రథసప్తమి నాడు ఏం చేస్తే సర్వ శుభాలూ చేకూరుతాయి!
సమస్త లోకాలనూ తన ఉజ్వల కిరణాలతో చైతన్య పరిచే భానుడిని, దేవుడిగా, అనాది నుంచీ సమస్త జనులూ విశేషంగా ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా మన హైందవ దర్మంలో, సూర్యుని ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉంది. మన వేదాలలో, దేవతలందరిలోకల్లా సూర్య భగవానుడిని ఉత్కృష్టుడిగా వివరించబడింది. అటువంటి సూర్యనారయణుడిని, రథసప్తమి రోజున ఎంతో విశేషంగా ఆరాధిస్తారు. అసలు రథసప్తమి అంటే ఏమిటి? ఆ రోజు సూర్యుణ్ణి ఎందుకు, ఎలా కొలుస్తారు? ఆ రోజు పాటించాల్సిన ప్రత్యేక నియమాలేంటి? అనే విషయాలు ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/RcSzefZE3ow ]
మాఘ శుక్ల సప్తమి పుణ్యదినాన, సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి, రథాన్ని అధిరోహించాడని, మత్స్య పురాణం చెబుతోంది. అందుకే, ఈ రోజుని రథసప్తమి అని అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే, రథసప్తమి. ఆ రోజు చేసే స్నానాలూ, వ్రతాలూ, పూజలూ, దానాలూ, తర్పణాదులూ అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వ భూతాలూ, ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మమనీ సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే, సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులూ, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ, జీవకోటికి శభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత, రథసప్తమికి ఉంది. సూర్యనారాయణ మూర్తి రథానికీ, ఒక ప్రత్యేకత ఉంది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఒక చక్రం ఉండే రథం, ప్రపంచంలో మరెక్కడా ఉండదు. దేనికైనా, కనీసం రెండు చక్రాలు కావాలి. అయితే సూర్యుని రథం మటుకు, ఒకే చక్రంతో ఉండడం విశేషం. "శార్వరి నామ సంవత్సరే, ఉత్తరాయణే, శిశిర రుతౌ, మాఘమాసే, శుక్లపక్షే, సప్తమ్యాం, కృత్తికా నక్షత్రే, కళింగ దేశాధిపతిం," అంటూ సూర్యనారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా, నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు.
ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడని వర్ణిస్తాయి, సాంప్రదాయ గ్రంధాలన్నీ. దక్షిణాయనం పూర్తయిపోయి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథి, రథసప్తమి అని గుర్తించాలి. ఇక నుంచి ఉత్తరాభిముఖంగా, సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి. కనుక, ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా, వాకిళ్ళలో రథం ముగ్గులు వేయాలి. అలాగే, సూర్య నారాయణ మూర్తి స్తోత్రం పఠించాలి. మాఘ అంటే పాపం లేనిది, పుణ్యాన్ని కలిగించేది అని అర్థం. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ మోక్షప్రదాయకాలే. శివకేశవులిరువురికీ, మాఘం ప్రీతికరమైనది. ఉత్తరాయణం, మకర సంక్రమణంతో ప్రారంభమైనా, రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండే, వేసవి ఆరభమవుతుంది. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన రథసప్తమి నాడు, ఏం చేయాలో తెలుసుకుందాం..
మాఘ శుద్ద సప్తమి, సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకీ వెలుగునిచ్చే సూర్యుడు రథాన్నెక్కి, తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో, కొన్ని పనులు చెయ్యడం వలన, ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని, మన శాస్త్రాలు చెపుతున్నాయి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, మర్నాడు ఉదయం, సూర్యోదయానికి ముందుగానే లేచి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, మగవారు 7 జిల్లేడు ఆకులూ, ఆడవారు 7 చిక్కుడు ఆకులూ తలపై, భుజాలపై ఉంచుకుని, ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ, స్నానం చేయాలి.
"జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవీ, నమస్తే సూర్య మాతృకే"
సప్తాశ్వములుగల ఓ సప్తమీ, నీవు సకల భూతములకూ, లోకములకూ జననివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రమునకు అర్థం. వ్రతచూడామణి అనే గ్రంధంలో, బంగారం, వెండీ, రాగీ, ఇనుము, వీనిలో దేనితోనైనా చేసిన దీప ప్రమిదను సిద్ధం చేసుకుని, దానిలో నెయ్యి, నువ్వులనూనె, ఆముదం, విప్పనూనెలలో ఏదో ఒకదానితో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకుని, నదీతీరానికి గానీ, చెరువుల వద్దకు గానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్లలో వదిలి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులుగానీ, ఏడు చిక్కుడాకులు గానీ తలపై పెట్టుకోవాలి. మన భారతీయ ఆచారాలు, మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలున్నాయి. వాటి గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా, సత్ఫలితం మాత్రం తప్పక ఉంటుంది. కానీ, తెలిసి ఆచరించడం ద్వారా తాను లాభపడడమే కాకుండా, ఇతరులతోనూ చేయించి, వారిని చైతన్యవంతుల్ని చేయవచ్చు. జిల్లేడు - శ్లేష్మా, పైత్యా, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలనూ, వాతం నొప్పులనూ, కురుపులనూ, పామూ, తేలు విషాన్నీ, పక్షవాతాన్నీ, బోదకాలు వ్యాధినీ పొగొడుతుంది. ఇందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్ఠం. ఉపయోగించే విధానం తెలిస్తే, దీని ఆకులూ, పాలూ, పూలూ, కాయలూ అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి, ఉపశమనం కలిగిస్తాయి.
రేగి పండు గింజలు కురులకు మంచిబలాన్ని కలిగిస్తాయి. వాటి ఆకులు నూరి, తలకు రుద్దుకుని స్నానం చేస్తే, వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలిపి కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకుంటే, బొంగురు గొంతు తగ్గి, స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచి రక్తాన్నిస్తాయి. మూలవ్యాధిని పొగొడతాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణ శక్తిని పెంచుతాయి. మాఘమాసంలో రథసప్తమే కాదు, సూర్యునికి ముఖ్యమైన ఆదివారాలన్నీ విశేషమైనవే. ఏ కారణం వల్లనైనా, రథసప్తమి నాడు పై విధంగా సూర్యారాధన చేయలేనివారు, మాఘ ఆదివారం నాడు చేయవచ్చు. అంతేకాదు, ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశేషమైనది. రథసప్తమి నాడు బంగారంతో గానీ, వెండితో గానీ, రాగితో గానీ, రథమును చేయించి, కుంకుమాదులూ, దీపములతో అలంకరించి, అందులో ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమనుంచి పూజించి, బ్రాహ్మణునికి ఆ రథమును దానం ఇవ్వాలి. రథసప్తమి వ్రతం, మన సంప్రదాయంలో నిలిచియుండటం, భారతీయతకు చిహ్నం. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు. కాబట్టి, సూర్యుణ్ణి ఆరాధించువారందరూ భారతీయులు.
రథసప్తమినాడు..
"సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్"
అని ఈ శ్లోకాన్ని జపిస్తూ స్వామి వారిని పూజించాలి. ఈ రోజు ముత్తయిదువులు తమ నోములకు అంకురార్పణ చేస్తారు. చిత్ర గుప్తుని నోమూ, ఉదయకుంకుమ నోమూ, పదహారుఫలాల నోమూ, గ్రామకుంకుమ నోమూ వంటి వాటిని, ఈ రోజు మొదలుపెడతారు.
Link: https://www.youtube.com/post/UgwGX6dboFSKvtFlwVl4AaABCQ
No comments:
Post a Comment