Ads

27 September, 2021

దత్తాత్రేయ వరప్రసాదుడైన కార్తవీర్యార్జునుడినీ, క్షత్రియులందరినీ పరశురాముడెందుకు వధించాడు?

  

దత్తాత్రేయ వరప్రసాదుడైన కార్తవీర్యార్జునుడినీ, క్షత్రియులందరినీ పరశురాముడెందుకు వధించాడు?

కార్తవీర్యార్జునుడు ఒక గొప్ప మహారాజు. తన భక్తితో, వినయవిధేయతలతో, అవధూత దత్తాత్రేయుడ్ని మెప్పించి, అనేక వరాలను పొందిన మహాఘనుడు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ, రాజ్యమంతటా దత్త యాగాలూ, దాన ధర్మాలతో సుభిక్షంగా పాలించిన వీరుడు. అంతటి పరాక్రమవంతుడైన కార్తవీర్యుడు, బ్రహ్మణ ద్రవ్యంపై ఆశపడి, బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టడమే కాకుండా, తన మరణానికి మార్గం వేసుకున్నాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/wq1bp6ehrnU ​]

అత్యాశతో, విచక్షణ కోల్పోయి, అధ: పాతాళానికి కూరుకుపోయాడు. అయితే, కార్తవీర్యుడు ఈ తప్పు చేయడానికి కారణం, వశిష్ఠ మహర్షి. తన మరణానికి కారణమైన ఆ సంఘటన ఏంటి? వశిష్ఠ మహర్షికీ, కార్తవీర్యుడికీ మధ్య వైరం ఏంటి? బ్రహ్మణ ద్రవ్యాన్ని ఎందుకు కోరుకోవలసి వచ్చింది - అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

హైహయ రాజవంశీయుడైన కార్తవీర్యార్జునుడు, ఒకనాడు వేటకోసం అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు, చతురంగ బలాలు కూడా బయలుదేరాయి. అడవిలోకి సైన్యసమేతంగా ప్రవేశించిన కార్తవీర్యుడు, అక్కడున్న క్రూరమృగాలను వేటాడడం ప్రారంభించాడు. సింహాలూ, ఖడ్గమృగాలూ, పులులూ, లేళ్ళూ, ఆయన బాణాల ధాటికి, నేలకొరిగిపోయాయి. ఆవిధంగా, చాలా కాలం వారి వేట కొనసాగింది. ఒకనాటి మధ్యాహ్నం, వేటాడి వేటాడి, కార్తవీర్యుడూ, అతని సైన్యం, అలసిపోయారు. వారికి విపరీతంగా ఆకలి, దాహం వేశాయి. సమీపంలో ఎక్కడా, కనీసం నీరు కూడా దొరకలేదు.

అలా తిరుగుతూ వుండగా, వారికి నర్మదానదీ తీరంలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. కార్తవీర్యుడు ఆ ఆశ్రమాన్ని చూసి, తన పరివారాన్నీ, సైన్యాన్నీ అక్కడే వుంచి, కొంతమంది పురోహితులతో కలిసి, ఆ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సాక్షాత్తూ దేశచక్రవర్తి తన ఆశ్రమానికి అతిథిగా రావడంతో సంతోషించిన జమదగ్ని, కార్తవీర్యుడికి తగిన అతిథి మర్యాదలు చేసి, గౌరవించాడు. కొంతసేపటి తరువాత జమదగ్ని, కార్తవీర్యుణ్ణి భోజనం స్వీకరించడానికి సిద్ధం కమ్మని చెప్పాడు. అందుకు కార్తవీర్యుడు, ‘స్వామీ! వనంలో దొరకినవి తిని జీవించే మీరు, మాకు ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టం. మాకు అనుమతినిప్పించండి. మా నగరానికి వెళతాము. అదీగాక, దూరంగా, అపారమైన నా సైన్యం కూడా వుంది. మీకెందుకు శ్రమ?’ అని పలికాడు.

మహారాజు మాటలు విన్న జమదగ్ని, "రాజా.. మీకు ఆతిథ్యం ఇవ్వడంలో, నాకెటువంటి శ్రమా లేదు. కేవలం మీకే కాదు.. మీ సైన్యానికంతటికీ ఆహారాన్ని అందిస్తాను. వారిని కూడా పిలవండి’ అని చెప్పాడు. కార్తవీర్యుడు ఆ మాటలు విని ఆశ్యర్యపోయాడు. అంతమందికి ఆహారం ఎలా పెడతాడా? అని సందేహపడ్డాడు. అంతలో జమదగ్ని, లోపలున్న కామధేనువుని వీరి ముందుకు తీసుకువచ్చాడు. ఆ ధేనువుతో, ‘వీరందరూ మన అతిథులు. వీరికి తగిన స్థాయిలో ఆతిథ్యాన్ని అందించు’ అని కోరాడు. దాంతో, ఒక్కసారిగా కామధేనువు సంకల్పంతో, ఆ ఆశ్రమం ఇంద్రనగరంలా మారిపోయింది. ఎటుచూసినా చక్కని నందనోద్యానవనాలూ, అందమైన భవనాలతో, వైభవంగా దర్శనమిచ్చింది.

కార్తవీర్యుడు ఆ దృశ్యాన్ని చూసి, అబ్బురపడ్డాడు. జమదగ్ని, రాజుకీ, అతడి పరివారానికీ, షడ్రసోపేతమైన విందుభోజనాన్ని అందించాడు. హాయిగా విందారగించిన అందరూ, ఆ దివ్య నగరంలో వున్న భవనాలలో విశ్రాంతి పొందారు. తరువాతి రోజు సూర్యోదయ సమయానికి, వందిమాగదులు తమ సుప్రభాత స్తోత్రాలతో, కార్తవీర్యుణ్ణి మేల్కొలిపారు. నిద్రలేచిన రాజూ, అతడి పరివారమంతా, కాలకృత్యాలు తీర్చుకుని, జమదగ్ని దగ్గర వీడ్కోలు పుచ్చుకుని, తమ రాజ్యానికి బయలుదేరారు. కొంతదూరం వచ్చేసరికి, కార్తవీర్యుడి మదిలో ఒక దుష్ట ఆలోచన బయలుదేరింది. ‘నాకు ఎంతరాజ్యం, ఎంత సంపదలుండి ఏం లాభం? ఆ జమదగ్ని మహర్షి దగ్గరున్న కామధేనువుకి, ఇవన్నీ ఏ మాత్రం సరిపోవు. ఎలాగైనా ఆ ధేనువును నా రాజ్యానికి తీసుకెళ్ళాలి’ అని ఆలోచించసాగాడు. అతడి ఆలోచనకు ప్రోత్సాహం అందించారు, అతడి మంత్రులు. అయితే, కామధేనువు బ్రాహ్మణ ద్రవ్యం కదా! దాన్ని పరిగ్రహించడం పాపకర్మ అవుతుందేమో! అని కార్తవీర్యుడు సందేహించాడు.

రాజపురోహితుడు, రాజు ఆంతర్యం గ్రహించి, తప్పు అని, వారించే ప్రయత్నం చేశాడు. అయితే, దుష్టుడైన మంత్రి, కార్తవీర్యుణ్ణి ప్రలోభపెట్టడంతో, సహజంగానే ధేనువు మీద ఆసక్తి పెంచుకున్న కార్తవీర్యుడు, దానిని తీసుకురమ్మని మంత్రిని పంపించాడు. జమదగ్ని ఆశ్రమానికి సైన్యసమేతంగా వెళ్ళాడు మంత్రి. ఆ మహర్షితో, కామధేనువుని మహారాజు కోరుకున్నారు. దాన్ని తమరి దగ్గరినుంచి తీసుకురమ్మన్నారని, విన్నవించాడు. జమదగ్ని అతడి మాటలు విని, ‘మంత్రివర్యా! ఇది నా కామధేనువు. హోమధేనువు కూడా. దీని వల్లే, నేను నా నిత్యకర్మానుష్ఠానాలను నెరవేర్చుకోగలుగుతున్నాను. కనుక దీనిని కోరడం సరికాదు. దయచేసి వెళ్ళండి’ అని అన్నాడు. మంత్రి ఆగ్రహంతో, ‘మహర్షీ! తమరు మనస్సు మార్చుకుని, ధేనువుని ఇస్తే సరి.. లేదంటే, బలాత్కారంగానైనా తీసుకువెళతాం. ఇది రాజాజ్ఞ’ అని పలికాడు. ‘మీరు ఏం చేసినా సరే.. ధేనువుని ఇవ్వను. మీరే ధర్మం తప్పి, విప్రద్రవ్యాన్ని తీసుకువెళతానంటే, చేసేదేముంది. ఆ పాపఫలితం మీరే అనుభవిస్తారు’ అన్నాడు జమదగ్ని.

పాప మనస్కుడైన మంత్రి, ఆవేశం ఆపుకోలేక, ఆశ్రమ ప్రాంగణంలోని కామధేనువుని, బలవంతంగా తోలుకెళ్ళాలని ప్రయత్నించాడు. జమదగ్ని కోపంతో, అతడికి అడ్డుపడ్డాడు. గోవును అపహరించడం మహాపాపం అన్నాడు. అయినా, ఆ మంత్రికి ఆయన మాటలు చెవికెక్కలేదు. దయారహితంగా, తన సైనికులతో జమదగ్ని మహర్షిని పక్కకి లాగించేశాడు. ఆయన తిరిగి అడ్డుపడబోతే, కర్రలతో ఆయనను అతి ఘోరంగా బాదించాడు. చేసేదేమీలేక, జమదగ్ని అక్కడే కూలబడిపోయాడు. అంతచేసినా, జమదగ్ని వారి మీద కోపం పెంచుకోలేదు. శాంతంగా ఉండిపోయాడు. క్రమంగా దెబ్బల బాధకి, ఆయన ప్రాణం పోయింది. మహాతేజస్వి అయిన జమదగ్ని, దెబ్బలబాధతో నేలకొరిగిపోవడం చూసి, మంత్రి మరింత రెచ్చిపోయాడు. వెంటనే ఆ కామధేనువుని ఈడ్చుకు రండి.. అని ఆజ్ఞాపించాడు.

పరివారం వెళ్ళి, ఆ కామధేనువుని అక్కడి నుంచి తరలించబోయారు. అంతే, ఒక్కసారి ఆ కామధేనువు ఒళ్ళు విరుచుకుంది, కోపంతో కళ్ళెర్ర చేసి, బుసలు కొట్టింది. తన కొమ్ములతో, గిట్టలతో, బంధించడానికి వచ్చిన సైన్యాన్నంతా, ఛిన్నాభిన్నం చేసింది. ఎంతమంది ప్రయత్నించినా, ఆ ధేనువుని ఎవరూ తాకలేకపోయారు. అలా వారందరినీ తప్పించుకున్న కామధేనువు, ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి, అదృశ్యమయ్యింది. ధేనువు చేత పరాభవించబడి, గాయాల పాలైన సైనికులు, చేసేదేమీ లేక, అక్కడేవున్న కామధేనువు దూడ నందినిని తీసుకెళ్ళి, కార్తవీర్యుడికి అప్పగించారు. జరిగిన తతంగమంతా, ఆయనకి వివరించారు. తన పరివారం చేసిన దురాగతం వల్ల, ఒక మహాతపస్వి మరణించాడని తెలుసుకుని, కార్తవీర్యుడు ఎంతో బాధపడ్డాడు. ‘అయ్యో! నేనెంత ఘోరం చేశాను. బ్రాహ్మణ ద్రవ్యం కోసం ఆశపడి, ఎంతో పాపకార్యాన్ని ఆచరించాను. నా పాపానికిక నిష్కుృతి ఏది? అని చింతిస్తూ, నగరానికి బయలుదేరాడు.

నీళ్ళకోసం వెళ్ళిన రేణుకా దేవి, ఆశ్రమానికి వచ్చింది. అంతాచిందరవందరగా కనిపించింది. లోపలికి వచ్చి చూడగానే, రక్తపు మడుగులో జమదగ్ని మహర్షి నిర్జీవంగా పడివున్నాడు. అది చూసి, ఆమె ఆర్తనాదాలు చేసింది. అంతలో, సమిధల కోసం అడవికి వెళ్ళిన భార్గవరాముడు, అప్పుడే తిరిగివచ్చాడు. తల్లి దారుణంగా రోదిస్తోంది. లోపలికి వచ్చి చూశాడు. తండ్రి విగతజీవుడై కనిపించాడు. ఆయనకి కూడా శోకం ముంచుకు వచ్చింది. కాస్త తమాయించుకుని, తల్లిని ఓదార్చాడు. కానీ, కొద్దిసేపటికి దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. రేణుకాదేవి అలా శోకిస్తూ, 21 సార్లు తన కడుపుమీద బాదుకుంది. భార్గవరాముడు ఆగ్రహం నిండిన స్వరంతో, ‘తల్లీ! నీ భర్త, నా తండ్రి అయిన జమదగ్ని మహర్షిని చంపినవాడిని వదిలిపెట్టను. వాడితో సహా, సమస్త క్షత్రియ లోకాన్నీ, 21 సార్లు భూమండలమంతా పర్యటించి, వధిస్తాను. క్షత్రియుడన్నవాడు ఈ భూమ్మీదే లేకుండా చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ’ అని అన్నాడు. భార్గవరాముడి మాటలు విని, కొంత ఊరట చెందింది రేణుకాదేవి. వెంటనే తన కుమా రులందరినీ పిలిచి, అందరితో.. ‘నాయనా! పతిలేని జీవితం వ్యర్థం. నేను కూడా నా భర్తతో సహగమనం చేస్తాను. దయచేసి మీరెవ్వరూ నాకు అడ్డుచెప్పద్దు’ అని సహగమనానికి సిద్ధమయ్యింది.

అంతలో ఆకాశవాణి, ‘దేవీ రేణుకా! నీవు సహగమనం చేయవద్దు. దు:ఖాన్ని వదిలిపెట్టు. అచిరకాలంలోనే నీభర్త తిరిగి జీవిస్తాడు’ అని పలికింది. ఆ మాటలు విన్న రేణుకామాత ధైర్యాన్ని పొంది, సహగమనాన్ని విరమించింది. అందరూ కలిసి, జమదగ్ని శరీరాన్ని ఒకచోట భద్రంగా ఉంచారు. అదే సమయంలో, అధర్వణవేద పండితుడూ, మహామంత్రవేత్తా అయిన ఒక ముని, అక్కడికి వచ్చాడు. ఆయనకు మ‌ృత సంజీవనీ విద్య తెలుసు. ఇది అందరు మహర్షులకూ తెలియదు. ఆయన జరిగినదంతా విని, వెంటనే సంజీవనీ విద్యని ప్రయోగించి, జమదగ్ని మీద నీళ్ళు చిలకరించాడు. ‘నేను చేసిన యజ్ఞం, తపస్సూ ఫలవంతమైతే, ఈ మహర్షి వెంటనే జీవం పొందుగాక’ అని అన్నాడు. అంతే.. నిద్ర నుంచి లేచినట్టుగా, జమదగ్ని పైకిలేచాడు. అది చూసి అందరూ ఎంతో సంతోషించారు. జమదగ్ని, తనకు ప్రాణభిక్ష పెట్టిన ఆ రుషిని సముచిత రీతిలో గౌరవించి, ఎన్నో సపర్యలు చేశాడు. ఆయనతో, ‘స్వామీ! నేను ఏ తప్పూ చేయలేదు. ఆ రాజునీ, అతడి పరివారాన్నీ ఆదరించి, ఆతిథ్యమిచ్చినందుకు, నాకీ కష్టం కలిగించారు. దీనికి కారణం ఏమిటి?’ అని అడిగాడు.

‘మహర్షీ! కార్తవీర్యుడు దత్తాత్రేయవరప్రసాదుడూ, మహాభక్తుడు. అయితే, వరబలంతో ఒకనాడు, వశిష్ఠ మహర్షిని అవమానించాడు. అందుకాయన, రాబోయే కాలంలో, ఒక మహర్షి మరణానికి కారకుడవై, నీవూ, నీతో సహా, గర్వమదాంధులైన క్షత్రియులందరూ మరణిస్తారు’ అని శపించాడు. ఆయన శాపం, జరిగి తీరుతుంది. అందుకే, కార్తవీర్యుడు నీ మరణానికి కారకుడయ్యాడు. అది చూసి, నీ పుత్రుడు భార్గవరాముడు, క్షత్రియలోకాన్ని, భూమండలం మీద లేకుండా చేస్తానని, ప్రతిజ్ఞ చేశాడు. ఇదీ, జరిగిన విషయం. ఇదంతా దైవ నిర్ణయం. మనమంతా నిమిత్త మాత్రులం మాత్రమే’ అని చెప్పి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు, ఆ రుషి. తరువాత భార్గవరాముడు తండ్రిని సమీపించి, ‘కార్తవీర్యుణ్ణి వధించడానికి బయలుదేరుతున్నాను. అనుమతివ్వండి’ అని ప్రార్థించాడు. అందుకు జమదగ్ని మనస్సు నిరాకరించినా, రుషి మాటలు గుర్తుకువచ్చి, సరేనన్నాడు. భార్గవరాముడు, ఈశ్వరుడి అనుగ్రహంతో సంపాదించుకున్న అస్త్రశస్త్రాలతో పాటు, త్రైలోక్య విజయమనే శివ కవచాన్నీ, శ్రీ కృష్ణుడి దివ్య మంత్రకవచాన్నీ ధరించి, పరమ పవిత్రమైన పుష్కరతీర్థానికి చేరుకున్నాడు. అస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుని, కార్తవీర్యుణ్ణీ, అతడి సైన్యాన్నీ, ఘోరంగా సంహరించాడు.

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

No comments: