Ads

28 February, 2021

స్థిర చిత్తం! Firm Will


స్థిర చిత్తం!

మొదలు పెట్టిన పనిని, జయాపజయాలతో సంబంధం లేకుండా పూర్తిచెయ్యాలంటారు మన పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమిది. జీవిత గమనంలో, మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. తాను తలపెట్టిన పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా, కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం, పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు = https://youtu.be/JFLTERF-L2w ]

ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది.. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది.. అంతలోనే అపజయం ఎదురవుతుంది.. 'పరాజయానికి' సమర్థతా లేమి కన్నా, సరైన ప్రణాళిక లేక పోవడమే, ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడూ, మరియూ మత్స్యయంత్రం ఛేదనకు పూనుకున్నప్పుడూ, అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు.. రెప్ప పాటు నిడివి సైతం తేడా లేకుండా, బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం..

మనస్సు పరి పరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా, కడవరకూ సాగదు. ఉద్రేక పూరిత భావనలు మనస్సును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనస్సు, కార్య సాధనకు ఆటంకం అవుతుంది. మనస్సును వశం చేసుకున్న వాడు, విశ్వ విజేత అవుతాడని, బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనో స్థిరత్వాన్ని సాధించలేక పోయాడు. మేనకాధీనుడై, చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు, మనస్సుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్య సఫలతకు కృషి చేసే సాధకుడు, మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనస్సును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం, ధ్యాన సాధన చేయాలి.

అహంకారం, అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్య సాధన కోసం పురోగమించే వ్యక్తి, అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం, మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలిరా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు, మహావృక్షంలా అహంకరించినవాడు, కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా, గడ్డి పోచల మాదిరిగా, తలదించుకు నిలిచిన వ్యక్తి, ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం, అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.

మనిషి తన జీవిత కాలంలో, గొప్ప కార్యాలెన్నో తల పెడతాడు. విజయం వరించినా లేకపోయినా, పరాజయం మాత్రం, కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై, అలసట చెందిన మనిషి, అంతర్గతంగా, మనస్సు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను, స్వాగతించాలి. నరికిన మోడు నుంచి, చిగురించిన పచ్చని మొక్కలా, తనను తాను మలచుకోవాలి.

సాధకుడి విజయాలకు పరమార్థం, వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు.. సమాజ పురోగతి సైతం, అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే, ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి, విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో, విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలూ, విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం, మనిషిని విశాల దృక్పథుడిగా మార్చడమే..

భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను, ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను? సమయాను కూలతను బట్టి, 'ధాన్య రూపం'లో నన్ను నేను అర్పించుకోవడం తప్ప.. అనుకుని, పంటసిరి మురిసిపోతుంది.. శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/UgxEl29X4m0cbDcgTmV4AaABCQ

No comments: