Ads

13 May, 2021

‘జటాయువు – భీష్ముడు’ ఇఛ్చా మరణంలో భేదం! Comparison between the death of Bhishma and Jatayu

 

‘జటాయువు – భీష్ముడు’ ఇఛ్చా మరణంలో భేదం!

త్రేతాయుగంలో జటాయువూ, ద్వాపర యుగంలో భీష్ముడూ, ఇఛ్చా మరణం పొందినవారే.. కానీ, మంచి కోసం ప్రాణాలర్పించిన వారొకరైతే, చెడును ఖండించకుండా, చూస్తూ ఉండిపోయిన వారింకొకరు. ఇద్దరూ పొందిన ఇఛ్ఛా మరణం పర్యవసానాలేంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/k7pbkz7vyCA ​]

చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు, ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు. అయినా, నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడని అనుకుంటారు’.

రావణుడు జటాయువు రెండు రెక్కలనూ తెంచినప్పుడు, మృత్యువు వచ్చింది. జటాయువు మృత్యువును నిలువరించాడు..

‘జాగ్రత్త! ఓ మృత్యువా! ముందుకు రావడానికి సాహసం చేయవద్దు. నేను ఎప్పటివరుకూ మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకూ, నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతా మాత యొక్క సమాచారాన్ని,  నా రామచంద్ర ప్రభువుకు చేరవేసేంతవరకూ, నా వద్దకు రావద్దు’ అని అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. ఇలా కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

కానీ, మహాభారతంలో భీష్మ పితామహుడు,  ఆరు నెలలు అంపశయ్య మీద పడుకుని, మరణం కోసం వేచి ఉన్నాడు. కన్నీళ్ళ పర్యంతమైవున్నాడు. కానీ ప్రక్కనే ఉన్న కృష్ణ భగవానుడు, అంతరంగంలో చిరునవ్వు చిందిస్తున్నాడు! 

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకుని, చిరునవ్వు చిందిస్తున్నాడు, శ్రీ రామచంద్ర ప్రభువు ఏడుస్తున్నాడు. అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు రోదిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు చిరునవ్వు చిందిస్తున్నాడు. తేడా గమనించాలి..

మృత్యు సమయంలో, జటాయువుకు శ్రీ రామచంద్ర ప్రభువు ఒడి, దివ్య పాన్పుగా మారితే, భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు, శరములు పాన్పుగా మారాయి!

జటాయువు తన కర్మ బలం ద్వారా, శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క ఒడి లో ప్రాణ త్యాగం చేశాడు. జటాయువు, శ్రీ రామచంద్ర ప్రభువు శరణులోకి చేరాడు. అదే పరిస్థితులలో, ఒంటినిండా బాణాలతో, అంపశయ్యపై భీష్మపితామహుడు రోదిస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు?

ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో భంగపరుస్తుస్తున్నా, భీష్మ పితామహుడు చూసి కూడా అడ్డుకోలేకపోయాడు!

దుశ్శాసనుడికి ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చారు. కానీ, ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ వున్నా సరే, భీష్మ పితామహుడు తల వంచుకుని, మిన్నకుండిపోయాడు. ద్రౌపదిని రక్షించే ప్రయత్నం చేయలేదు. ఈ దుష్కర్మల ఫలితమే, కోరుకున్నప్పుడు మరణం పొందే వరం ఉన్నా కూడా, అంపశయ్యే దిక్కయింది.

జటాయువు స్త్రీని గౌరవించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు.. కాబట్టి, చనిపోతున్నప్పుడు, అతనికి శ్రీ రామచంద్ర ప్రభువు ఒడి, అనే దివ్య పాన్పు లభించింది!

ఇతరులుకు కష్టమో, నష్టమో జరుగుతున్నపుడు, చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడతారో, వారు మహాత్మ జటాయువులా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు.

‘నిజం అనేది కలత చెందినా, ఓడిపోదు’.. 

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Link: https://www.youtube.com/post/UgzHty8cOhC8DgpN8Nh4AaABCQ

No comments: