ఆత్మానుభూతి!
'ఆత్మావా అరేద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో
మైత్రేయ్యాక్త్మనో వా అరె దర్శనేన శ్రవణేన, మత్యా విజ్ఞానేనేదం సర్వం విదితం'..
[ మనిషికుండవలసిన 'లక్ష్యం'! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]
ఓ మైత్రేయీ, ఆత్మనే సరిగా చూడాలి. ఆత్మ జ్ఞానము కలగటమే, గొప్ప పురుషార్ధం. ఆత్మను గురించే ఆచార్యుల ద్వారా, శాస్త్రముల ద్వారా శ్రవణము చేయాలి. ఆత్మనే మననం చేయాలి. నిధిధ్యాసన చేయాలి. శ్రవణాదుల చేతనే, సమస్తమూ తెలుస్తుంది.
ఆత్మను తెలుసుకున్న తర్వాత, ఇక తెలుసు కోవాల్సిందంటూ ఏమీ ఉండదు. అనేక జన్మలలో, అనేక ప్రాపంచిక విషయాలను తెలుసుకుంటూనే ఉంటాము. అలా ఎన్ని తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటూనే ఉంటాయి, తెలుసుకుంటూనే ఉంటాము. కానీ, తెలుసుకోవాల్సింది ప్రపంచాన్ని గురించి కాదు.. ఈ ప్రపంచానికి ఆధారమైన ఆత్మ గురించేననీ, ఆత్మ అంటే తన స్వరూపమేననీ తెలుసుకోవాలి.
తెలుసుకోవటం అంటే, దృఢంగా అనుభూతి చెందాలి. అలా గనుక అనుభూతి చెందితే, ఈ దృశ్యం కాస్తా అదృశ్యం అవుతుంది. ఇక తెలుసుకునే పనే ఉండదు. కనుకనే, అట్టి ఆత్మనూ, బ్రహ్మమునూ తెలుసుకో.. అనుభూతి చెందు.. అని సూచన. ఎప్పటికైనా, ఎన్ని జన్మలెత్తియైనా సరే, ప్రతి జీవీ తెలుసుకోవాల్సింది ఇదే. అట్టి జ్ఞానాన్ని ఇప్పుడే, ఈ జన్మలోనే పొందితే, అనంత కోటి జన్మలలో అనుభవించాల్సిన కష్టాలూ, దుఃఖాలూ, బాధలూ, భయాలూ, ఆందోళనలూ, అలజడులూ అన్నీ పరిసమాప్తమవుతాయి. జన్మ సార్ధకమవుతుంది.
కనుక, బ్రహ్మమును గురించి తెలుసుకో.. బ్రహ్మమును గురించే నిరంతరమూ జపించు.. బ్రహ్మమునకై ధ్యానించు.. బ్రహ్మ చింతననే చేస్తుండు.. చివరకు బ్రహ్మానుభూతి చెంది, బ్రహ్మముగా ఉండిపో..
శుభం భూయాత్!
Link: https://www.youtube.com/post/UgzGuJBhoGsvvWQ4PQp4AaABCQ
No comments:
Post a Comment