‘బింబిసారుడు’ ఎవరు? బింబిసారుడికీ, బుద్ధుడికీ సంబంధం ఏంటి? బింబిసారుడి మరణం వెనుక దాగిన రహస్యం!
ఉత్తర భారతదేశంలో, మొట్టమొదటి సామ్రాజ్యం అయిన మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి, బింబిసారుడు. అప్పటి వరకూ ఉన్న మగధ రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా విస్తరించి, కీర్తిని గడించాడు. తన 15వ ఏటనే రాజుగా సింహసనాన్ని అధిష్టించి, యుద్ధభేరిని మ్రోగించిన చరిత్ర ఆయనది. 37 సంవత్సరాలపాటు సుదీర్ఘ పాలన కొనసాగించిన మగధ సామ్రాజ్యపు మొదటి రాజుగా, చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్న అరి వీర పరాక్రముడు, బింబిసారుడు. బౌద్ధులూ, జైనులూ తమ వాడిగా చెప్పుకునే బింబిసారుడు ఎవరు? మగధ రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యంగా ఎలా విస్తరించాడు? రాజ్యాలను స్వాధీన పరచుకోవడానికి, బింబిసారుడు అవలంభించిన పద్ధతులేంటి? బింబిసారుడిని తన కోడుకు ఎందుకు ఖైదు చేశాడు? తన మరణం వెనుక దాగిన రహస్యం ఏంటి - వంటి ఉత్సుకతను రెకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/7r7uzdorrrE ]
మగధ రాజ్యానికి సంబంధించిన ప్రస్థావన, మన ఐతిహాసిక యుగాలైన రామాయణ, మహాభారతాల్లో కనిపిస్తుంది. మగధను పాలించిన మొదటి పాలకుడు బృహద్రధుడని, మన పురాణాలలో తెలియజేయబడింది. అయితే, ఈ వంశానికి చెందిన రాజులలో, జరాసంధుడు గొప్ప రాజుగా కీర్తి గడించాడు. రాక్షస ప్రవృత్తి కలిగిన జరాసంధుడు 17 సార్లు దండెత్తి ఓడిపోయినా, కృష్ణుడతడిని నేరుగా చంపకుండా, భీముడిచేత ఎందుకు చంపించాడు? జరాసంధుడికి సంబంధించన పూర్తి వివరాలను మన గత వీడియోలో వివరించాను. ఆ వీడియోను చూడాలనుకునే వారికోసం, దాని లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాను. జరాసంధుడు గిరివ్రజను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. బృహద్రధుడి వంశంలో చివరి పాలకుడు రిపుంజయుడు. అధికార వాంఛతో రిపుంజయుడిని చంపిన అతడి మంత్రి పులికుడు, తరువాత ప్రద్యోత వంశాన్ని స్థాపించాడు. వారు 138 సంవత్సరాలు పాలించిన తరువాత, మగధ రాజ్యం శిశునాగుల వశమైంది. వారిలో 5వ పాలకుడు బింబిసారుడని, మన పురాణాలు పేర్కొన్నాయి.
అయితే, బౌద్ధ గ్రంథాల్లో మాత్రం, రిపుంజయుడిని బింబిసారుడు హతమార్చి, హర్యాంక వంశాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది. బింబిసారుడి తండ్రి భాటియా, మగధ రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో, అంగ రాజ్యంపై దండెత్తి ఓడిపోయాడు. ఆ సమయంలోనే, మగధ రాజ్యానికి రాజయ్యాడు బింబిసారుడు. అప్పటికి తన వయస్సు కేవలం 15 సంవత్సరాలు. ప్రస్తుత భారతదేశంలో ఉన్న దక్షిణ బీహార్ ప్రాంతమే, ఒకప్పటి మగధ రాజ్యం. బింబిసారుడు అన్ని యుద్ధ విద్యలలోనూ ఆరితేరి, బలిష్టమైన సైన్యాన్ని సమకూర్చుకుని, రాజ్య విస్తరణకు ముందడుగు వేశాడు. తన తాతగారైన హర్యాంకుడి పేరు మీదుగా, హర్యాంక వంశాన్ని స్థాపించాడు. బింబిసారుడు మొట్ట మొదట యుద్ధ భేరి మ్రోగించింది, అంగ రాజ్యం పైనే. తన తండ్రిని ఓడించిన బ్రహ్మదత్తుడితో యుద్ధం చేసి, అంగ రాజ్యాన్ని చేజిక్కించుకుని, తన కుమారుడైన అజాత శత్రుకు అప్పగించాడు బింబిసారుడు. మగధ రాజ్యంలో విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి, బంగాళాఖాతం సమీపంలో ఉన్న అంగ రాజ్యం ఎంతో దోహదపడింది. నావికా దళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు బింబిసారుడు.
సైన్యాన్ని మరింత పటిష్ట పరుచుకున్న తరువాత, తన దృష్టిని భారత ఉపఖండంలోని ఇతర శక్తివంతమైన రాజ్యాల వైపు మళ్ళించాడు. బింబిసారుడు చాలా సమర్ధుడైన సైనికాధికారి. తన సైనిక దళాల పరిమితుల గురించి తెలిసిన అతను, తన రాజ్య పరిధిని పెంచుకోవడానికి యుద్ధాలలో లొంగని రాజ్యాలను, వివాహ సంబంధాలతో దక్కించుకునేవాడు. బింబిసారుడు గొప్ప యోధుడు, రాజ నీతిజ్ఞుడు, సామ్రాజ్య విస్తరణ కాంక్షకలిగినవాడు. సామ, దాన, భేద, దండోపాయాలతో, రాజ్యాలను సొంతం చేసుకునేవాడు. వాటిలో భాగంగానే, రాకుమార్తెలను వివాహం చేసుకుని, వరకట్నంగా రాజ్యాలను పొందేవాడు. బింబిసారుడి మొదటి భార్య, కోసల మహాదేవి. ఈమె కోసల రాజైన ప్రసేనజిత్తు సోదరి. ఈమెను వివాహం చేసుకోవడం ద్వారా, లక్ష నాణాల ఆదాయం వచ్చే కాశీ రాజ్యాన్ని వరకట్నంగా పొందాడు.
బింబిసారుడి రెండవ భార్య, చెల్లన. ఈమె వజ్జి రాజు చేటకుడి కుమార్తె. ఇతడు లిచ్చవి తెగకు చెందినవాడు. మూడవ భార్య, విదేహ రాకుమార్తె వాసవి. ఇక నాలుగవ భార్య, ముద్రరాజు కుమార్తె ఖీమ. అయితే, మహావగ్గ అనే బౌద్ధ గ్రంథంలో, బింబిసారుడికి దాదాపు 500 మంది భార్యలున్నట్లు, పేర్కొనబడింది. బౌద్ధ రచనలలో, గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఎక్కువ కాలం, మగధ సామ్రాజ్యంలోనే గడిపాడని చెబుతారు. బింబిసారుడు పాలించిన కాలంలోనే, బౌద్ధమత వ్యవస్థాపకులైన గౌతమబుద్ధుడూ, జైన మత వ్యవస్థాపకులైన మహావీర వర్ధమానులిద్దరూ, తమ బోధనలను ప్రారంభించారు. బింబిసారుడికి బౌద్ధం, మరియు జైన రచనలలో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. బౌద్ధ, జైన మతాలు రెండూ, ఈయనను తమ మతస్థుడిగానే చెప్పుకుంటాయి. బింబిసారుడిని జైన గ్రంథాలలో, శ్రైనిక్ అని పిలిచేవారు. అందుకు కారణం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా యుద్ధానికి సంసిద్ధంగా ఉండే సైన్యాన్ని కలిగి ఉండేవాడట, బింబిసారుడు. అతడు ధైర్యవంతుడు మాత్రమే కాదు.. పొరుగు రాజ్యాలతో సామరస్య పూర్వక సంబంధాలను కొనసాగించే సహృదయుడు.
మగధ సామ్రాజ్యపు మొదటి రాజధాని, రాజగృహ. దీనిని రాజ్ గిర్, గిరివ్రజా అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పటికీ జైనులకు పవిత్ర తీర్థ యాత్రా స్థలంగా కొలువుదీరి ఉంది. తరువాతి కాలంలో, మగధ రాజధానిని, పాటలీపుత్రకు మార్చారు. మగధ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిరోహించడానికి, బింబిసారుని కుమారుడైన అజాతశత్రు, తన తండ్రిని ఖైదు చేయించాడు. అయితే, జైన మరియు బౌద్ధ చారిత్రక రచనల ప్రకారం, బింబిసారుని మరణంపై విభిన్న అభిప్రాయాలున్నాయి. జైన గ్రంథాల్లో, ఖైదు చేయబడిన బింబిసారుడు, అవమానం తట్టుకోలేక విషం తాగి మరణించినట్లు, పేర్కొన్నాయి. బౌద్ధ గ్రంథాలు, అజాత శత్రు, బుద్ధుడికి దుష్ట బంధువైన దేవదత్త ప్రభావంతో, తన తండ్రిని చంపాడని చెబుతున్నాయి. బింబిసారుడు సామాన్యశక పూర్యం, 491 లో మరణించాడు. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించి, 37 సంవత్సరాలు పాలించిన సమర్ధుడైన నాయకుడిగా, చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు బింబిసారుడు.
No comments:
Post a Comment