తుంబుర నారదుల ఘర్షణ!
మన పురాణాల ప్రకారం, రుషులూ, గంధర్వులూ, నాగులూ, అప్సరసలూ, యక్షులూ, రాక్షసులూ, దేవతలూ, వీరందరినీ సప్తగణాలంటారు. అందచందాలూ, రూపలావణ్యాలూ, సుమధుర గాత్రం, గంధర్వులకే సొంతం. మంత్రతంత్ర శాస్తాల్రలో, వీరి వైదుష్యం మాటల్లో వర్ణించలేనిది. ఎవరైనా అద్భుతమైన సంగీత సాహిత్యాలను ఆలపిస్తే, దానిని గంధర్వగానం అనేంతగా, గంధర్వుల పేరు పెనవేసుకుపోయింది. తమ ఉచ్వ్ఛాసనిశ్వాసాలుగా సంగీతాన్ని స్వీకరించి, అహర్నిశలూ సంగీతంతోనే తమ దైనందిన క్రియలను అన్వయించుకుని, సంగీతంతో తాదాత్మ్యత పొందిన ఘనత, గంధర్వులకే దక్కుతుంది. సంగీతాన్ని కేవలం ప్రక్రియగా కాకుండా, మోక్షాన్ని పొందడానికి సర్వోన్నతమైన మార్గంగా గుర్తించి, నాదసాధన చేసిన మహోన్నతులు గంధర్వులు. అందుకే, దేవతల్లో ప్రత్యేక శ్రేణిగా గుర్తింపు పొందారు. వారిలో తుంబురుడు దేవగాయకుడిగా శాశ్వత కీర్తిని సంపాదించాడు. తుంబురుడికి అంతటి సంగీత జ్ఞానం ఎలా లభించింది? గురువైన నారదుడితో, తుంబురుడి కలహానికి కారణమేంటి? గంధర్వుడైన తుంబురుడిని, రాక్షసుడిగా జన్మించమని కుబేరుడెందుకు శపించాడు? తిరుమల గిరులలోని తుంబుర తీర్థానికీ, తుంబురుడికీ సంబంధం ఉందా - అనేటటువంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూడండి..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PDJaB6-eRmQ ]
ఈ సృష్టిలో పరమేశ్వరుడి డమరుకం నుండి, సంగీతం జనించింది. ఆ సంగీతాన్ని ప్రజలందరికీ అందించాలని భావించాడు, పరమేశ్వరుడు. అదే సమయంలో నారదుడూ, తుంబురుడూ, ఒకే సారి శివదర్శనం కోసం వచ్చారు. దాంతో పరమేశ్వరుడు, వారిరువురికీ సంగీతాన్ని నేర్పించి, సమస్త లోకాలకూ సంగీతాన్ని పరిచయం చేయమన్నాడు. అలా తుంబురుడు దేవలోక వాసులకూ, నారదుడు భూలోకవాసులకూ సంగీతాన్ని పరిచయం చేశారు. తుంబురుడు దేవలోకంలోని కుబేరుని వద్ద కొలువుచేసేవాడు. రంభపై ఉన్న వ్యామోహంతో, కుబేరుడి వద్ద తన విధిని నిర్లక్ష్యం చేశాడు. దాంతో ఆగ్రహించిన కుబేరుడు, 'నీవు రాక్షసుడవై జీవించు' అని శపించాడు. ఆ శాపకారణంగానే తుంబురుడు, విరాధుడనే రాక్షసుడిగా జన్మించాడు. ఈ విరాధుడి గురించిన ప్రస్తావన, రామాయణంలో కనిపిస్తుంది. అరణ్యవాసంలో ఉన్న సీతారాముల దగ్గరకు వచ్చిన రాక్షసుడు, సీతమ్మవారిని ఎత్తుకుపోవాలని ప్రయత్నించి, శ్రీరాముడి చేతిలో మరణించి, శాప విమోచనాన్ని పొందాడు. తిరిగి దేవలోకాన్ని చేరికుని, తన గానామృతాన్ని దేవతలకు అందించాడు. నారదుడు ముల్లోకాలలో తిరుగుతూ, పరమేశ్వరుని నాదాన్ని అందరికీ పరిచయం చేశాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత, తుంబుర, నారదులకు గర్వం తలకెక్కి, నేను గొప్పంటే, నేను గొప్పంటూ, వాదనకు దిగారు. అది కాస్తా, దేవలోకంలో పెనుదుమారాన్ని లేపింది.
వారిద్దరిలో ఎవరు గొప్ప సంగీతకారులో తెలుసుకోవడం కోసం, సరస్వతీ దేవి దగ్గరకు వెళ్ళారు. ఆమె ఇద్దరి సంగీతమూ విని, ఇద్దరూ ప్రవీణులే అంది. వారికి సరైన సమాధానం దొరకకపోవడంతో, శివ పార్వతుల దగ్గరకు వెళ్ళారు. వారు కూడా ఇద్దరూ నిష్ణాతులే అని బదులివ్వడంతో, మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. ఆ శ్రీ హరి కూడా, మీరిరువురూ ఎవరికి వారే సాటి అని చెప్పడంతో, తుంబర నారదులు చిన్నబుచ్చుకున్నారు. ఇద్దరిలో ఎవరు గొప్ప సంగీతకారులో తెలుసుకోవడం ఎలా అని, శ్రీహరిని సలహా అడిగారు. అందుకాయన, సమయస్ఫూర్తీ, అష్టసిద్ధులకూ, నవనిధులకూ ప్రతీక అయిన హనుమంతుడే మీకు సరైన తీర్పు చెప్పగలడని, సెలవిచ్చాడు. దాంతో వారిరువురూ, వింధ్య పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్న హనుమ దగ్గరకు వెళ్లి, వారి సమస్యను వివరించారు. అందుకు హనుమంతుడు సరేనని, వారి వీణలను తీసుకుని, ప్రశాంతంగా కూర్చుని పాడడం మొదలుపెట్టాడు. తుంబుర, నారదులు ఆశ్చర్యపోయి, హనుమ శ్రావ్యమైన కంఠం విని పరవశులయ్యారు. హనుమంతుడి గానానికి, అక్కడున్న కొండరాళ్ళన్నీ ద్రవించి, ప్రవహించడం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు, తుంబురుడి వీణ కళావతినీ, నారదుడి వీణ మహతినీ, ఆ రాళ్ల ప్రవాహంలో పడేసి, గానం ఆపేశాడు. వెంటనే రాళ్ల ప్రవాహం తిరిగి నిశ్చల స్థితికి వచ్చింది.
ఆ ఘటనతో నిర్ఘాంతపోయిన తుంబుర నారదులు, తమ వీణలను ఎందుకలా పడేశారంటూ ప్రశ్నించారు. అప్పుడు హనుమంతుడు, మీ సంగీతంతో మీ వీణలను తిరిగి తెచ్చుకోండి, అని ప్రశాంతంగా సెలవిచ్చాడు. వీణల కోసం నారద, తుంబురులిరువురూ, తమ సంగీత ప్రావీణ్యాన్ని చూపించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో, దీనంగా హనుమ వంక చూశారు. హనుమ మళ్ళీ పాడడంతో రాళ్ళు ద్రవించి, ప్రవహించాయి. అందులో నుండి, వీణలను తీసి వారికి తిరిగి అప్పగించి, 'పరమేశ్వరుని సంగీతాన్ని అందరికీ అందించడమే, మీ లక్ష్యం. అందులో మీరిద్దరూ సమానులే' అని హితువు చెప్పి పంపాడు, హనుమంతుడు. గర్వం తలకెక్కితే, ఎంతటివారైనా నేలకొరగక తప్పదని, హనుమంతుడు నిరూపించాడు.
ఇక మన తిరుమల గిరులలో ఉన్న తుంబుర తీర్థానికీ, ఈ తుంబురుడికీ సంబంధం ఉంది. దీనికి సంబంధించిన ఒక గాథ, వరాహ పురాణంలో వివరించబడి ఉంది. ప్రాచీన బర్హి అనే మహారాజు, ప్రపంచమంతా దర్భలను పెంచి, అనుదినమూ యఙ్ఞయాగాదులు చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్న, కర్మయోగి. ఒకనాడు గాన గంధర్వుడైన తుంబురుడు అతని రాజ్యానికి వచ్చి, ఆ రాజు చేసిన, చేస్తున్న యఙ్ఞ కర్మలు చూసి ఎంతో సంతోషించి, ప్రాచీన బర్హిని ఎంతో స్తుతించాడు. "నీవంటి రాజు, ఈ భూమండలంలోనే లేడు. ఎన్ని యఙ్ఞాలు చేశావు! నీ వంటి గొప్పవాడింకొకడు లేడు. నీలాగా దానధర్మాలు చేసిన వారు కానీ, బ్రాహ్మణులకు సంతర్పణలు చేసిన వాడు గానీ, ఇంకొకరు లేరు. నీవు దానశిఖామణివి" అని పొగిడాడు. అయితే, ప్రాచీనబర్హిని అంతగా పొగడడానికి మరొక కారణం కూడా ఉంది. ఆ రాజు దగ్గర ఒక విశేష వీణ ఉంది. అది నవరత్నఖచితం. మణిమాణిక్యాలు పొదగబడిన చాలా అరుదైన, అద్భుతమైన వీణ. దాన్ని పొందడంకోసం, మానవమాత్రుడైన ప్రాచీనబర్హిని, తుంబురుడు పొగడ్తలతో ముంచెత్తాడు. దాంతో సంతోషించిన రాజు, తన దగ్గరున్న వీణను తుంబురుడికి అందించాడు.
దానిని తీసుకుని, ఆనందంతో నారద ముని వద్దకు వెళ్ళాడు, తుంబురుడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న నారదుడికి, విపరీతమైన కోపం వచ్చింది." భగవంతుడిని పొగడాల్సిన, సేవించాల్సిన మనం, మానవమాత్రుడైన ప్రాచీనబర్హిని పొగడడమేమిటి? అందునా, కామ్యాపేక్షతో అటువంటి నీచపు పని చేసిన నీవు, దండార్హుడవు. మన విద్య, ప్రతిభ, శక్తియుక్తులూ, భగవంతుని ఆరాధనకై వినియోగించాలే గానీ, ఉదర పోషణకొరకు గానీ, స్వలాభాపేక్షకొరకు గానీ వినియోగించరాదు. ఇలా అన్య లాభాపేక్షతో నరస్తుతి చేసిన నీకు, ఆకాశమార్గంలో వెళ్లే అర్హత లేదు. పోయి భూలోకంలో జీవించు" అని శపించాడు. అలా తుంబురుడు భులోకంలో, శ్రీ వేంకటాచలంలోని ఘోణ తీర్థం దగ్గర పడ్డాడు. నాటి నుండీ అక్కడే ఉంటూ, ఆ తీర్థంలో రోజూ స్నానం చేసి, తపస్సు చేసుకుంటూ జీవించాడు.
అలా తీర్థ స్నాన, తపాలు చేస్తున్న తుంబురునికి, ఫాల్గుణ మాసంలో శ్రీ మహావిష్ణువు దర్శనం లభించింది. ఆయనతో పాటు వచ్చిన బ్రహ్మది దేవతలు కూడా, ఆ ఘోణ తీర్థంలో స్నానం చేశారు. వారితో పాటు స్నానం చేసిన తుంబురునికి శాపవిముక్తి కలిగి, తన గంధర్వరూపం, ఆకాశయాన శక్తీ, ఇతర గంధర్వ శక్తులూ, ముఖ్యంగా, మధురంగా గానం చేసే శక్తీ, తిరిగి వచ్చాయి. దాంతో తుంబురుడు, విష్ణువుని పరిపరివిధాలా స్తుతించి, ఆ తీర్థానికి తన పేరు పెట్టాలని కోరాడు. అలా ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు, ప్రసిద్ధి చెందింది. ఇది చాలా మహాత్మ్యం గల తీర్థం. సకల దేవతలూ, ఆ శ్రీ మహా విష్ణువు సమక్షంలో స్నానం చేసిన తీర్థం. ఆ తీర్థానికి వెళ్లి స్నానం చేయకుండా వస్తే, దానిని తిరస్కరించినందుకు, పంచమహా పాతకాలు చుట్టుకుంటాయని, వరాహా పురాణం చెబుతుంది. ఈశ్వర ప్రసాదితమైన ఉత్తమ మానవ జన్మను, భగవంతుని గుణగానం చేయడానికే గానీ, ఇతర మానవమాతృలను పొగడుతూ, పబ్బం గడుపుకోవడానికి వినియోగించరాదని, ఈ తుంబురుని కథ ద్వారా మనం తెలుసుకోవాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ!
No comments:
Post a Comment