Ads

01 August, 2021

జీవన మాధుర్యం - ఒక మంచి కథ! Jivana Mathuryam

 

జీవన మాధుర్యం - ఒక మంచి కథ!

తెల్లవారింది.. నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది.. లేచి చేసేది ఏముందని, అలాగే పడుకుని ఉన్నాను. మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి.. కానీ, బద్దకంగా అనిపించింది..

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = https://youtu.be/JFLTERF-L2w ]

మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన చనిపోయి రెండేళ్లు అయింది. కొడుకు, కూతురు, అమెరికాలో స్థిర పడి పోయారు. నన్నూ అక్కడకు వచ్చేయమంటారు. కానీ, నాకే ఇష్టం లేదు..

ఆయన పోయాక నాకు జీవితం మీద ఆసక్తి పోయింది. నిరాశ, నిస్పృహలతో, కాలం గడుపుతున్నాను. కాఫీ తాగాలి అనిపించింది. కానీ, ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడంవల్ల, డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను. కాఫీ త్రాగడం ఎప్పటి అలవాటో! చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను..

బ్రష్ చేసుకుని వాకింగ్ కి బయలు దేరాను. కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది. వయసు పాతిక ఉంటుంది. అందంగా, ఆరోగ్యంగా, అంతకు మించి చలాకీగా ఉంది..

నన్ను చూడగానే, 'గుడ్ మానింగ్ ఆంటీ!' అని విష్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో గుర్తుకు రాలేదు. ఇంటికి వెళ్ళాక కూడా, ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. కానీ గుర్తు రాలేదు.

మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా, అదే చిరు నవ్వుతో విష్ చేసింది. అలా వారం గడిచింది. ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు 'సారీ అమ్మా! నిన్ను గుర్తు పట్టలేక పోయాను!' అన్నాను.

ఆ యువతి చిన్నగా నవ్వి, 'మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ! మీరు నన్ను గుర్తు పట్టడానికి?' అన్నది.. నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను. అప్పుడా అమ్మాయి, 'విష్ చేయడానికి పరిచయం ఎందుకు?' అన్నది..

తన మాటకు నేను నవ్వేశాను. నేను నవ్వి చాలా కాలం అయింది. ఆ విషయం మనస్సు గుర్తు చేసింది..

'నీ పేరు?' అని అడిగాను. 'మాధురి. మరి మీ పేరు?' అని అడిగింది. 'వేదవతి' అని చెప్పాను. మాధురి నన్ను దాటిపోతూ వెనక్కి తిరిగి, 'ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది' అన్నది. నాకు మావారు గుర్తుకు వచ్చారు. ఆయన కూడా అదే మాట అనేవారు. గుండెలో సంతోషం పొంగింది.

మధ్య మధ్యలో నాకు మాధురి ఉత్సాహం, సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి. ఉత్తేజంగా అనిపించేది..

ఒక రోజు, 'ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం, అన్నాను. మాధురి సరేనంది. ఇద్దరం అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము..

'నీకు పెళ్లి అయిందా?' అని అడిగాను. 'అయింది.. ఒక బాబు, పాప' అంది మాధురి. మాటల్లో మావారు పోయిన విషయం, మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను. మావారు పోయినందుకు సంతాపం తెలియ బరిచింది. కొద్ది క్షణాల తరువాత, 'ఇప్పుడు ఇంటికి

వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?' అని అడిగింది మాధురి. 'బ్రెడ్' అని చెప్పాను. 'ప్రతి రోజూ అదేనా?' అని అడిగింది మాధురి. 'ఒక్కదాన్నేగా!అందుకే!' అన్నాను. 'ఒక్కరు కాబట్టే, మంచి ఆహారం తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీరే కాపాడు కోవాలి' అంది మాధురి. కొంచెం సేపు ఆగి

తనే 'మీవారూ.. పిల్లలూ ఉన్నప్పుడు, వాళ్లకు ఇష్టమయినవి చేసి పెట్టి ఉంటారు. ఇప్పుడు మీకు ఇష్టమైనవి చేసుకు తినండి' అన్నది. ఆ తరువాత మేం అక్కడినుంచి బయలుదేరాము.

ఇంటికి వెళ్ళిన తరువాత కూడా, మాధురి మాటలు తలపుకు వచ్చాయి. అందులోని వాస్తవం గుర్తించాను. చాలా కాలం తరువాత, నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను. ఎందుకో మనస్సుకు తృప్తిగా అనిపించింది.

మరుసటి రోజు కలిసినప్పుడు, మాధురికి జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను. ఎంతో సంతోషించింది. 'మంచి పని చేశారు' అని అభినందించింది. మాటల్లో, జీవితం నిరాసక్తతగా ఉన్నట్లు చెప్పాను. మాధురి మౌనం వహించింది.

నెల తరువాత ఒక రోజు, 'వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా!' అని ఆహ్వానించాను. మాధురి 'వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను' అని నా సెల్ నంబర్ తీసుకుంది. మా వారు పోయాక నేను మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి మాధురి.

సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు, మాధురి ఫోన్ చేసింది. నాకు సంతోషం అనిపించింది. తనకోసం కాఫీ చేసి, ఫ్లాస్క్ లో పోసి ఉంచాను. చెప్పినట్లు, సరిగ్గా నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది. వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ తెచ్చింది. 'ఎందుకిది' అని అడిగాను. 'రోజూ దీనికి నీళ్లు పోస్తూ, పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!' అంది. మాధురి సోఫాలో కూర్చుంది. కాఫీ అందించాను. 'మీరు తీసుకోరా?' అని అడిగింది. 'డయాబెటీస్.. అందుకే ఇష్టమైనా, తీసుకోవడం లేదు' అన్నాను.

తను కిచెన్ లోకి వెళ్లి, ఒక కాఫీ కప్పు తెచ్చి, అందులో కొద్దిగా కాఫీ పోసి, నాకు అందిస్తూ.. 'జబ్బు కంటే భయమే, శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఏం కాదు. హ్యాపీగా త్రాగండి' అంది. నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను. చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది. అప్పుడు మాధురి, 'చిక్కటి పాలలో కాఫీ పౌడర్ కలుపుకు త్రాగినా, రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకు కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి' అన్నది.

కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక, 'ఇల్లు చూద్దువు గాని రా!' అని మాధురిని లోనికి తీసుకు వెళ్ళాను. తను పూజా మందిరం చూసి, 'రోజూ పూజ చేయడం లేదా?' అని అడిగింది. 'లేదు' అన్నాను. తను రెండు అగరొత్తులు తీసి వెలిగించింది. క్షణంలో గది పరిమళ భరితం అయింది. అప్పుడు మాధురి, 'పూజ చేసినప్పుడు మన మనస్సూ ఇలా పరిమళ భరితం అవుతుంది' అన్నది. 'ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా, ఎంతో బాగుంటుంది' అని మనస్సులో అనుకున్నాను.

మాధురి బయలు దేరినప్పుడు, 'గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు, చిన్నప్పుడు మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!' అన్నది. 'అలానే' అన్నాను. గదిలో అలుముకున్న అగరొత్తుల పరిమళం, మాధురి వెళ్ళిపోయినా, ఆమెను గుర్తుజేస్తూనే ఉంది..

మరునాటి ఉదయం, రోజూలా నిస్పృహతో లేవలేదు.. కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను. కాఫీ చక్కెర లేకుండా త్రాగాను. మాధురి చెప్పినట్లు, మైండ్ సెట్ మార్చుకుని త్రాగితే బాగుందనిపించింది. చాలా కాలం తరువాత, ప్రభాత సమయంలో ఉత్సాహంగా అనిపించింది..

వాకింగ్ సమయంలో, అదే విషయం మాధురికి చెప్పాను. సంతోషం వ్యక్తం చేసింది..

మాధురి ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను. క్రమేపీ దానితో అనుబంధం పెరిగింది. ప్రతి రోజూ దాన్ని శ్రద్ధగా పరిశీలించ సాగాను. మొగ్గ తొడగడం.. పువ్వు విచ్చడం.. పరిమళం.. అద్భుతం అనిపించసాగింది. మావారు ఉన్నప్పుడు పూల కుండీలు

ఉండేవి గానీ.. వాటి పోషణను ఆయనే చూసుకునేవారు. ఇప్పుడు ఇది నాకు సరి కొత్త అనుభవం.

మధ్య మధ్యలో మాధురి తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ, నా ఆనందం పంచుకుంది.

ఈమధ్య మాధురి నాతో పాటే వాకింగ్ చేయసాగింది. ఒకరోజు వాకింగ్ మధ్యలో.. 'మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి, ఎలా ఉందో నాకు చెప్పండి' అంది. 'ఏమిటది?' అని ఆసక్తిగా అడిగాను. రెండు చిన్న బౌల్స్ తీసుకుని, ఒకదానిలో బియ్యం గింజలూ, ఒకదానిలో నీరూ పోసి, మీ పిట్ట గోడ మీద పెట్టండి' అన్నది. తన భావం గ్రహించి 'సరే' అన్నాను.

అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ.. దప్పికగొన్న పక్షులు నీరు తాగుతుంటే, ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది. ఉదయం తాగుతున్న కాఫీ.. పూజ.. అగరొత్తుల పరిమళం.. పూస్తున్న గులాబీలు.. గింజలు తింటున్న పిట్టలు.. నీరు తాగుతున్న పక్షులు.. ఇవి చిన్న చిన్న మార్పులే గానీ, నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి. ఒకప్పుడు నిరాశ, నిస్పృహలతో, నిరుత్సాహంగా గడిపిన నేను, ఇప్పుడు ఉత్సాహంగా.. సంతోషంగా ఉంటున్నాను. నాలోని మార్పుకు మాధురే కారణం..

ఒకరోజు సాయంత్రం, మాధురి స్కూటీ మీద వచ్చింది. తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది. వీళ్ళు మా పని మనిషి పిల్లలు.. బాగా చదువుతారు. కానీ, వీళ్ళమ్మ వీళ్ళను చదివించలేక పోతున్నది. అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే, ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి' అన్నది. నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను. వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది. పిల్లలు నన్ను అడిగి, జామ చెట్టు దగ్గరకు వెళ్ళి, జామ కాయలు కోసుకున్నారు. మాధురి నాతో, 'మీ హాబీస్ ఏమిటి?' అని అడిగింది. 'ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని' అని చెప్పాను. 'వావ్' అని మాధురి నన్ను కౌగిలించుకుంది. 'ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి. నా కోసం ఒకటి డ్రా చేయండి' అని చిన్న పిల్లలా మారాం చేసింది. 'వాటి జోలికి వెళ్లి చాలా కాలం అయింది. వేయగలనో లేదో!' అన్నాను. 'తప్పక వేయగలరు!' అంది మాధురి.

అనడమే కాదు.. ఆ సాయంత్రం, నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్, పెన్సిల్స్, వాటర్ కలర్స్ తెచ్చి ఇచ్చింది. దాన్ని బట్టి, తనకు పెయింటింగ్స్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

ఆలోచించి, రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను. మొదట కొంచెం తడబడినా, త్వరగానే దారిలోకి వచ్చాను. పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది. ఆ విషయం మాధురికి చెప్పాను.

ఆ సాయంత్రమే, పరుగున నా దగ్గరకు వచ్చేసింది. పెయింటింగ్ చుడగానే, 'ఎక్సలెంట్ ఆంటీ!' అని నన్ను కౌగిలించుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టింది. నాకు సంతోషం, సిగ్గూ, రెండూ కలిగాయి. 'పెయింటింగ్ మీద మీ సైన్ చేసి, నాకు గిఫ్ట్ గా ఇవ్వండి' అని కోరింది. అలానే చేశాను.

ఆ రాత్రి, అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. 'ఎప్పుడూ మేం చేయడమే గానీ, నువ్వు చేసింది లేదు. ఫస్ట్ టైం నువ్వే చేశావు' అని ఆశ్చర్య పోయింది. క్లుప్తంగా మాధురి గురించి చెప్పాను. 'నీ లైఫ్ స్టైల్ మార్చింది. నా అభినందనలు తెలియ జేయి' అన్నది.

కొద్ది రోజులకు, మాధురి తన ఇంటికి ఆహ్వానించింది. తనే వచ్చి, స్కూటీ మీద తీసుకు వెళ్ళింది. ఇంటికి వెళ్లగానే, నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ అందమైన ఫ్రేమ్ లో కనిపించి కనువిందుజేసింది. నాకు మనస్సులో గర్వంగా అనిపించింది. మాధురి నాకు వాళ్ళ అత్త మామ గార్లను పరిచయం చేసింది. నేను సోఫాలో కూర్చున్నాను. మాధురి కాఫీ తేవడానికి లోనికి వెళ్ళింది. మాధురి అత్తగారు నాతో మాట్లాడుతూ, 'మా కోడలు దేవతమ్మా! మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది.' అన్నది. అంతలో మాధురి కొడుకూ, కూతురూ మా దగ్గరకు వచ్చారు. వాళ్లకోసం నేను తెచ్చిన బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు అక్కడినుంచి వెళ్లి పోయారు.

అప్పుడు మాధురి అత్తగారు, 'ఈ బాబే మాధురి కొడుకు. ఆ పాప అనాధ. మాధురి దత్తత తీసుకుని పెంచుకుంటున్నది. అంతే కాదు..

ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేమంటే? 'మన పిల్లలను మనం పెంచడం, ప్రేమించడం, గొప్ప కాదు. అనాధకు చేయూత నీయడం గొప్ప' అంటుంది. మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు.. అని చెప్పింది. అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. మాధురికి అంత చిన్న వయస్సులోనే ఎంత పరిపక్వత! అనుకున్నాను. కాఫీ తెస్తున్న మాధురిలో నాకు దేవతా మూర్తి గోచరించింది.

'మాధురి' అత్తగారితో, 'మొత్తం చెప్పేశారా? చెప్పనిదే ఊరుకోరు కదా!' అంది నవ్వుతూ. నేను సింపుల్ గా.. 'అభినందనలు మాధురీ!' అన్నాను.

ఇల్లు చేరానే గానీ, ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మాధురిని చూశాక, 'జీవన మాధుర్యం' బోధ పడింది. ఈరోజు తను చేసిన పని తెలిశాక, నా జీవిత గమ్యం బోధ పడింది. నా దగ్గర బాగానే డబ్బు ఉంది. నా డబ్బు మా పిల్లలు ఆశించరు. ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి, ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

కొద్ది కాలానికి, మా వారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను. దానికి సెక్రటరీగా, మాధురిని నియమించాను. ఇప్పుడు నాకు జీవితం నిరాశగా, నిస్పృహగా అనిపించడం లేదు. సంతోషంగా, ఉత్సాహంగా అనిపిస్తున్నది. ఒకప్పుడు సమయం గడవని నాకు, ఇప్పుడు సమయం చాలడం లేదు.. వయస్సులో చిన్నదే అయినా,  మాధురికి నా మనస్సులో గురువు స్థానం ఇచ్చాను!

మానవ సేవే, మాధవ సేవ!

Link: https://www.youtube.com/post/Ugw_f4PlVhpId9_zn2x4AaABCQ

No comments: