'కోటిమంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమన్న వ్యాధిని మాన్పలేరు' - బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు..
'జాతస్యః ధృవో మృత్యుః' - భగవద్గీత..
'పుట్టుటయు నిజము పోవుటయు నిజము' - అన్నమయ్య..
'పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం' - ఆదిశంకరాచార్యులు..
[ ‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు! ఈ వీడియో చూడండి: https://youtu.be/bDCCIC1IwDk ]
ఇలా ఎందరోమహానుభావులు ఎంతో అనుభవముతో, ఆర్తితో, జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం.. కానీ, ఏ రోజైనా దీనిని గురించి ఆలోచించామా? కనీసం ఆలోచించే ప్రయత్నమైనా చేశామా?
ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి. 'మాకురుధన జన యవ్వన గర్వం హారతి నిమేషాత్కాలః సర్వం, మాయా మయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశం విదిత్వా' - ఆదిశంకరాచార్యులు..
మనకు ఏది అవసరమో, ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయుచున్నారు. కావున, ఈ మానవ ఉపాధి మహోత్కృష్టమైనది. కొన్ని కోట్ల కోట్ల జన్మలకుగానీ, ఎన్నో ఉపాధులు దాటితేగానీ, ఈ మానవ ఉపాధి లభించదు. లభించిన ఈ ఉపాధినీ, భగవంతుడు మనకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్నీ, అవకాశమునూ, అవివేకంతో, అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకొనరాదు. ఈ మహదావకాశమును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం.
భాగవతం అష్టమస్కందములో 37, 46 పద్యములలో శ్రీ పోతన గారి ద్వారా, అపరధర్మావతార మూర్తి 'రామో విగ్రహవాన్ ధర్మః' అని కీర్తించబడిన ఆ శ్రీ రామచంద్రప్రభువే, శ్రీ పోతనామాత్యులవారితో పలికించినట్లు, ఈ ఉపాధికి (ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్ల మంది (భార్యల తో/భర్తలతో/పిల్లలతో) సంబంధ బాంధవ్యములు ఉన్నాయో ఆలోచించండి..
పూజ ఎలా చేయాలి?
పరమాత్మ నుండి విడివడిన ఈ జీవాత్మను (మానవ ఉపాధిని ఆశ్రయించిన) మరలా పరమాత్మలో చేర్చడానికి, ప్రతి మానవ ఉపాధీ పరమాత్మ ప్రసన్నత కొరకు పూజ చేయాలి. పూజ చేస్తే అంతఃకరణ శుద్దీ, ధర్మబద్దమైన జీవనమూ అలవాటై, జీవాత్మ పరమాత్మ వైపుకు తిరుగుతుంది.
ప్రతి మానవుడు సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తములో నిద్రలేవాలి. బ్రహ్మ ముహూర్తమనగా, సూర్యోదయానికి 88 ని|| ముందు ఉన్న కాలమును, బ్రహ్మముహూర్తకాలమని అంటారు.
నిద్ర ఎలా లేవాలి?
1) ప్రతి రోజూ నిద్రనుండి మేలకువ వస్తోంది అని తెలియగానే, మన మనస్సులో మన కులదైవం పాదాలను దర్శించాలి. ప్రణమిల్లాలి (నమస్కరించాలి).
2) శ్రీ హరి, శ్రీ హరి, శ్రీ హరి అంటూ నిద్రలేవాలి.
3) నిద్ర నుండి లేవగానే తన చేతులు (అరచేతులు) చూచుకుని, మనస్సులో నమస్కరించాలి.
“కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ,
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం” అన్నారు ఆర్యులు.
1) భూమి మీద కాలు మోపే ముందు భూమాతకు నమస్కరించి, భూమిపై పాదములు (ముందు కుడిపాదము, తర్వాత ఎడమ పాదము)పెట్టాలి.
2) నిద్రలేచి భూమి మీద నిలబడగానే, మన మనస్సులో మన గురువు గారినీ, వారి పాద పద్మములనూ స్మరిస్తూ (నిజంగా గురువు గారే మన ముందు నిలుచున్న భావనతో) నమస్కరించాలి.
తమ తమ ఇష్ట దైవములను పూజ చేయుటకు ఉపక్రమించాలి. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ వెంటకేశ్వరుడు, శివుడు, శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, సాయిబాబా, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, ఎవరైనా కావచ్చు. నిజానికి భగవంతునికి లింగ బేధము లేదు. పరమేశ్వరుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, 'అరూప రూపి'. వారి వారి నమ్మకములను బట్టి, వారి వారి గురూపదేశమును బట్టి పూజిస్తారు. సూర్యుడు ఉదయించక పూర్వము, మరలా సూర్యుడు అస్తమించక పూర్వము (సూర్యుడు అస్తమించేముందు). పూజ చేయాలి.. ఎందుకు?
బ్రహ్మ, విష్ణు, శివాంశ స్వరూపముల కలయికే సూర్యభగవానుడు. యదార్థమునకు, సూర్యుని స్వరూపము ఒక కాంతి ముద్ద. ఈ మాంస నేత్రములతో చూడగలిగిన ప్రత్యక్ష దైవం సూర్యుడు. 'ఆరోగ్యం భాస్కరాద్యిచ్ఛేత్'. కావున, సూర్యభగవానుని గమనాన్ని అనుసరించి, పూజాది కార్యక్రమాలు జరగాలి. కాల కృత్యములు తీర్చుకొన్న తర్వాత, స్నానం చేయాలి. పరబ్రహ్మ స్వరూపమైన ప్రాతఃకాల సూర్యుడు ఉదయించే సమయానికి: యజ్ఞోపవీతం (జంధ్యము) ఉన్న ప్రతి ఒక్కరూ, సంధ్యావందనం చేయాలి. కేవలం యజ్ఞోపవీతం ఉన్నవారే కాదు, అందరూ కూడా సంధ్యావందనం చేయవచ్చు.
'బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్' అందుకు చెప్పింది వేదము. బ్రహ్మ ముహూర్తము సూర్యోదయానికి 88 ని|| ముందు లేచి స్నానము చేసి, సంధ్యావందనం పూర్తి చేసుకొని, ఆర్ఘ్యం ఇచ్చేసి, సంధ్యావందన గాయిత్రీ జపం చేస్తున్నవాడవై, భగవంతునకు స్వాగతం పలుకుచున్నట్లు, గాయత్రీ జపం చేస్తూ ఉండాలి.
వారు వీరను బేధములేక, వర్ణ, వర్గము తేడాలేక, వయసు లింగ బేధము లేక, కుల, మత బేధములేక, ఎవరైనా గురుముఖతః, పూజా విధానమును అభ్యసించి కానీ, లేదా వారి వారి గృహములలో వారి పెద్దలు చేయుచున్న విధముగా కానీ, పూజాది కార్యక్రమములను చేసుకొనవచ్చును. పరమాత్మ (భగవంతుడు) అందరివాడు.. ఇందులో ఎలాంటి సందేహమూలేదు.
చూచే వారి కొరకూ వారి ప్రశంసల కొరకూ (అబ్భ వారు ఒక గంట, లేదా రెండు గంటల సేపు, ఎంత సేపైనా, ఏక ధాటిగా పూజ చేస్తారండీ) చేయు పూజ నిరుపయోగము. అందుకే, శ్రీ త్యాగరాజ స్వామి వారు, 'మమతా బంధనయుత నర స్తుతి సుఖామా? రాముని సన్నిధి చాలా సుఖమా? నిజముగ తెల్పుమో మనసా!' అని ప్రార్ధన చేశారు.. కావున, పూజను త్రికరణ శుద్ధిగా, మనోవాక్కాయ కర్మలతో, అనగా, మనస్సునూ, నోటి మాటనూ, మరియు చేతలనూ, ఒకటిగా అనుసంధానము చేసి, పూజ చేయాలి.
మన ఉద్ధతి కొరకూ, భగవంతుని ప్రీతి కొరకూ చేయాలి కానీ, ఇతరుల ప్రశంసల కొరకు కాదు.. నరుల మెప్పు కొరకు ఏది చేసినా, ఎన్ని చేసినా వృధానే.. అదే నారాయణుని మెప్పు కొరకు ఒక్కటి చేసినా, ఆ జీవితము ధన్యము. నరులు మెచ్చే పూజ, భక్తి, నరకమునకు మార్గము. నారాయణుడు మెచ్చే పూజ, భక్తి, స్వర్గమునకు మార్గము. త్రికరణ శుద్ధితో పూజ చేసినప్పుడు, వారు పొందు అనుభవమూ, ఆ దివ్యానుభూతీ వర్ణనాతీతము. ఆ మధురానుభూతినీ, దివ్యానుభూతినీ తెలియ చేసే భాష, ఈ ప్రపంచములో ఇంతవరకూ ఏదీ లేదు..
Link: https://www.youtube.com/post/UgwszdGjVOZdzDRHjAN4AaABCQ
No comments:
Post a Comment