రేపు 24/06/2021 'ఏరువాక పౌర్ణమి' పండుగ విశిష్ఠత!
'ఏరువాకా సాగారో రన్నో చిన్ననా.. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా..' ఈ పాట తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు.. కానీ, ఈ పాటలో 'ఏరువాక' అనే పదానికి అర్ధం చాల మందికి తెలియకపోవచ్చు.. 'ఏరు' అంటే, ఎద్దులను కట్టి, దుక్కి దున్నుటానికి సిద్దపరచిన నాగలి.. 'ఏరువాక' అంటే, దుక్కి దున్నటం ప్రారంభం. అంటే, వ్యవసాయ ప్రారంభం. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా! మన కష్టాలు తీరేది. ఎందుకంటే, మనది వ్యవసాయ ప్రధానదేశం. అందుకే, మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు, ఇక్కడి రైతాంగం.
[ కొత్త జీవితం! = https://youtu.be/VA4Ieaa6wbE ]
దేశాన్ని సస్యశ్యామలంజేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి, భూమాత. అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కి దున్నడం, రైతన్నకి బాధాకరమైన విషయమే అయినా, బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా..! అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు, భూపూజ చేసి, ఆ తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండుగే, ఈ 'ఏరువాక పున్నమి' పండుగ..
తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు, భూ పూజ చేయాలని, ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూ పూజ కూడా, 'జ్యేష్ట పౌర్ణమి' నాడు జరపాలని, శాస్త్ర నిర్ణయం. అందుకే, జ్యేష్ట పౌర్ణమిని 'ఏరువాక పున్నమి' పర్వదినంగా, రైతాంగం జరుపుకుంటారు. నిజానికీ పండుగ రైతన్నల పండుగే అయినా, అందరి ఆకలి తీర్చే పండుగగనుక 'ఏరువాక పున్నమి' అందరికీ పండుగే.
ప్రాచీన సాహిత్యంలో 'ఏరువాక పున్నమి'ని 'వప్పమంగల దివసం'గా, రైతాంగం జరుపుకునే వారని, పాళీ, ప్రాకృత భాషలలోని 'జాతక కధల' ద్వారా వెల్లడవుతోంది.
పండుగ సందడి:
ఈ రోజు, ఎద్దులను శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి, మెడకూ, కాళ్ళకూ గంటలు కట్టి, అలంకరిస్తారు. తరువాత, పొలం పనులకు ఉపయోగించే 'కాడి' నాగలిని కడిగి, రంగులతో, రంగు రంగుల పువ్వులతో అలంకరించి, ఎడ్లకూ, నాగలికీ, భూమాతకూ పూజ చేసి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, ఎడ్లలకు పొంగలిని ఆహారంగా పెడతారు.
ఆ తర్వాత “ కాడి” నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లి భూమాతకు నమస్కరించి, భూమిని దున్నడం ప్రారంభిస్తారు. 'ఏరువాక పున్నమి' నాడు ఇలా చేయడం వల్ల, ఆ సంవత్సరమంతా పంటలు సమృద్దిగా పండుతాయని, కర్షకుల నమ్మకం. మరి కొన్ని ప్రాంతాలలో, ఊరు బయట, గోగునారతో చేసిన 'తోరం' కడతారు. రైతులందరూ అక్కడికి చేరి 'చెర్నాకోల'తో ఆ 'తోరాన్ని' కొట్టి, ఎవరికి దొరికిన నారను వారు తీసుకు వెళ్లి, ఆ నారను నాగళ్లకూ, ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయడం వల్ల, వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని, రైతుల విశ్వాసం..
సర్వం శుభకరం!
Link: https://www.youtube.com/post/UgzocrvkV7PkQliKkWt4AaABCQ
No comments:
Post a Comment