Ads

31 January, 2022

దేవయానీ శర్మిష్ఠల వైరం! జీవితాలను అల్లకల్లోలం చేసిన వాగ్వాదం! Mahabharata Stories

  

దేవయానీ శర్మిష్ఠల వైరం! జీవితాలను అల్లకల్లోలం చేసిన వాగ్వాదం!

శుక్రాచార్యుడి గారాల పట్టి దేవయాని, బృహస్పతి కుమారుడైన కచుణ్ణి అమితంగా ప్రేమించింది. కానీ, అతడు నిరాకరించడంతో భంగపడింది. మన గత వీడియోలో, కచ దేవయానిల ప్రేమ గాథ వివరించాను. చూడనివారికోసం ఆ వీడియో లింక్, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాను. గురుపుత్రిక దేవయానికీ, రాజ కుమార్తె శర్మిష్ఠకూ మధ్య జరిగిన వాగ్వాదం, వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. దేవయానీ, శర్మిష్ఠల మధ్య ఏం జరిగింది? కూతురి బాధను చూసి తాళలేని శుక్రాచార్యుడు ఏం చేశాడు?  తనకు జరిగిన అవమానానికి, దేవయాని ఏ విధంగా పగ తీర్చుకుంది - వంటి ఉత్సకతను రేకేత్తించే విషయాల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iW5A4tyLmLo ]

ఒకనాడు రాక్షస రాజు వృషపర్వుడి కుమార్తె అయిన శర్మిష్ఠ, తన వెయ్యిమంది చెలికత్తెలతో కలసి, వనవిహారానికి  బయలుదేరింది. వారితో పాటు, రాజ గురువైన శుక్రాచార్యుని గారాల పట్టి దేవయాని కూడా వెళ్ళింది. వారందరూ  మధ్యాహ్న వేళ జల క్రీడలకై, శీతల సరోవరంలో దిగడానికి ఉపక్రమించారు. కట్టుకున్న చీరలు విప్పి గట్టుపై పెట్టి,  ఆనందంగా కేరింతలు కొడుతూ, జలకాలాడడం మొదలు పెట్టారు. అంతలో సుడిగాలి భయంకరంగా వచ్చింది. ఆ గాలి తీవ్రతకు, గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలగాపులగం అయ్యాయి. ఆ సుడిగాలి భీభత్సానికి భయభ్రాంతులయిన ఆ  లలనామణులు, గొల్లుమంటూ పరిగెత్తుతూ, ఒడ్డుకు చేరారు. ఆ గందరగోళంలో, గట్టుపై ఉన్న చీరలలో ఎవరికి దొరికిన  చీర వాళ్ళు తీసి, కట్టుకున్నారు. ఆ హడావిడిలో శర్మిష్ఠ, దేవయాని చీర కట్టుకుంది. సహజంగా అహంభావి అయిన దేవయాని, అది చూసింది. వెంటనే కోపం కట్టలు తెంచుకుంది. అయితే, శర్మిష్ఠ తన చీరను కట్టుకోమని దేవయానికి చెప్పింది.

దాన్ని కనీసం ముట్టుకోకుండా, అసహ్యించుకుంది దేవయాని. 'బ్రాహ్మణ పుత్రికను నేను. అదీగాక, ఈ రాజ్యానికి గురువయిన శుక్రాచార్యుని కుమార్తెను. కనుక నువ్వు నా శిష్య సమానురాలవు. నువ్వు నాకు వంగి దణ్ణం పెట్టాల్సిన దానవు. ఉచితానుచితాలు మరచి, నా బట్టలు కట్టడమే కాకుండా, నన్ను నీ మైల చీర కట్టుకోమంటావా?' అంటూ ధుమధుమ లాడింది. దేవయాని మాటలు శర్మిష్ఠను ఆగ్రహానికి గురిచేశాయి. 'ఓసీ దేవయానీ. దానవులకు ‘రాజైన’ వృషపర్వడు నా తండ్రి. అటువంటి మా తండ్రి వద్ద చేతులు కట్టుకుని పనిచేసుకు  బ్రతుకుతున్నాడు, నీ తండ్రి. అలాంటిది, నువ్వు నా దగ్గర నీ గీర్వాణాలు తీస్తున్నావు. పైపెచ్చు, సిగ్గూ సెరమూ లేకుండా  మాట్లాడుతున్నావు. నా చీర నీకు కట్టుకోవడానికి దొరకడమే, నీ అదృష్టం. నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. ఎక్కువగా నోరు పారేసుకుంటే, క్షణంలో శాసించగలను. ఇంకా మాట్లాడితే, కఠినంగా శిక్షించగలను. జాగ్రత్త' అంటూ,  కఠోరంగా పలికింది శర్మిష్ఠ. ఆమె మాటలు విని కోపోద్రిక్తురాలైన దేవయాని, శర్మిష్ఠ కట్టుకున్న తన చీరను  ఊడదీయమంది.

ఆ చర్యను సహించలేని శర్మిష్ఠ క్రోధంతో ఊగిపోతూ, దేవయానిని ప్రక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి తోసేసి, చెలికత్తెలతో కలిసి, అంత:పురానికి వెళ్ళిపోయింది. చాలా సేపు నగ్నంగా ఆ బావిలోనే ఉండిపోయింది దేవయాని. కొంతసేపటికి దైవికంగా అక్కడకు వచ్చాడు, నహుష నందనుడు యయాతి. వేటాడి అలసిపోయి, దాహార్తియై, ఆ బావి చెంతకు వచ్చాడు. అందులో అగ్ని శోభ వలె వెనుగులీనుతూ, దేవతామూర్తి వలె  గోచరిస్తున్న దేవయానిని చూశాడు. ఒక తీగను పట్టుకుని, అసహాయతతో వ్రేళాడుతూ ఉన్న దేవయానిని చూసి,  సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. తరువాత తేరుకుని, 'కళ్యాణీ, ఎవరు నీవు? ఈ పాడుబడిన బావిలో ఎలా పడ్డావు? నీ ముఖంలో, తీవ్రమైన ఆవేదన కనబడుతోంది? అసలేం జరిగింది?' అని అనునయంగా అడిగాడు, యయాతి.  'మహాత్మా! ఎవరి అనుగ్రహం చేత మరణించిన దానవులు పునర్జీవులై దేవతలను నియంత్రిస్తున్నారో, అట్టి  పూజనీయుడైన శుక్రాచార్యుని ప్రియ పుత్రికను నేను. నా  పేరు దేవయాని. నా ఈ దురవస్థ, నా తండ్రికి ఇంకా తెలిసి  ఉండదు. ఇంతకీ మీరెవరు? ఏ పని నిమిత్తం ఇటు వచ్చారు?’ అని అడిగింది దేవయాని.

'ఓ బాలా! నేను నహుష రాజ  కుమారుడను. యయాతిని. వేటాడుతూ, పిపాసా పీడితుడనై, స్వచ్ఛ జలాలు అన్వేషిస్తూ, ఈ బావి వద్దకు వచ్చాను. ఇక్కడ నువ్వు యాదృచ్ఛికంగా కనిపించావు' అన్నాడు యయాతి.  'రాజా, మీరు కరుణామూర్తులు. ఈ ప్రమాదం నుండి అబలనైన నన్ను, మీరే రక్షించాలి. ఈ కూపము నుండి నన్ను మీరే ఉద్ధరించాలి' అంటూ, తన కుడి చేతిని అందించింది దేవయాని. వెంటనే తన కుడి చెయ్యి అందించి, భద్రంగా పైకి తీసి, ఇక నిర్భయంగా ఇంటికి వెళ్ళమని,  దేవయానికి చెప్పాడు యయాతి. రాజు వెళ్ళిపోయాక కొంతసేపటికి, దేవయానిని వెతుక్కుంటూ వచ్చింది ఆమె  పరిచారిక ఝార్ణిక. శర్మిష్ఠతో జరిగిన వాగ్వాదం గురించి ఆమెకు చెప్పి, ఇకపై వృషపర్వుడి రాజ్యంలో ఉండబోనని తన మాటగా తండ్రికి చెప్పమంది, దేవయాని. శర్మిష్ఠ తనకు చేసిన పరాభవానికి తగిన శాస్తి జరిగే వరకూ అడవిలోనే  ఉంటానని, ఖరాఖండిగా చెప్పింది.

ఘార్ణిక దేవయాని చెప్పిన మాటలు, పూసగుచ్చినట్లుగా శుక్రాచార్యుడికి చేరవేసింది. హూటాహుటిన దేవయాని ఉన్న  ప్రాంతానికి చేరుకున్నాడు, శుక్రాచార్యుడు. భోరున విలపిస్తున్న కూతురిని ఆ  స్థితిలో చూసిన శుక్రాచార్యుడికి, గుండె తరుక్కుపోయింది. దేవయానిని ఊరడిస్తూ, 'అమ్మా, అసలేం జరిగింది?' అంటూ పరామర్శింపజూశాడు. అప్పుడు దేవయాని, 'తండ్రీ, అవన్నీ అటుంచండి. మీరు వృషపర్వుడిని నిత్యం స్తుతిస్తూ, ఆయన దయా దాక్షిణ్యాలతో బతుకు వెళ్ళదీస్తున్నారని శర్మిష్ఠ అన్నది. అది వాస్తమేనా? దానికి సమాధానం కావాలి నాకు' అన్నది దేవయాని. అప్పుడు  శుక్రుడు, 'అమ్మా, శర్మిష్ఠ పలికిన మాటలలో వాస్తవం లేదు. రాజులను పొగడుతూ, వాళ్ళ వద్ద చేతులు చాస్తూ, వాళ్ళ అనుగ్రహంతో బ్రతికే ఖర్మ, నీ తండ్రికి లేదు. స్తుతులనూ, ప్రస్తుతులనూ పొందేవాడేగానీ, అన్యులను స్తుతించి ఎరుగడు ఈ శుక్రాచార్యుడు. నేను సదా లోక కళ్యాణార్ధం నిమగ్నుడనై ఉంటూ, పరమాత్మ నాకనుగ్రహించిన వరాలను, జగత్కళ్యాణానికి వినియోగిస్తాను. శర్మిష్ఠ ఆవేశంలో అన్న మాటలను, అంతగా పట్టించుకోకు. నీ కంటే వయస్సులో చిన్నది శర్మిష్ఠ. పైగా రాజపుత్రిక. తనతో మనకి పంతమేమిటి? శాంతించు. నా మాట విను' అంటూ అనునయించాడు.

ఎర్రబడిన ముఖంతో, అవమాన భారంతో రగిలిపోతున్న దేవయానికి, తండ్రి మాటలు రుచించలేదు. కోపంతో ఊగిపోతున్న దేవయానిని చూసి శుక్రాచార్యుడు, 'అమ్మా, మనకు కోపం వలదు. వెయ్యి యజ్ఞాలు చేసిన వాళ్ళకంటే, కోపాన్ని అధిగమించి, అదుపులో ఉంచుకున్న వారే గొప్పవారు. మాట అన్నవారు అగ్రజులూ కారు, పడ్డవారు చిన్న వారూ కారు. అజ్ఞానంతో పిల్లలు పోట్లాడుకోవచ్చు.. వారిని పెద్దలు అనుకరించ కూడదు. అన్నీ తెలిసిన బుద్ధిమంతురాలివి నువ్వు. నీకు నేను చెప్పాలా!' అన్నాడు శుక్రాచార్యుడు. తండ్రి మాటలకు నెమ్మదించిన దేవయాని, ‘నాన్నా, మీరెన్నైనా చెప్పండి. వృషపర్వుడి రాజ్యంలో మాత్రం అడుగు మోపను. శర్మిష్ఠ కఠినోక్తులతో గాయపడిన నా హృదయం, తిరిగి స్వస్థతను పొందలేదు. కావలిస్తే మీరు వెళ్ళండి.. నేను మాత్రం రాను' అని నిష్కర్షగా చెప్పింది. ఆ మాటలు శుక్రాచార్యుణ్ణి మిక్కిలి బాధించాయి. అతనిలో క్రోధాన్ని రగిల్చాయి. తక్షణమే బయలుదేరి, వృషపర్వుని సమీపించాడు. వృషపర్వుని రాజ్యం ధర్మానికి దూరంగానూ, పాపానికి దగ్గరగానూ చరిస్తోందనీ, అటువంటి రాజ్యంలో ఉండలేననీ, తక్షణమే రాజ్యాన్ని త్యజిస్తున్నానీ, తెగేసి చెప్పాడు. జరిగిన తతంగమంతా చారులద్వారా  అంతకు  ముందే తెలుసుకున్న వృషపర్వుడు, జరిగిన అపరాధాన్ని మన్నించమని, శుక్రాచార్యుడిని బ్రతిమాలాడు.

'ఈ ఆస్తీ, పాస్తీ, రాజ్యం, ప్రజలూ, అంతా మీరు పెట్టిన భిక్షే. మీరు లేకపోతే, ఏనాడో మమ్మల్ని ఆపోశనం పట్టేసి, అంతం చేసే వాళ్ళు దేవతలు. మమ్మల్ని మన్నించి, కనికరించండి.' అంటూ, అనేక విధాల ప్రాధేయ పడ్డాడు వృషపర్వుడు. అప్పటికీ చల్లారని శుక్రాచార్యుడు, 'వృషపర్వా! నీ మాటలు నాకనవసరం. నా బిడ్డకు కలిగిన దు:ఖాన్ని నేను భరించలేకపోతున్నాను. నా కూతురు దేవయాని బాధను నీవు ఉపశమింప జేయగలిగితే, నాతో మీకు సంబంధాలు మిగులుతాయి. లేదంటే, శాశ్వతంగా తెగిపోతాయి.' అని ఖరాఖండిగా చెప్పాడు. అంతట వృషపర్వుడు, 'ఆచార్య, అంతటి కఠోర నిర్ణయాలు తీసుకోవద్దు. జరిగిన పాపంలో నా పాత్ర ఉంటే, నాకు సద్గతులుండవు. నా పాపానికి నిష్కృతి ఉండదు. అమ్మాయిని శాంతించమనండి. ఆమె ఏది కోరితే అది ఇచ్చుకుంటాను. ఆమె చెప్పినట్లుగానే  నడుచుకుంటాను. సదా మీ అనుగ్రహాన్ని కోరుకునే ఈ దాసుడు, మీ ఆగ్రహానికి తాళలేడు.' అంటూ స్తుతించాడు వృషపర్వుడు. శుక్రాచార్యునితో కలసి, వృషపర్వుడు దేవయాని వద్దకు వెళ్ళాడు. 'అమ్మా దేవయానీ. నేను ఈ దేశానికి రాజునే గానీ, మీ తండ్రికి సేవకుడను. నీకు జరిగిన తప్పిదానికి, మిక్కిలి చింతిస్తున్నాను. నీకు ఎలాంటి పరిష్కారం కావాలో, నిస్సంకోచంగా చెప్పు. తక్షణమే అమలు చేస్తాను.' అని అన్నాడు. 'అయితే వినండి మహారాజా! తన వెయ్యి మంది చెలికత్తెలతో సహా, మీ కూతురు శర్మిష్ఠను నాకు దాసీగా చేయండి. అంతేకాదు, నాకు వివాహమై, అత్తవారింటికి వెళ్ళినా సరే, శర్మిష్ఠ, ఆమె సహస్ర దాసీ పరివారం, అక్కడ కూడా నన్ను సేవించాలి.' అని మొక్కవోని ధైర్యంతో పలికింది దేవయాని.

ఆమె మాటలు విన్న వృషపర్వుడు, దేవయాని మనోరథాన్ని నెరవేర్చడానికి సంసిద్ధుడయ్యాడు. కుల ప్రయోజనాన్ని ఆశించి, వ్యక్తిని త్యజించవచ్చు. గ్రామ  శ్రేయస్సు కోసం, కులాన్ని త్యజించవచ్చు. జన కల్యాణానికై,  గ్రామాన్ని త్యజించవచ్చు. ఆత్మార్థం కోసం, ప్రపంచాన్నే త్యాగం చేయవచ్చు. ఆచార్యా! దేవయాని కోరికను నేను సఫలం చేస్తాను. నా యావత్ దానవ జాతి శ్రేయస్సు కోరి, శర్మిష్ఠను త్యజిస్తాను.' అని పలికి, శర్మిష్ఠను పిలిపించాడు. దేవయానికి దాసీగా సమర్పించాడు. శర్మిష్ఠ, విషయాన్ని గ్రహించింది. తండ్రి మనోవేదనను అర్థం చేసుకుంది. దేవయాని కోరినట్లు,  జీవితాంతం ఆమెను సేవించేందుకు అంగీకరించింది. రాజ కుమార్తె శర్మిష్ఠ వెంట, వెయ్యి మంది పరిచారికలు కూడా,  దేవయానిని అనుసరించారు. అప్పుడు దేవయాని, 'నాన్నా, ఈ సంఘటనతో, నాకొక విషయం అవగతమైంది. విద్యకు గల బలం, విత్తానికి గానీ, అధికారానికి గానీ లేదని, నాకు అర్థమయ్యింది. పదండి నాన్నా, మీ వెంట నగరానికి వస్తున్నాను.' అంటూ, సంతోషంగా నడిచింది దేవయాని. రాచ మర్యాదలతో, శుక్రాచార్యుణ్ణీ,  దేవయానినీ నగరంలోకి ఆహ్వానించారు, దానవులు.

ఇక మన తదుపరి వీడియోలో, దేవయానీ, యయాతిల కలయిక, వివాహం, యయాతి దేవయానిని మోసం చేసిన వైనం, యయాతికి శుక్రాచార్యుడిచ్చిన శాపం వంటి విషయాల గురించి, తెలుసుకుందాము..

No comments: