోనే మండోదరి, రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూశాడు.. ఆశ్చర్యపోయాడు..

నేనేగనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు? అనేది నా భ్రమ అన్నమాట.. అని అర్ధమయ్యింది హనుమంతుడికి..
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాము.  'నేను లేకపోతే ఎలా?' అని..

సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.. హనుమంతుడికి అప్పుడర్థమయ్యింది.. ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో, వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడని..

మరింత ముందుకు వెళితే, త్రిజట ‘తనకు ఒక కల వచ్చిందనీ, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ నేను చూశాను’ అని చెప్పింది. అయితే, హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, ప్రభువు తనకు సీతమ్మను చూసి రమ్మని మాత్రమే చెప్పాడు. అంతేగానీ, లంకను కాల్చి రమ్మని చెప్పలేదు.. మరి తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం? అని అనుకున్నాడు.. అయితే, త్రిజట ఇది తన స్వప్నంలో చూశానని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తనిప్పుడేం చేయాలి..? సరే.. ఆ ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే, అలా జరుగుతుందని సరిపెట్టుకున్నాడు.

హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకు వచ్చినప్పుడు, హనుమంతుడు ఏమీ చేయలేదు. అలా నిలబడి ఉండిపోయాడు. అయితే, ఆ సమయంలో విభీషణుడు వచ్చి, 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అని హితవు పలికాడు.. అప్పుడు హనుమంతునికి అర్థమైంది.. తనను రక్షించే భారం, ప్రభువు విభీషణుని పై ఉంచాడని..

ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకుని, 'కోతిని చంపవద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం. తోకకు నిప్పు పెట్టండి..' అని ఆదేశించాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది.. త్రిజట స్వప్నం నిజం కాబోతోందని.. ‘ప్రభువు నాకే చెప్పి ఉంటే, నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి?’ ఇటువంటి ఆలోచనల వరంపరతో, ఆశ్చర్యంలో మునిగిపోయాడు, హనుమంతుడు.. పరమ ఆశ్చర్యం ఏమిటంటే, వాటన్నింటికీ ఏర్పాట్లు, రావణుడే స్వయంగా చేయించాడు.. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకో గలిగిన తన ప్రభువు, తనకు ‘లంకను చూసి రా’ అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది?

అందుకే ప్రియ బాంధవులారా.. ఒకటి గుర్తుంచుకోండి.. ఈ ప్రపంచంలో జరిగేదంతా, ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మనమంతా, కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే.. అందువల్ల, ‘నేను లేకపోతే’ ఏమవుతుందో! అన్న భ్రమలో ఎప్పుడూ బ్రతకవద్దు.. 'నేనే’ గొప్పవాడినన్న గర్వం తలకెక్కనివ్వ వద్దు..

భగవంతుడి సృష్టిలోని కోటానుకోట్ల దాసులలో, అతి చిన్నవాడిని నేనని తెలుసుకుని, మంచిగా మసలుకుందాము..

జై శ్రీరామ్!

No comments: