Ads

09 July, 2021

దుఃఖం!

  


దుఃఖం!

మానవ జీవితం అంతా, దోష భూయిష్టం, దుఃఖ భూయిష్టం. అప్పుడప్పుడూ కొన్ని సుఖాలున్నా, దుఃఖాలు మాత్రం తప్పవు. ఇలా దుఃఖాలతో కూడినదే, ఈ మానవ జన్మ అని తెలిస్తే, దీనిపై వైరాగ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మలు వద్దు అనిపిస్తుంది. జన్మ రాహిత్యానికి ప్రయత్నించాలనిపిస్తుంది. కనుక, ఈ జన్మలోని దుఃఖ దోషాలను నిశితంగా పరిశీలించాలి.

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]
          
‘ప్రపంచం దుఃఖమయం, దేహం రోగమయం’ అని పెద్దలు చెబుతారు. ‘అనిత్యమసుఖం లోకం’ అని గీతాచార్యుడే అన్నాడు. ‘విద్ధి వ్యాద్యభి మానగ్రస్తం, లోకం శోక హతం చ సమస్తం’ అని భజగోవిందంలో, శంకరాచార్యులవారన్నారు. 'వ్యాధులతోనూ, అభిమానంతోనూ కూడి, దుఃఖాల చేత సతమతమైపోతున్నది ఈ జన్మ' అని.. పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడూ ఏడుస్తాడు. మధ్యలో రోగాలొస్తే ఏడుస్తాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తాడు. ఇవే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం..

జన్మ దుఃఖం!

ఇది ఎలాంటిదో, గర్భోపనిషత్ చెబుతున్నది. తలచుకుంటే, సిగ్గుతో చచ్చిపోవాలి. సిగ్గో, యెగ్గో, అది బహిరంగ రహస్యం. కోడి గ్రుడ్డంత గర్భకోశంలో, 9 నెలల నివాసం.. అక్కడి క్రిముల చేత పీడించబడటం, జఠరాగ్ని చేత తపించి పోవటం, తల్లి ఆహార విహారాల వల్ల అలమటించి పోవటం, మావి చేత బిగించబడి, తల్లక్రిందులుగా ఉండటం, పూర్వ జన్మల స్మృతితో, విపరీతంగా దుఃఖించటం, ప్రసూతి వాయువుల చేత త్రోయబడటం, బయటపడి, మల మూత్రాలలో పెద్ద పురుగులాగా పొర్లాడటం.. ఇవన్నీ జన్మ దుఃఖాలే..

మృత్యు దుఃఖం!

పుట్టిన ప్రతి జీవీ తప్పించుకోలేని దుఃఖం, ఈ మృత్యుదుఃఖం. ఈ దేహం మృత్యు దేవత సొత్తు. పాలు, వెన్న, నెయ్యి, జీడి పప్పు, మిఠాయి, ఖారాలతో చక్కగా పెంచి, ఫారిన్ సెంట్లు, పౌడర్లు, సోపులు, కాస్మెటిక్స్ తో పోషించిన ఈ బంగారం లాంటి శరీరానికి, చివరి దశ ఏమిటో, కళ్ళు మూసుకుని ఒక్కసారి భావనకు తెచ్చుకోండి. మర్మస్థానాలు భేదించ బడటం, అంగ సంధులు వికలమై పోవటం, నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటకు రావటం, ప్రాణోత్క్రమణ జరిగేటప్పుడు, లక్ష తేళ్ళు ఒక్కసారిగా కుడితే కలిగేంత బాధ, శరీరం వశం తప్పి, మల మూత్రాలు విడిచి పెట్టటం, భరించలేని యాతన, ఇవి.. మృత్యురోగాలు.. ఇంతేనా! ఇక మరణించ బోతున్నాను అని తెలియగానే, అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, కట్టాలనుకున్న మేడలూ, భార్యాబిడ్డలూ, అంతా గుర్తుకు వస్తారు. ఇంత సంపాదించి, అన్నీ వదిలిపెట్టి పోతున్నానే అనే బాధ.. ఇదంతా మృత్యు బాధ..

ధర్మో రక్షతి రక్షితః!

No comments: