'నాన్నగారికి మందులు తీసుకురావాలి.. ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా?'
తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడాయన!
ఈ మాటలన్నది సాదా సీదా వ్యక్తి అయితే, పెద్దగా ఆశర్యపోనక్కరలేదు!
ఐదు రూపాయలు చేబదులడిగిన వ్యక్తి, టంగుటూరి ప్రకాశం గారి రెండవ కుమారుడు హనుమంతరావు గారు!
అప్పు అడిగింది, తుర్లపాటి కుటుంబరావు గారిని!
సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి, కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత, ఎవరికైనా కంట తడి రాక మానదు!
ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి చివరి రోజుల్లో, ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి, ఈ ఐదు రూపాయలు!
చెన్నైలో, క్షణం తీరికలేని పనులు ముగించుకుని, నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి, ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు, వారి నివాసానికి చేరుకున్నారు!
లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు, తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి, గద్గద స్వరంతో 'నాన్న గారికి మందులు తీసుకురావాలి.. ఓ ఐదు రూపాయలు సర్దుతారా..' అనంటంతో, షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు!
వెంటనే తేరుకుని, ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ, జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి, ఆయన చేతిలో పెట్టాడు!
ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో, కళ్ళకు కట్టినట్టు వివరించారు!
దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి, చివరి రోజుల్లో కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను, నేటి భారతంలో ఆశించగలమా?
ముఖ్యమంత్రి పదవి అంటే, తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని, తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో, దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని, రూపాయి లేనటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా? అంటే, చూడలేమనే సమాధానం వస్తుంది!
ఆ తరం వేరు, నేటి తరం వేరు!
ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి అరాచకీయాలు వేరు!
డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా, సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి!
దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే, 'టంగుటూరి' నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యారు!
'టంగుటూరి ప్రకాశం పంతులు' గారి జయంతి సందర్భంగా, ఆ మహానుభావుడికి నివాళులు!
Tanguturi Prakasam Pantulu (23 August 1872 – 20 May 1957)
Link: https://www.youtube.com/post/UgweyLU2NNbxmdbotEx4AaABCQ
No comments:
Post a Comment