Ads

03 April, 2021

గర్భస్థ శిశువు!

 


గర్భస్థ శిశువు!

తల్లి కడుపులో ఉండే గర్భస్థ శిశువుకు మన మాటలు వినిపిస్తాయనీ, అర్ధమౌతాయనీ అనేక పురాణ కథనాలున్నాయి. మ‌న పెద్ద‌లు చెప్పిన ఈ మాట‌లు అతిశయోక్తులు కాదు. ఇందులో ముమ్మాటికీ నిజం ఉందని, ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు. ఈ కోవ‌కు చెందిన వారే అభిమ‌న్యుడూ, ప్రహ్లాదుడూ..

[ భక్త పహ్లాదుడి గత జన్మ రహస్యం! = https://youtu.be/IstcmPa7sKU ]

అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదనీ, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడనీ, మ‌హాభారతంలో వర్ణించబ‌డింది. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ, పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు, ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు చెప్పే స‌మయానికి సుభద్ర నిద్ర‌పోవ‌డంతో, మ‌ధ్య‌లో ఆపేశాడు. కనుకనే, తరువాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ, ఆ వ్యూహం నుండి బయటపడలేక, ప్రాణాలు కోల్పోయాడు.

హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా, తల్లి గర్భంలో ఉండగా, నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడనీ, అందువల్లనే, పుట్టుక‌తోనే ప్ర‌హ్లాదుడు విష్ణు భక్తుడయ్యాడనీ తెలుస్తోంది. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం, ఆమె కంటే, ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాదునికే ఎక్కువ ఉపయోగపడ్డాయి.

నేర్చుకోవడం అనేది, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని, ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి, రుజువు చేశారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందనీ, అందువ‌ల్లే, తల్లితో ఇతరులు మాట్లాడే మాటలూ, తల్లి ఇతరులతో చెప్పే సంగతులూ విని గ్రహించగలుగుతారనీ, నిపుణులూ, మనస్తత్వ శాస్త్రజ్ఞులూ చెప్తున్నారు.

గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుందీగనుక, గర్భిణీ స్త్రీలు వీలైనంత ప్రశాంతంగా ఉంటూ, ఆవేశాలకూ, ఆక్రోశాల‌కూ దూరంగా, ఆధ్యాత్మిక విషయాలు వింటూ, చదువుతూ, ఆ భ‌గ‌వంతుని ఆలోచనలో వుండాలి.. సర్వేజనాః సుఖినోభవంతు!


No comments: