Ads

22 January, 2022

బంగారం - మట్టి పాత్రలు! అందమా - గుణమా?

 

బంగారం - మట్టి పాత్రలు! అందమా - గుణమా?

తన అసమాన ప్రతిభతో, మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుచెరగులా వ్యాపింపజేసిన ఘనత, ఆచార్య చాణక్యులది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగానూ మన్ననలు అందుకున్న కౌటిల్యుడు, జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. సామాన్య శకానికి పూర్వం, గుప్తుల కాలంలో తెలిపిన విషయాలు, నేటి సమాజానికీ ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. ఆచార్య చాణక్యులు, పలు సమస్యలకు తెలివైన సలహాలు అందిస్తూ, వాటికి పరిష్కారం సూచించారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/I3_B2euxV_U ]

ఒక రోజు చంద్రగుప్త మౌర్య చక్రవర్తీ, మహామంత్రి చాణక్యులూ, ఏదో విషయమై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా, చంద్రగుప్తుడు చాణక్యునితో, 'మీరు నల్లగా ఉన్నారు. దూరం నుంచి కురూపిగా కనిపిస్తారు. అయితే, మీలో లెక్కకుమించిన సద్గుణాలు ఉన్నాయి. అలాగే మీరు అందంగా కూడా ఉండి వుంటే, మరింత బాగుండే వారు. భగవంతుడు ఆ విషయంలో, మీ పై చిన్న చూపు చూశాడు కదా!' అని అన్నారు..

వెంటనే చాణక్యుడు సమాధానమిస్తూ, 'మహారాజా.. రూపమనేది అందరినీ మోహింపజేయడం, వాస్తవమే. అయితే, ఇది క్షణికం మాత్రమే. ఇందులో గొప్పదనమేమీ లేదు.' అని అన్నారు.

వెంటనే మహారాజు మాట్లాడుతూ, 'మీరు అందంగా లేరని, అలా వాదిస్తున్నారనుకుంటున్నాను. మరి అందం కన్నా గుణం గొప్పదని చెప్పే ఏదైనా ఒక ఉదాహరణ మీ దగ్గర ఉంటే, చెప్పండి.' అని అడిగారు.

అప్పుడు చాణక్యడు రెండు పాత్రలలో మంచినీటిని తెప్పించి, మహారాజుతో, 'ఈ నీటిని త్రాగండి' అంటూ, ఆ రెండు పాత్రలనూ అందించారు..

వాటిలో మొదటి పాత్ర బంగారంతో చేసినది, రెండవది, మట్టి పాత్ర. ఆ రెండింటిలో దేనిలోని నీరు బాగుందని అడిగారు.

దానికి మహారాజు సమాధానమిస్తూ, 'మట్టి పాత్రలోని నీరు, చాలా రుచికరంగా ఉంద'ని అన్నారు.

వెంటనే చాణక్యుడు, 'చూశారుగా.. మట్టి పాత్రలోని నీరే మీకు తృప్తి నిచ్చింది. అదే బంగారు పాత్ర కంటికి అందంగా కనిపించినా, మట్టి పాత్రలోని నీరే, మీకు గొప్పగా అనిపించింది. అంటే, గుణం కారణంగానే మీకు సంతృప్తి కలిగింది కానీ, అందం వలన కాదు కదా! ఇదే గుణానికున్న గొప్పదనం' అని చాణక్యలు మహారాజుకు తెలియజేశారు.

దీని ద్వారా ఆచార్య చాణక్యలు, మనకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు.. మనం బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యతనిస్తూ, గుణాలకు విలువ నివ్వకపోవడం వలన, చాలా కోల్పోతున్నామనీ, అందుకే ముందుగా గుణాలను చూడాలనీ, చాణక్యలు సూచించారు.

అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై, కౌటిల్యుడు తమ జీవితకాలం మొత్తం వెచ్చించారు. ఈ చారిత్రక గ్రంథాలు, నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిలో జీవితం, విజయం గురించిన విషయాలు, కోకొల్లలు పొందుపరిచారు.

No comments: