Ads

16 February, 2021

మృత్యు మర్మం! Secret of Death

 

మృత్యు మర్మం!

ఈ విశాల విశ్వాన్ని ఏదో తెలియని అదృశ్య శక్తి పాలిస్తోందని గ్రహించడం, అంత కష్టమైన పనికాదు. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో ఉంటుందనీ తెలుసు. దీనినే వేదాల్లో ‘ఋత’ అంటారు. సూర్య చంద్రులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, ఋతువులూ, రేయింబవళ్లూ, వీటన్నింటికీ నిర్దిష్టమైన క్రమం, చలనం ఉన్నాయి. ఇలా బాహ్య ప్రపంచంలోనేగాక, మనిషి అంతర్గత ప్రపంచంలోనూ క్రమబద్ధత ఉంది. గుండె కొట్టుకోవడం, శ్వాస పీల్చుకోవడం, రక్త ప్రసరణ ఇత్యాదుల్లో, ఒక్క క్షణం జాప్యం జరిగినా, ఏమవుతుందో తెలుసు.

అంపశయ్యపై భీష్ముడు ధర్మరాజుకుపదేశించిన కథ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/t43ByMxiNNs ]

ప్రకృతిపై ఆధిపత్యం ఎలాగూ మనిషి చేతుల్లో లేదు.. అలాగే, 'మనిషి ‘లో'పలి క్రమబద్ధత ముగింపూ' మనిషి చేతుల్లో లేదు.. సహజంగా రావాల్సిన ముగింపును మనిషి తన చేతుల్లోకి తీసుకుని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఎన్నో విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్న మనిషి ముందు, నాటికీ, నేటికీ ప్రశ్నార్థకంగా నిలుస్తున్న ఏకైక అంశం, 'మృత్యువు'. చావు పుట్టుకల మధ్య మనిషిని వెంటాడుతున్న వాస్తవమే, మృత్యు భీతి.

మహాభారతంలో భీష్ముడు మరణ రహస్యాన్ని కనుగొన్నాడో లేదో తెలియదుగానీ.. తాను కోరుకున్నప్పుడు మరణాన్ని పొందే వరం మాత్రం, తండ్రి నుంచి పొందాడు. అంతిమ దశలో అంపశయ్యపై పరుండి, ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ, మృత్యువుని తన ఆజ్ఞ కొరకు వేచి ఉంచి, తనువు చాలించాల్సిన సమయ సూక్ష్మాన్ని జగద్విదితం చేసి, మృత్యువుని ఆహ్వానించిన మహాజ్ఞాని ఆయన.

మృత్యువు కూడా జీవితంలాగా, మనోహరమైనదే. ఎలా జీవించాలో తెలిసిన వారికి, మృత్యు భీతి నుంచి విముక్తి పొందడం, అంతే సులభం. మనిషి సంపూర్ణ శక్తి వంతుడిగా ఉన్నప్పుడే, మనస్సులో తిష్ఠ వేసుకునే గతాన్నీ, అనుక్షణం 'నేను' అనే అహాన్నీ గుర్తుచేసే ఆలోచనల్నీ, ఎప్పటికప్పుడు మానసికంగా అంతం చేస్తే.. వర్తమానంలో జీవించడం బోధ పడుతుంది. అప్పుడు జీవనం, మరణం, ఐక్యమైపోతాయి. మనకు తెలిసిన దాని నుంచి స్వేచ్ఛ పొందడమే మృత్యువు.

ఎవరైతే తమ మనస్సును నిశ్చలంగా ఉంచుకుంటూ, సమస్యల ప్రభావాన్ని మనస్సు మీద పడకుండా చేసుకోగలరో, అలాంటి వారికి అంగుత్తరనికాయలో, బుద్ధుడు చెప్పిన మాటలు, తప్పించుకోలేనీ, జరగక మానని సమస్యలనూ, నిర్భయంగా ఎదుర్కోవడానికి దోహద పడతాయి. ఏదో ఒక రోజు, నేను అమితంగా ప్రేమించి, నావిగా భావించే వస్తువులన్నీ నా నుంచి దూరమై, నాశనానికీ, మార్పునకూ లోనయ్యేవే.. దాన్ని నేను తప్పించలేను. ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం వస్తుంది. అలా రాకుండా నేను తప్పించలేను. ఏదో ఒక రోజు నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తిరస్కరించలేను. నేను చేసిన కర్మలకు, నేనే బాధ్యుణ్ని.. వాటి నుంచి తప్పించుకోలేను. ఏదో ఒక రోజు నన్ను మృత్యువు కబళిస్తుంది. దాని నుంచి బయట పడలేను..

ఈ పంచ సూత్రాలను గురించి ఆలోచించినప్పుడు, మనిషి తన అహం, దురాశ, దుశ్చేష్టల నుంచి విముక్తిని పొందుతాడు. పారమార్థిక పథంలో అడుగిడతాడు. తద్వారా, జరగక మాననీ, తప్పించుకోలేని వాటిని, భయరహితంగా ఎదుర్కోగలిగే మనోబలాన్ని పెంపొందించు కోగలుగుతాడు. బాల్యాన్ని ఆస్వాదిస్తూ, కౌమారాన్ని అనుభవిస్తూ, వార్ధక్యంలో, ఆ అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ, అరవైల్లో ఇరవైల వ్యామోహాల్ని వదిలి, బంధాల మాయ నుంచి బయటపడి, వర్తమానంలో జీవించడం తెలిసిన వారికి, ‘మృత్యు భీతి’ తృణ ప్రాయం..

గణపతిని పూజించే పాశ్చాత్య దేశాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PU6pP-tN6Ts ]

Link: https://www.youtube.com/post/UgywnZvvYeVw7HuLT-Z4AaABCQ

No comments: