Ads

09 November, 2021

దేవలోకంలోని అప్సరసల మధ్య జగడానికి విక్రమార్క చక్రవర్తి పరిష్కారం!

  

దేవలోకంలోని అప్సరసల మధ్య జగడానికి విక్రమార్క చక్రవర్తి పరిష్కారం!

‘అప్సరస’ అంటే అతీతమైన అందానికి పర్యాయపదం. అటువంటి సౌందర్యరాశులతో శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది ఇంద్రలోకం. రంభ, ఊర్శశి, మేనక వంటి అతిలోక సుందరీమణులందరూ, దేవేంద్రుడి సూచన మేరకు నడుచుకుంటారు. వీళ్ళు దేవ నర్తకీ మణులు. అప్సరసలు వారి నాట్యంతో, ముగ్ధమనోహర రూపంతో, ఎటువంటి వారినైనా వశపరుచుకోగలరు. సమస్తలోకాలలో, అత్యంత సౌందర్యవతులుగా పేరు తెచ్చుకున్న రంభ, ఊర్వశిల మధ్య, ఒక వివాదం చెలరేగింది. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే అంశం, ఇంద్రలోకాన్ని అతలాకుతలం చేసింది. దేవలోకంలో జరిగిన ఈ జగడంలో, ఎవరు గెలిచారు? దేవేంద్రునికి నారదుడిచ్చిన సలహా ఏంటి? విక్రమాదిత్యుడు, రంభ, ఊర్వశిలలో ఎవరిని విజేతగా ఎంపిక చేశాడు? అందుకు విక్రమార్కుడు పెట్టిన పరీక్ష ఏమిటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/TZDlGvB2rUM ​]

ఒకనాడు అమరావతీ నగరంలో, దేవ నర్తకీమణులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచీ, పుంజక స్థల మొదలైన వారి మధ్య, వివాదం తలెత్తింది. అది కాస్తా పెరిగి, రంభ, ఊర్వశిల మధ్య, ఇద్దరిలో ఎవరు గొప్ప నాట్యగత్తెలనే ప్రశ్న, తీవ్రరూపం దాల్చింది. వారిరువురూ, నేను గొప్పంటే, నేను గొప్పని, ఒకరి నొకరు సవాలు చేసుకోసాగారు. వీరి వివాదం, దేవేంద్రుడి చెవి దాకా చేరింది. దేవలోక వాసుల మధ్య, ఇటువంటి వివాదాలు రేకెత్తటం, దేవేంద్రుడికి సబబుగా తోచలేదు. అతడు రంభ, ఊర్వశులిద్దరినీ పిలిపించి, ‘ఎందుకిలా మీలో మీరు గొడవపడుతున్నారు? మీరిద్దరూ, సమస్త లోకాలనూ ఆకట్టుకునే గొప్ప నర్తకీమణులనడంలో సందేహం లేదు. కాబట్టి, మీ పంతాలను వదిలి, ప్రశాంతముగా ఉండండి’ అని హితవు చెప్పాడు. అందుకు రంభ, ఊర్వశులిద్దరూ, దేవేంద్రునికి వినయంగా నమస్కరించి, ‘దేవేంద్రా! నీవు దేవతలకథిపతివి. మన ప్రతిభాపాటవాలని బట్టే, ప్రజలలో గౌరవమర్యాదలు లభిస్తాయి. రాజైన వాడు, సమర్థులనీ, అసమర్థులనీ ఒకే విధముగా జమ కట్టరాదు. రాజు తన ప్రజలలో, అర్హతానర్హతలను బట్టి ఆదరించినప్పుడే, అతడు నీతిని పాటించినట్లవుతుంది’ అని అన్నారు. దేవేంద్రుడు వారి మాటలలోని సత్యాన్ని గుర్తించాడు.

రంభ ఊర్వశిలలో గొప్ప వారెవరో తేల్చడానికి, సభలో నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఆ సౌందర్యరాశుల నాట్యాన్ని తిలకించడానికి, మహామహులందరూ విచ్చేశారు. రంభా, ఊర్వశిల ఆహార్యం, అభినయం చూసి, దేవసభలో ఉన్నవారందరూ ముగ్ధమోహితులయ్యారు. కానీ, వీరిలో గొప్పవారెవో తేల్చడం, అక్కడున్న వారితో పాటు, దేవేంద్రుడికి కూడా సాధ్యం కాలేదు. ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన నారద మహర్షి, ‘ఓ దేవేంద్రా! రంభా ఊర్వశుల అద్భుత కళాకౌశలాన్ని, అషామాషీగా తలచి, మనకి తోచిన నిర్ణయం చెప్పుట, సరియైనది కాదు. అలా చెప్పినట్లయితే, అది వృధానే అవుతుంది తప్ప, వారి వివాదానికి పరిష్కారం కాదు. కానీ, ఈ సమస్యను పరిష్కరించగల పురుషుడు, భూలోకంలో ఒకడున్నాడు. ఉజ్జయినీ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్న మహారాజు, విక్రమాదిత్యుడు. అతడు గొప్పయోధుడు, సాహసీ. అరవై నాలుగు కళలలోనూ ఆరితేరిన వాడు. మనుస్మృతిని చక్కగా ఎరిగిన వాడు. అటువంటి విక్రమాదిత్యుడే, ఈ సమస్యకు పరిష్కారం చూపగలడు’ అని సలహా ఇచ్చాడు.

దాంతో దేవేంద్రుడు సంతోషించి, తన సారధియైన మాతలిని పిలిచి, విక్రమాదిత్యుణ్ణి సాదరంగా, అమరావతికి ఆహ్వానించి తీసుకురమ్మని, భూలోకానికి పంపాడు. కానీ, అది మాతలికి ఇష్టం లేదు. మహామహులూ, మహోన్నత మునులూ ఉన్న ఈ స్వర్గలోకానికి, ఒక మానవుడిని తీసుకువచ్చి సత్కరించడమా? అని ఆలోచిస్తూ, అయిష్టంగానే బయలుదేరాడు. రాత్రి పదహారు ఘడియలకు ఉజ్జయినీ నగరాన్ని చేరి, దేవరధాన్ని ఉజ్జయినీ మహంకాళి ఆలయ సమీపంలో నిలిపాడు, మాతలి. విక్రమాదిత్యుని సభకు చేరి, ఆయనకు నమస్కరించి, వచ్చిన పనిని తెలియజేసి, ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. దేవేంద్రుడి ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించిన విక్రమార్క మహారాజు, మహంకాళీ ఆలయానికి వెళ్ళి, ఆ తల్లిని దర్శించుకుని ప్రార్థించి, దేవరథాన్ని చేరాడు. అది దేవతల రథమైనందున, ఎక్కబోయే ముందు దానికి ప్రదక్షిణలు చేసి, భక్తితో నమస్కరించి, ముందుగా కుడి పాదం మోపాడు.

రెండవ కాలు నేలమీద ఉండగానే, మాతలి రథాన్ని ముందుకు ఉరికించబోయాడు. కానీ విక్రమాదిత్యుడు, తన పాదాలని భూమ్మీదా, రథం మీదా గట్టిగా నొక్కి ఉంచి, స్థిరంగా నిలబడ్డాడు. దాంతో రథం, అంగుళం కూడా ముందుకి కదలలేదు. మాతలి ఆశ్చర్యంతో, వెనుదిరిగి చూశాడు. చిరునవ్వుతో స్థిరంగా నిలిచి ఉన్న విక్రమాదిత్యుణ్ణీ, అతడి ప్రయత్నాన్నీ గమనించాడు. మాతలికి భయమూ, విభ్రమమూ కలిగాయి. ఇతడు సాధారణ మానవమాత్రుడు కాదు, దైవ సంభూతుడని గ్రహించి, వెంటనే రథము దిగి వచ్చి, విక్రమాదిత్యుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. ఎంతో వినయ విధేయతలతో అతణ్ణి ఇంద్రసభకు తీసుకువెళ్ళాడు, మాతలి. దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని చూసి, ఎంతో సంతోషించి, కుశల ప్రశ్నలడిగాడు. తరువాత దేవేంద్రుడు, విక్రమాదిత్యునికి అతిధి మర్యాదలు చేసి, రంభ, ఊర్వశిల మధ్య మొదలైన జగడం గురించి, వివరించాడు. సమస్య తెలుసుకున్న విక్రమాదిత్యుడు, మరుసటి రోజు నాట్య ప్రదర్శనకు ఏర్పాటు చేయమని, అడిగాడు.

వారిరువురి నాట్యాన్నీ చూసి పరవశుడైన విక్రమాదిత్యుడు, వీరిలో విజేతలెవరో, రేపు తెలియజేస్తానన్నాడు. అందుకుగాను, విక్రమాదిత్యుడు రకరకాల పుష్పాలను సేకరించి, రెండు పూలమాలలను తయారు చేసి, మధ్యలో కొన్ని విష కీటకాలను ఉంచాడు. తరువాతి రోజు సభకు వెళ్ళి, ఈ పూలహారాలని చేత ధరించి, నాట్యం చేయండి, అంటూ, రంభ ఊర్వశిలకి చెరో దండనీ అందించాడు. వాళ్ళిద్దరూ నాట్యాన్ని ప్రారంభించారు. నాట్యం చేస్తున్న వేళ, రంభ, తన చేతిలోని దండను గట్టిగా పట్టుకుంది. అందువలన దండలోపలున్న క్రిములు, ఒత్తిడికి గురై, బయటకు వచ్చి, ఆమెను ఇబ్బంది పెట్టాయి. దానితో, శృతిలయలకు అనుగుణంగా పడాల్సిన అడుగులు, తాళం తప్పాయి. అందుకామె ఆ పూల దండను విసిరేసి, తిరిగి నాట్యం ప్రారంభించింది. కానీ ఊర్వశి, తన చేతిలోని దండని అలవోకగా పట్టుకుని నాట్యం చేయసాగింది. దాంతో, దండ లోపలి క్రిములకి ఏ వత్తిడీ కలగలేదు.

వారి నాట్య ప్రదర్శన ముగిశాక, దేవేంద్రుడు ‘ఓ విక్రమాదిత్యా! ఈ నాట్య పోటీలో విజేత ఎవరు? రంభ, ఊర్వశిలలో ఎవరిని ఉత్తమ నాట్య ప్రవీణగా నీవు నిర్ణయించావు?’ అని అడిగాడు. అందుకు విక్రమాదిత్యుడు చిరునవ్వుతో, ‘దేవేంద్రా! ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె’ అని అన్నాడు. దేవేంద్రుడు ఓ క్షణం ఆశ్చర్యచకితుడై, కుతూహలంగా.., ఎలా నిర్ణయించావు? అని అడిగాడు. అప్పుడు విక్రమాదిత్యుడు రంభ, ఊర్వశిలిద్దరినీ పిలిచి, వారి దండలను ఇవ్వమని అడిగాడు. వెంటనే ఊర్వశి తన చేతిలోని పూలహారాన్ని, విక్రమాదిత్యుడికి అంద చేసింది. రంభ తాను విసిరేసిన పూలమాలను వెదికి తీసుకువచ్చి, విక్రమాదిత్యునికిచ్చింది. ఊర్వశి దగ్గరున్న మాలలో పూలన్నీ చెక్కు చెదరకుండా, తాజాగా ఉన్నాయి. రంభ ఇచ్చిన మాలలో పుష్పాలు కొన్ని రాలిపడి పోయి, అక్కడక్కడా దారం బయటపడుతూ, అందవిహీనంగా ఉంది. ఆ దండలను విప్పి, అందులోని విష క్రిములను చూపుతూ, ‘దేవేంద్రా!  ఊర్వశి పూలదండని అలవోకగా పట్టుకోవటం చేత, ఈ క్రిములామెని పీడింపలేదు. రంభ మాలను గట్టిగా పట్టుకోవటం చేత, అవి ఆమెను గాయపరిచాయి. కాబట్టి, ఆమె దండని ప్రక్కకు విసిరేసింది.

ఊర్వశికి, తన నాట్య కౌశలం మీద నమ్మకం ఉంది. ఆమె విజయాన్ని గురించి ఆందోళన చెందలేదు. కనుక దండని అలవోకగా పట్టుకుంది. కాబట్టి, ఆమె ప్రశాంత చిత్తంతో, స్వేచ్ఛగా నాట్యమాడింది. రంభ తన నాట్యం గురించీ, విజయం గురించీ, ఆందోళిత హృదయంతో ఉంది. ఆమె నాట్యం చేస్తున్నప్పుడు, ఒత్తిడితోనూ, గెలుపు గురించిన బెంగతోనూ ఉంది. దానితో దండని గట్టిగా పట్టుకోగా, అందులోని క్రిములామెని కుట్టి బాధించాయి. అది భరించలేక, రంభ దండని విసిరి కొట్టింది. అదీ, వీరిద్దరి నాట్య కౌశలంలోని వ్యత్యాసం. అందుచేతనే, నేను ఈ నాట్య పోటీలో, ఊర్వశిని విజేతగా నిర్ణయించాను’ అని చెప్పాడు. విక్రమాదిత్యుడి తీర్పు వినగానే, దేవసభలోని దేవతలూ, మునులూ, మహామహులందరూ, జయజయ ధ్వానాలు చేశారు. విక్రమాదిత్యుడి మేధస్సునీ, సునిశిత ఆలోచనా పటిమనీ ప్రశంసించాడు, దేవేంద్రుడు. ఊర్వశిని విజేతగా ప్రకటించి, గొప్ప కానులిచ్చాడు. రంభనూ ఉత్సాహపరుస్తూ, తగిన విధంగా సన్మానించాడు. దేవనర్తకీమణుల మధ్య వివాదం ముగిసినందుకు, అందరూ ఎంతో ఆనందించారు.

మరిన్ని మంచి వీడియోస్ తో, మళ్ళీ మీ ముందుకు వొస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే, మన ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. అలాగే, వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చెయ్యడం మరచిపోకండి.. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను, క్రింద కామెంట్ బాక్స్ లో, తప్పక తెలియజేయండి.

No comments: