Ads

25 October, 2021

యదుకుల వినాశనానికి కారణం కృష్ణుడి కొడుకా!

  

యదుకుల వినాశనానికి కారణం కృష్ణుడి కొడుకా!

లీలామానుష రూపధారుడైన శ్రీ కృష్ణుడి జీవితం, మనందరికీ ఆదర్శం. ఎన్ని కష్టనష్టాలనోర్చినా, ఎల్లప్పుడూ చిరు మందహాసంతో మైమరపించే ఆ జగన్నాటక సూత్రధారి, కురుక్షేత్రంలో పాండవుల పక్షాన నిలచి, భూదేవికిచ్చిన మాట ప్రకారం, దుష్ట శిక్షణ గావించాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_mIMOaFqsls ​]

కానీ, కౌరవులందరూ మరణించిన తరువాత, యదువంశ నాశనానికి కారకుడయ్యాడు, స్వయానా కృష్ణుడి కొడుకు. కఠోర తపస్సుతో, పరమశివుడి అనుగ్రహంతో పొందిన తన కుమారుడే, యదువంశ నాశనానికి కారకుడయ్యాడు. కృష్ణుడి 80 మంది కుమారులలో, సాంబుడు ప్రత్యేకమైన ఘనత కలిగినవాడు. సాంబుడి జననానికి కారణమేంటి? తండ్రి అయిన కృష్ణుడి చేత ఎందుకు శపించబడ్డాడు? తన వంశ నాశనానికి ఎలా కారకుడయ్యాడు - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

జగన్నాథుడైన నారాయణుడే, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించినా, లోక ధర్మాన్ని అనుసరించి, పుత్ర సంతానం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకుని, పాశుపతదీక్షని స్వీకరించి, కేశఖండన చేయించుకుని, నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, రుద్రాక్షలు మెడలో వేసుకుని, నిశ్చలంగా శంకరుడి మీద మనస్సును లగ్నం చేసి, కఠోర దీక్ష చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక, పార్వతీ సమేతంగా శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమనగా, 'నాతో సమానుడూ, పరమ శివ భక్తుడూ అయిన నీ అంశ కలిగిన పుత్రుణ్ణి సంతానంగా అనుగ్రహించు' అని వేడుకున్నాడు. అందుకు పార్వతీ పరమేశ్వరులు, 'తథాస్తు' పలికారు.

ఆ శంకరుడి వరంతో, జాంబవతికీ, కృష్ణుడికీ కలిగిన సంతానమే సాంబుడు. పార్వతీ పరమేశ్వరుల వరం ప్రసాదం గనుక, తన కుమారుడికి సాంబుడని పేరు పెట్టాడు, శ్రీ కృష్ణుడు. ఆ పరమేశ్వరుడి పోలికలతో ఉండే సాంబుడు, గొప్ప అందగాడు మాత్రమే కాదు, తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు కూడా. సాంబుడు, దుర్యోధనుడు, భానుమతీ దంపతుల కూమార్తె అయిన లక్షణను ప్రేమించాడు. కానీ, దుర్యోధనుడికి తన కూతురుని సాంబుడికిచ్చి వివాహం చేయడం, ఇష్టం లేదు. అందుకే, లక్షణకు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ విషయం తెలుసుకున్న సాంబుడు, హస్తినాపురానికి బయలుదేరాడు.

లక్షణను తీసుకురావడం కోసం, కౌరవులతో హోరాహోరీగా యుద్ధం చేయగా, దురదృష్టవశాత్తూ, సాంబుడు వారికి బంధీ అయ్యాడు. దాంతో, బలరాముడు, మధ్యవర్తిత్వం వహించడానికి, ఉద్దాలకుడిని పంపించి, దుర్యోధనుడితో సంధి చేసుకుని, సాంబుడిని విడిపించి తీసుకురమ్మని, హస్తినకు పంపించాడు. ఉద్దాలకుడి మాటలను పెడచెవిన పెట్టి, అతనితో అవమానకరంగా ప్రవర్తించి, తరిమికొట్టారు కౌరవులు. దాంతో ఆగ్రహించిన బలరాముడు, తన నాగలితో, హస్తినాపురాన్ని పెకలించడానికి పూనుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు, బలరాముని కాళ్లు పట్టుకుని, క్షమించమని వేడుకున్నాడు. అంతేకాక, సాంబుడికి తన కుమార్తె లక్షణనిచ్చి వివాహం జరిపించాడు.

హరిహరాదుల ముగ్ధమనోహర రూపాన్ని తనలో మిళితం చేసుకున్న సాంబుడుకి, కుష్ఠు వ్యాధి సంక్రమించింది. నారదుడి మాయ వలన, తన తండ్రి శాపానికి గురయ్యాడు, సాంబుడు. ఒకనాడు నారదుడు, శ్రీ కృష్ణ దర్శనార్థం ద్వారకకు వచ్చినప్పుడు, అక్కడున్న యాదవులందరూ, ఆయనను పూజించి సత్కరించారు. కానీ, సాంబుడు మాత్రం, అతనెవరో తెలియదన్నట్లుగా, పెడమొహంగా వ్యవహరించాడు. దాంతో ఆగ్రహించిన నారదుడు, సాంబుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, ‘స్వామీ! మీ పదహారు వేల మంది గోపికలు, సాంబుడిపై మోహాన్ని కలిగి ఉన్న సంగతి, మీకు తెలుసా?’ అని  ప్రశ్నించాడు. నారదుడి మాటలకు ఆశ్చర్యపోయిన శ్రీ కృష్ణుడు, వెంటనే సాంబుడిని రమ్మని ఆదేశించాడు.

ఆ సమయంలో సాంబుడు, తన భార్యలతో కలసి, జల క్రీడలలో ఉన్నాడు. తండ్రి పంపిన కబురు అందడంతో, సరాసరి సభలోనికి బయలుదేరాడు సాంబుడు. అక్కడకు వెళ్లే సరికి, గోపికలందరూ లేచి నిలబడి, సాంబుడి రూపాన్ని అనురాగంతో చూస్తూ ఉన్నారు. నిజానికి సాంబుడు శివుని అంశ కాబట్టి, శివారాధన తత్వంతో, వారు మైమరచిపోయారు. కానీ, గోపికల చర్యను తీవ్రంగా పరిగణించిన కృష్ణుడు, సాంబుడితో, 'ఎంతటివారినైనా మొహంలో పడివేయగల నీ రూపం, ఇకపై కుష్టు రోగం పాలవుగాక' అని శపించాడు. గోపికలతో, ' మీరు ఉచ్ఛ నీచాలూ, వావివరసలూ మరచి, మీ మనస్సును వక్రమార్గం పట్టించినందుకు, మీ జీవిత చరమాంకంలో, దొంగలపాలవుదురుగాక' అని తన ఆగ్రహాన్ని వ్యక్త పరిచాడు.

అయితే, తన కుమారుడికి కుష్ఠు వ్యాధి సోకడంతో, తల్లి జాంబవతి ఎంతో దు:ఖించింది. తన శాపాన్ని వెనక్కుతీసుకోమని, శ్రీ కృష్ణుడిని పరిపరి విధాలా వేడుకుంది. దాంతో శ్రీ కృష్ణుడు జాలిపడి, చంద్రభాగా నదికి వెళ్లి, అందులో స్నానం చేసి, సూర్యనమస్కారం చేస్తే, శాప విమోచనం కలుగుతుందని, సూచించాడు. ఆ విధంగానే, సాంబుడు సూర్యుభగవానుడిని స్తుతించి, ఆయనను మెప్పించి, తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. తనకు ఆరోగ్యాన్ని ప్రసాందించిన సూర్యనారాయణుడికి, ఆ ప్రాంతంలోనే ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు. అదే నేటి మన దాయాది దేశమైన పాకిస్థాన్ లోని, ముల్తానా సూర్యదేవాలయం.

ఆ పరమశివుడి వరంగా, శ్రీహరి సంతతిగా జన్మించిన సాంబుడే, యాదవకుల నాశకుడయ్యాడు. తండ్రి మరణానికి పరోక్ష కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత, అవతార సమాప్తి సమయంలో, అసితుడూ, విశ్వామిత్రుడూ, దుర్వాసుడూ, భ్రుగువూ, అంగీరసుడూ, కశ్యపుడూ, వామదేవుడూ, వాలఖిల్యుడూ, అత్రీ, వశిష్ఠుడూ, కణ్వ మహర్షి వంటి వారందరూ, శ్రీ కృష్ణుడిని వైకుంఠానికి ఆహ్వానించడానికి వెళ్లారు. వారందరూ ఆ పరమాత్మను దర్శించి, వచ్చిన సంగతి వివరించి, తిరుగు ప్రయాణమవుతుండగా, కృష్ణుడు వారికి ఒక చిన్న పని చెప్పాడు. వారితో, 'నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి, మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళి, స్నానం చేయండి.' అని చెప్పాడు. ఆ విధంగానే, మహర్షులందరూ, నది ఒడ్డున కూర్చుని, భగవంతుని కథలు నెమరువేసుకుంటూ, ఆనందిస్తున్నారు.

అయితే, వారికి కొద్ది దూరంలో సాంబుడు, తన యాదవ స్నేహితులతో ఆడుకుంటున్నాడు. దూరంగా ఉన్న ఈ మహర్షులను చూసిన వారికి, కృష్ణుడి ప్రచోదనం చేత, ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది. సాంబుడికి ఆడపిల్లలా చీరకట్టి, పొట్ట ఎత్తుగా ఉండేలా, లోపల దుస్తులు పెట్టి, మహర్షుల దగ్గరకు తీసుకువెళ్లారు. వారి ముందు సాంబుడిని నిలబెట్టి, కడుపుతో ఉన్న ఈ మహిళకు పుట్టబోయేది అబ్బాయా, అమ్మాయా? అని ప్రశ్నించారు. దాంతో మహర్షులు సాంబుడి వంక చూసి, నిజాన్ని గ్రహించి, ‘మమ్మల్నే అవహేళన చేస్తారా?’ అంటూ ఆగ్రహించారు. 'నీకు కొడుకూ కాదు, కూతురూ కాదు. నీ కడుపు నుండి ముసలం పుడతుంది. ఆ రోకలే, మీ యదుకులాన్ని నాశనం చేస్తుంది.' అని శపించారు. దాంతో భయపడి, సాంబుడు తన చీర విప్పగా, వెంటనే తన కడుపులో నుండి, ఇనుప రోకలి కిందపడింది. దాన్ని తీసుకుని, పరుగు పరుగున కృష్ణుడిని చేరుకున్నారు.

జరిగిన విషయమంతా చెప్పారు. వెంటనే కృష్ణ పరమాత్మ, ‘దీనిని తీసుకుని, సముద్రపు ఒడ్డున ఉన్న శిఖరం మీదకు వెళ్లండి. అక్కడే దానిని అరగదీసి, సముద్రంలో కలిపివేయండి’ అని చెప్పాడు. ఆ విధంగానే, సాంబుడూ, అతని మిత్రులూ చేయగా, ఆ ఇనుప రోకలి మొత్తం, నల్లని రంగులో కరిగి, సముద్రంలో కలిసిపోయింది. ఆఖరికి సన్నని ఇనుప ములుకు మాత్రమే మిగిలిపోవడంతో, దానిని ఏమీ చేయలేక, సముద్రంలోకి విసిరేశారు. దానిని ఒక చేప మ్రింగేసింది. అక్కడకొక బోయవాడు, పక్షులు దొరక్క, చేపల కోసం వచ్చాడు. అతని వలలో పడిన చేప కడుపులో, ఇనుప ముల్లు కనబడింది. దానిని తీసుకుని, జంతువులను సంహరించడానికి, తన బాణానికి అమర్చుకున్నాడు. అలా, ఆ బోయవాడి బాణం తగిలే, శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిందని, కొంతమంది అభిప్రాయం. ఇక ఆ రోకలిని కరిగించి సముద్రంలో కలిపిన తరువాత, ఆ ఒడ్డున గడ్డి మొలిచింది. యాదవకులంలోని వారందరూ, ఆగ్రహావేశాలకు లోనై, ఒకరినొకరు, ఆ గడ్డితోనే చంపుకున్నట్లు, కొన్ని ప్రామాణికాలు తెలియజేస్తున్నాయి.

🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

No comments: