Ads

10 May, 2021

అష్టావక్రుడి శాపం వెనుక అసలు కారణాలు - చరిత్ర!

 

అష్టావక్రుడి శాపం వెనుక అసలు కారణాలు - చరిత్ర!

అద్వైత వేదాంతాలలో దిట్ట అష్టావక్రుడు. తల్లి గర్భంలోనే, సకల వేదాలనూ అవపోసన పట్టిన ఘటికుడాయన. మన గ్రంథాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టావక్ర సంహిత, ఆయన బోధనే. అంతటి తప:శాలి అయిన అష్టావక్రుడు, ఎనిమిది వంకరలతో పుట్టడానికి గల కారణమేంటి? తన తండ్రి శాపమా? లేక తన గత జన్మ ఫలితమా? అసలు అష్టావక్రుడి వృత్తాంతం ఏమిటి? ఆయన గత జన్మ వెనుక దాగిన గాథేంటి? బ్రహ్మ వంశస్థుడైన అష్టావక్రుని గురించి, అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో అధిక ప్రాముఖ్యత కలిగిన అష్టావక్రుని చరిత్ర గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/N31dJZvmENE ​]

వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు, ఉద్దాలకుడు. ఆయన వద్ద ఏకపాదుడిగా పిలువబడే కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. మంచి గుణగణాలూ, నీతినియమాలూ కలిగినవాడు. ఆయన తపోనిరతను చూసి ముగ్ధుడైన ఉద్దాలకుడు, తన కుమార్తె సుజాతనిచ్చి వివాహం చేశాడు. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల, ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి, అధ్యయనం చేసేవారు. ఒకరోజు ఏకపాదుడు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా, తన శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. విద్యార్థులు అలసిపోతున్నారు.. అయినా, గురువుకు భయపడి, వేదాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు. ఇది, సుజాత గర్భంలో పెరుగుతున్న శిశువుకు, బాధాకరంగా అనిపించింది. వెంటనే తన తండ్రితో.. ‘తండ్రీ.., ఏమిటీ విద్యాబోధన? శిష్యులు నిద్రాహారాలు లేక, అలసిపోతున్నారు. వారి ఆరోగ్యం పాడవుతోంది. ఈ విధమైన విద్యా విధానాన్ని మార్చుకోండి’ అని గర్భంలోంచే సలహా ఇచ్చాడు.

అందుకు ఏకపాదుడు ఆగ్రహంతో, ఆ గర్భస్థ శిశువుతో, ‘నీ జన్మకు కారణభూతుడనైన తండ్రినే విమర్శించేంత ఘనుడవా నీవు? వేదాధ్యయనమునకు వక్రముగా, గురువునే విమర్శించిన పాపానికి ప్రతిఫలంగా, నీవు ‘అష్టావక్రుడు’గా జన్మించు’ అని కోపంగా శపించాడు. ఆ గర్భస్థ శిశువు, తన తండ్రి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు. సుజాతకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడిందనీ, ఇక రెండు మూడు రోజులలో శిశు జననం జరుగుతుందనీ గ్రహించాడు, ఏకపాదుడు. ప్రసవ సమయానికి అవసరమైన తిలలూ, ఘృతమూ.. అంటే నెయ్యీ, ఇతర ధాన్యములూ సంపాదించే నిమిత్తం, ఏకపాదుడు జనకుని సభకు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ పందెం జరుగుతోంది. వరుణుని కుమారుడు వందితో వాదించి గెలిచినవారికి సర్వం యిస్తారనీ, ఓడితే జలసమాధి అయి ఉండాలనీ, షరతు విధించారు. అనుకోకుండా, ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయాడు. దాంతో రాజు పెట్టిన షరతు ప్రకారం, జలసమాధి అయి ఉండిపోయాడు ఏకపాదుడు.

సుజాత నెలలు నిండాక, ఒక కుమారుడిని ప్రసవించింది. తండ్రి శాపం కారణంగా, ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నాడు. అందుకే, అతనికి అష్టావక్రుడనే పేరు పెట్టారు. అదే సమయంలో, సుజాత తల్లి కూడా, శ్వేతకేతుడనే పుత్రుడుకి జన్మనిచ్చింది. అష్టావక్రుడు బాల్యం నుంచీ తాతగారైన ఉద్దాలకమహర్షి వద్ద వేద విద్యను అధ్యయనం చేస్తూ, ఆయనను తండ్రిగా, శ్వేతకేతుడిని సోదరునిగా భావించేవాడు. ఒకరోజు అష్టావక్రుడు ఉద్దాలకుని తొడపైన కూర్చుండగా, అది చూసిన శ్వేతకేతువు గబగబా వచ్చి, ‘నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలి గానీ, నువ్వెలా కూర్చుంటావు? వెళ్లి నీ తండ్రి తొడమీద కూర్చో.’ అని తనతో ఘర్షణకు దిగాడు. వెంటనే అష్టావక్రుడు తన తల్లి దగ్గరకు వెళ్లి, ‘నా తండ్రి ఎక్కడున్నాడు?’ అని అడిగాడు. ధన సంపాదనకై జనకుని సభకు వెళ్లి, వాదనలో ఓడిపోయి, జల సమాధిలో ఉన్నారని చెప్పింది సుజాత.

వెంటనే అష్టావక్రుడు, శ్వేతకేతువుని వెంటబెట్టుకుని, జనకుని సభకు వెళ్లాడు. కానీ, వారిని ద్వారపాలకులు అడ్డగించి, ‘ఇక్కడకు విద్వాంసులూ, పెద్దలూ, రుత్వికులకు మాత్రమే ప్రవేశార్హత ఉంటుంది. బాలురైన మీకు లేదు..’ అని లోనికి అనుమతినివ్వలేదు. అప్పుడు అష్టావక్రుడు, ‘అయ్యా! వయస్సుతో జ్ఞానం రాదు కదా? కనుక జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే? మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము’ అని అన్నాడు. వీరి గురించి తెలిసుకున్న మహారాజు, లోపలికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులందరినీ, వందినీ ఓడించి, తన తండ్రినీ మిగిలిన బ్రాహ్మణులనూ జల సమాధి నుండి విముక్తులను చేయమని, జనక మహారాజుని వేడుకున్నాడు. అయితే, వంది ఏకపాదుడిని, వరుణుడు చేయు యజ్ఞము వద్దకు పంపాడని తెలిసి, అతనిని కీర్తించాడు. పోటీలో విజయుడైన అష్టావక్రుని కీర్తి, నలుదిశలా వ్యాపించింది. జనక మహారాజు అద్వైత వేదాంత రహస్యములను అష్టావక్రుని ద్వారా తెలుసుకుని, అతని పితృభక్తికి ఎంతో సంతోషించాడు. అష్టావక్రుడితోసహా, ఏకపాదుడినీ ఘనంగా సత్కరించి పంపించాడు. ఈ సంఘటనతో, పుత్రోత్సాహం పొందిన ఏకపాదుడు, అష్టావక్రుడిని నదిలో స్నానం చేయించి, కుమారుని వంకరలు పోయేలా చేశాడు. దాంతో అష్టావక్రుడు, సుందరమైన బాలుడిలా మారిపోయాడు.

తరువాత అష్టావక్రుడు యుక్తవయస్సుకు రాగా, వివాహం చేసుకోదలచి, వదాన్యుని దగ్గరకు వెళ్లి, అతని కుమార్తె అయిన ‘సుప్రద’ను తనకు కన్యాదానంగా ఇమ్మని అర్థించాడు. అందుకు వదాన్యుడు, అతని శక్తిని పరీక్షింపదలచి, ‘నీవు ఉత్తరదిశగా వెళ్లి, కుబేరుని పట్టణం దాటి, కైలాసగిరి చేరి, శివపార్వతులు సంచరించిన ప్రదేశం దాటి ముందుకు వెళితే, ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి రా.. అప్పుడు నా కుమార్తె ‘సుప్రద’ను, నీకిచ్చి వివాహం జరిపిస్తాను’ అని చెప్పాడు. ఆ విధంగానే అష్టావక్రుడు, ఉత్తరదిశగా బయలుదేరాడు. ముందుగా అలకాపురి చేరి, కుబేరుడి స్వాగతం అందుకున్నాడు. అష్టావక్రుడు కుబేరుని ఇంట, రంభ, ఊర్వసి, తిలోత్తమల నృత్యగానాలను ఆస్వాదిస్తూ, ఒక సంవత్సరం అతిథిగా కాలం గడిపి, తిరిగి తన ప్రయాణం కొనసాగించి, హిమాలయాలలో, స్వర్ణమయమైన ఒక దివ్యభవనాన్ని చూశాడు. అక్కడ కొందరు సుందరీమణులు, అష్టావక్రునకు స్వాగత మర్యాదలు జరిపి, ఆ భవనంలోకి తీసుకుని వెళ్లారు.

ఆ భవనంలోపల ఒక సుందరాంగి, చిరునవ్వుతో అష్టవక్రుని దగ్గరకు వచ్చి, ప్రేమగా, అతనిని తన అభ్యంతర మందిరానికి తీసుకుని వెళ్లి, తన కోరిక తీర్చమని అడిగింది. అందుకు అష్టావక్రుడు, ‘తల్లీ.. నేను అస్ఖలిత బ్రహ్మచారిని. పరసతిని కూడుట ధర్మం కాదు. నన్ను విడిచిపెట్టు’ అని అర్థించాడు. అప్పుడా సుందరాంగి, ‘మహాత్మా... పరసతిని అనే కదా మీ అభ్యంతరం. నన్ను వివాహం చేసుకోండి. మీ సతిని అవుతాను. కాదనవద్దు.’ అని నచ్చచెప్పచూసింది. నీ వివాహ విషయంలో నీ తండ్రి గానీ, నీ సొదరుడు గానీ నిర్ణయం తీసుకోవాలి. నీకు నీవుగా స్వతంత్ర నిర్ణయం తీసుకునే అధికారం లేదు. నిజం చెప్పు నీవెవరవు? అని ప్రశ్నించాడు అష్టావక్రుడు. అందుకామె, అతని ధర్మనిష్ఠకు సంతోషించి, ‘మహామునీ.. నేను ఉత్తరాదికాంతను. మిమ్మల్ని పరీక్షింపమని, వదాన్యుడు నన్ను పంపాడు. ఈ పరీక్షలో మీరు గెలిచారు. వెళ్లి సుప్రదను వివాహం చేసుకోండి.’ అని పలికింది. ఆ తర్వాత  సుప్రదా, అష్టావక్రుల వివాహం, ఎంతో ఘనంగా జరిగింది. భార్యతో కలసి, ఆశ్రమం నిర్మించుకుని, హరి నామ స్మరణతో తపస్సుచేస్తూ, అష్టావక్రుడు గృహస్థాశ్రమంలో ఉండిపోయాడు. ఒక రోజున అష్టావక్రుడు నదిలో స్నానం చేస్తుండగా, అప్సరసలు వచ్చి, నృత్యగీతములతో తనను సంతోషింపజేశారు. అందుకాయన, ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ అప్సరసలు, మాకు విష్ణుమూర్తితో స్నేహం కావాలని, అష్టావక్రుడికి తమ కోరకను తెలియజేశారు. ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుని దగ్గర గోపికలై జన్మించి, స్నేహం చేస్తారని వరం ఇచ్చాడు.

అష్టావక్రుడు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సులో నిమగ్నమై, మనస్సును పరమాత్మయందు లయం చేసి, శ్రీకృష్ణుని దర్శించి, పరి పరి విధాలా ప్రార్థించి, ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశాడు. అష్టావక్రుడు తండ్రి శాపం వలన, ఎనిమిది వంకరలతో పుట్టడం వెనుక, అతని గత జన్మ శాపం కూడా దాగి ఉంది. సృష్టి ఆరంభంలో, బ్రహ్మ నుండి సృష్టించబడిన ప్రచేతనుడి మనుమడైన దేవలుడు, రాజ కుమార్తె అయిన మాలావతిని వివాహం చేసుకుని, కొన్ని సంవత్సరాల పాటు గృహస్థు ధర్మాన్ని ఆచరించి, ఆ తరువాత తీక్షణమైన తపస్సుకు పూనుకున్నాడు. అతని తపస్సు భగ్నం చేయడం కోసం, ఇంద్రుడు రంభను పంపగా, అతని మనస్సు చలించలేదు. దేవలుడి పొందు కోసం రంభ శత విధాలా ప్రయత్నించినా, అతను పట్టించుకోలేదు. తాప వేదనతో ఉన్న రంభ, ‘నీ కోసం వచ్చిన నన్ను అష్టకష్టాలూ పెట్టినందుకు, నీవు వచ్చే జన్మలో అష్ట వంకరలతో జన్మించు’ అని శపించింది. తరువాత తప్పు తెలుసుకుని, ‘నీవు, వేదాలనెరిగిన మహోన్నతుడివై, తండ్రిని మెప్పించి, నీ లోపాన్ని సరిదిద్దుకుంటావు.’ అని దేవలుడితో చెప్పి వెళ్ళిపోయింది. ఈ అష్టావక్రుడి గత జన్మ గురించీ, దేవలుడి శాపం గురించీ, మహాభారతంలో వివరించబడి ఉంది. అష్టావక్రుడు తన తండ్రిని విడిపించుకోవడానికి జనక మహారాజు దగ్గరకు వెళ్లినప్పుడు, వారిరువురి మధ్యా జరిగిన సంభాషణే, ‘అష్టావక్ర సంహిత’గా, ‘అష్టావక్ర గీత’గా ప్రాచుర్యం పొందింది.

Link: https://www.youtube.com/post/UgwDdukrHjALYTmPo5R4AaABCQ

No comments: