Ads

24 May, 2021

శ్రీ రాముడు లక్ష్మణుడికి బోధించిన రాజనీతి సూత్రాలు! Principles of Politics Told by Lord Rama

 

శ్రీ రాముడు లక్ష్మణుడికి బోధించిన రాజనీతి సూత్రాలు!

ఆసన్‌ ప్రజా ధర్మరతా రామేశాసతి నానృతాః!

సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః!!

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Xi290RigUXc ​]

రాముని పాలనలో ప్రజలు ధర్మ నిరతులై, ధర్మ పరాయణులై, సత్యవాదులై, శుభ లక్షణ సంపన్నులై జీవించారు. అందుకే, రాముడన్నా, రామ రాజ్యమన్నా, నేటికీ మనకు ఆదర్శం. సాక్షాత్తూ ఆ శ్రీహారే, మానవ రూపం ధరించి, శ్రీ రాముడిగా, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి, సుస్థిర రాజ్య పాలనజేశాడు. శ్రీ రాముడు ధర్మపరాయణుడై, పదివేల సంవత్సరాలు భూమిని పాలించి, కాలం అనే ధనస్సుతో లోకాలను రక్షించాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ, వారందరి యోగక్షేమాలనూ నిరంతరం విచారిస్తూ, ధర్మబద్ధంగా రాజ్య పాలనజేశాడు. సుభిక్షంగా విరాజిల్లిన ఆనాటి రామపాలనా, శ్రీ రామరాజ్యం, నేటికీ సువర్ణయగంగా, చరిత్ర పుటలలో లిఖించబడి ఉంది. ఒక రాజు ఎటువంటి ధర్మాలను ఆచరించాలి? రామధర్మం నియమాలేంటి? శ్రీ రాముడు, లక్ష్మణుడికి వివరించిన రాజనీతి సూత్రాలెంటీ? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

ఉత్తర రామాయణంలో, శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడికి, ఈ విధంగా రాజనీతి గురించి బోధించాడు. న్యాయంగా ధనాన్ని సంపాదించడం, సంపాదించిన దాన్ని వ్యాపారాలు చేయడం ద్వారా పెంచుకోవడం, అలా సముపార్జించుకున్న ధనాన్ని, తన వారి నుంచీ, పొరుగు వారి నుంచీ రక్షించుకోవడం, సత్పాత్రులకీ, మంచి పనులకీ, ఆ ధనాన్ని వెచ్చించడం అనేవి, రాజులు చేయాల్సిన పనులు. అసత్యం పలుకుటా, కోపాన్ని ప్రదర్శించుటా, ఏమరుపాటూ, అలసత్వం, కుటిలత్వం కలిగిన వారితో స్నేహం చేయడం, సోమరితనం వంటి దుర్గుణాలు, పాలకునికి ఉండకూడదు. తక్కువ సాధనాలతో, ఎక్కువ ఫలితాలను సాధించే పనులను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. అలసత్వం పనికి రాదు. వేయి మంది మూర్ఖుల సలహాలతో పని చేయటం కంటే, ఒక్క తెలివిగల పండితుని సలహాతో, కార్య నిర్వహణ చేయడం వల్ల, మంచి ప్రయోజనాలు పొందుతారు. మేధావీ, శూరుడూ, ఆలోచనలో సమర్ధుడూ, నీతిశాస్త్ర పండితుడూ అయిన ఒక్క మంత్రి వల్ల, రాజ్యాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళగలం.

నయం అనే దానికి మూలం వినయం. అది కేవలం శాస్త్ర జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది. అసలు వినయం అంటే, ఇంద్రియ జయం. అలా ఇంద్రియ జయం కలిగిన వాడే, శాస్త్ర జ్ఞానాన్ని పొందగలడు. బుద్ధీ, ధృతీ, దక్షతా, ప్రగల్భత్వం, ధారణాశక్తీ, ఉత్సాహం, ప్రవచన శక్తీ, దృఢత్వం, ప్రభుశక్తీ, శుచిత్వం, మైత్రీ, సత్యం, కృతజ్ఞతా, కులీనత్వం, శీలం, దమం అనే గుణాలన్నీ, రాజు సంపదకి కారణాలు. స్వార్ధం, పదవీకాంక్ష, కీర్తికాంక్ష, ధనకాంక్ష, ఆశ్రిత పక్షపాతం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి. రాజన్న వాడు, కామ, క్రోధ, లోభ, మోహ, హర్ష, మద, మాత్సర్యాలని పూర్తిగా పరిత్యజిస్తేనే, సుఖవంతుడవుతాడు. రాజు వినయ గుణ సంపన్నుడై, అన్వీక్షకి, వేదత్రయం, వార్త అంటే, కృషి, వాణిజ్యం, పశుపాలనం మరియూ దండనీతి అనే నాలుగు విద్యల గురించి, విద్వాంసుల దగ్గర కూర్చుని చింతన చేయాలి. అన్వీక్షకి వల్ల, ఆత్మజ్ఞానం, వస్తువు యథార్థ స్వరూపం తెలుస్తుంది. వేదత్రయం తెలుసుకోవడం వల్ల, ధర్మాధర్మవిచక్షణ కలుగుతుంది. ఏది అర్థవంతమైంది, ఏది అనర్థమైంది అనే జ్ఞానం, వార్త ద్వారా కలుగుతుంది.

రాజు తాను సుఖపడుతూ, దీనులను పీడించకూడదు. అలా చేస్తే, పీడించబడ్డ జనులందరూ, తమ దు:ఖం వల్ల కలిగిన కోపంతో, కౄరుడైన రాజుని చంపేస్తారు. శుభాలను కోరుకునే రాజు, పూజ్యుల విషయంలో ఎలాంటి ఆదరణ చూపిస్తాడో, దీనుల మీద కూడా అలాంటి ఆదరణే చూపించాలి. ప్రజలపై అనవసరమైన పన్నులు విధించి, బలవంతంగా వసూలు చేయకూడదు. మిత్రులను తనతో సమానులుగా భావిస్తూ, వారిని సత్కరించాలి. చెప్పుడు మాటలు విని, మన శ్రేయస్సు కోరే సన్నిహితులను కోల్పోకూడదు. పాలకుల వద్ద కుటిల స్వభావులూ, చాడీలు చెప్పే వారూ, గొప్పలు చెబుతూ భజన చేసేవారూ చేరుతారు. వారి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మంచి స్నేహితుల విషయంలోనే కాదు.. దుష్టులైన వారి విషయంలో కూడా, ప్రియమైన మాటలే పలకాలి. ప్రియంగా పలికే వాడిని దేవుడు అనీ, పరుషంగా మాట్లాడే వాడిని పశువు అనీ అంటారు. పాలనకు సంబంధించిన ప్రణాళికలను గురించి, ఒంటరిగా ఆలోచించకూడదు. అనేక మందితోనూ, ఆలోచన చేయకూడదు. ఎందుకంటే, ఒంటరిగా ఆలోచిస్తే, అందులోని మంచి చెడులు తెలిసే అవకాశముండదు. అనేకులతో ఆలోచిస్తే, ప్రణాళికలపై ఐకమత్యం కుదరదు. అంతేగాక, రహస్యం బట్టబయలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

రాజు త్రికరణ శుద్ధిగా, సకల దేవతలనూ పూజించాలి. తన కులగురువులను కూడా దేవతలలాగా పూజించాలి. సద్భావంతో మిత్రులనూ, ఆదరణతో బంధువులనూ, ప్రేమతో స్త్రీలనూ, దానంతో భృత్యులనూ, అనుకూల పరచుకోవాలి. ఇతరుల పనులను నిందించకూడదు. తన వర్ణాశ్రమ ధర్మాలను, నిరంతరం పాటించాలి. దీనుల మీద దయ చూపాలి. అందరితో మధురంగా మాట్లాడాలి. ఇంటికి వచ్చిన మిత్రులను ఆదరించాలి. యథాశక్తి వారికి ధనసహాయం చేయాలి. ఇతరులు వ్యక్తపరచే కఠోరమైన వాక్యాలను సహించాలి. తనకి అధికంగా సంపదలు కలిగినప్పుడు, ఎక్కువ పొంగిపోకుండా, సంయమనంతో ఉండాలి. అలాగే, ఇతరులకి అభ్యుదయం కలిగినప్పుడు, ఈర్ష్య పడకూడదు. ఎప్పుడూ ఇతరులకి బాధ కలిగంచే మాటలు, పలుకకూడదు. లక్ష్మణా, ఈ ధర్మాలను ఆచరించిన వాడే, ఉత్తమ ప్రభువుగా, ప్రజలచేత కీర్తింపబడతాడు.

రామాయణం, కేవలం ఒక గాథ మాత్రమే కాదు.. అందులోని ప్రతీ పాత్రా, మనకు మానవ సంబంధాలు ఎలా కొనసాగించాలో బోధించేవిగానే ఉంటాయి. తల్లిదండ్రులతో, గురువులతో, అతిథులతో, మిత్రులతో, ప్రజలతో, వానరులతో, పశు పక్ష్యాదులతో, శత్రువులతో ఎలా మెలిగాలో, ఎలా మనం ప్రవర్తిస్తే దేశానికీ, లోకానికీ క్షేమం కలుగుతుందో, ఒక రాజుగా ఏ విధంగా ప్రజలను పాలించాలో, ఎలాంటి వారితో స్నేహం చేస్తే మన వ్యక్తిత్వం వికసిస్తుందో, రామాయణ గ్రంథం ప్రతివొక్కరికీ సుస్పష్టంగా తెలియజేస్తుంది.

జై శ్రీరామ్!

Link: https://www.youtube.com/post/UgxJR6IMuEwFMYsuPld4AaABCQ

No comments: