Ads

09 January, 2021

తిరుప్పావై గోదాదేవి 25వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

ఇరవై అయిదవ రోజు అనగా 09.01.2021 శనివారము..

25వ రోజు - శ్రీ కృష్ణావతార రహస్యం..

ఆండాళ్ తిరువడిగలే శరణం

గోపికలు ఈ విధముగ మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాంక్షించుచున్నారు. చాలా సంతోషమే, కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు. చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు. కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను. నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు, రాత్రి, మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకుపర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావున మంగళాశాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుమని, దానిని ఈ పాశురములో వివరించినారు మన గోపికలు. గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారని చెప్పుచున్నారు

పాశురము:

        ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్

        ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర

        తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద

        కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్

        నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై

        అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్

        తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యాంపాడి

        వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్.

ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది, అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావై ని మనం విశ్వసించాలి. భగవంతుడు మనకోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి, ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కల్గించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతక గల్గితే మనం ఉన్నచోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా, ఇక సృర్తినిచ్చేవిగా ఉండగల్గుతాయి. గోదా దేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది.

ఈ రోజు మనవాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదొ కోరి వచ్చారుకదా, అదేదో చెప్పండి అని అడిగాడు. వీళ్ళు మేం ఏదికోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు. అబ్బెబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్దాలు ఆడకు, నీవెవరో, ఎందుకిక్కడికి వచ్చావో, ఎట్లావచ్చావో, ఎక్కడినుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు.

అట్లా తెలుసుకొని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి, చివర ఒక మాట చెప్పాడు.

వీత రాగ భయ క్రోదాః మన్మయా మా ఉపాస్రితాః

వహ వహ జ్ఞాన తపసాః పూతాః మద్భావ మాగతాః

రాగం, భయం, క్రోదాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడుతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇక భయం, మనకు రాగం కల్గినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాం. మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేన్నుంచి దూరం అవుతాం కనుక. అది ఎప్పుడూ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నేలేదు కదా. నీవు ఎదోక దానియందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే, దాన్ని దూరం చేసే దానియందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోదం అంటాం. ఇక నీకు ఏమి దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోదం కలిగే ప్రశ్నేమిటి కనుక. ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా, చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండిన, ఇవన్నీ తనప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు. ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ, భయ, క్రోదాలు తొలగి పోతాయి. అందుకే "త్యక్త రాగ భయ క్రోదాలు" అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, వదలటం. వీత అంటే తొలగిపోయిన అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటికి వదిలివేయటంలేదు, చీకటి తానంతట తానే తొలగి పోతోంది. మనం రాగ, భయ, క్రోదాలను వదిలివేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి. మనం వదలడం కాదు, అవి వదిలి పోవాలి మనల్ని.

ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే, వాడి జ్ఞానం మనకు కల్గి నప్పుడు. ఆండాళ్ ఈ రోజు అదే వివరిస్తుంది. మాకుతొలగాల్సినవి తొలగాయయ్యా. రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీవరకు పర్యవసిస్తుంది.  మాకు సరియైన జ్ఞానం కల్గింది, నీవేవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానం "మద్భావ మాగతాః" తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావుకదా, మా కిప్పుడు కావలసింది అది అన్నారు. అవన్నీ నాకుతెలియవు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తా అన్నాడు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసును, నీ వెవరివో మాకు తెలుసూ అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్ట పరుస్తున్నారు.  నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు, కాని "ఒరుత్తి మగనాయ్ పిఱందు " ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. అవతరించాడు అని చెప్పడంలేదు ఆండాళ్ ఎందుకంటే అయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడాయన.  అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆండాళ్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది.

ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితియురాలు అంటే, ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, "ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర" మరొక అద్వితియురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు.

"తరిక్కిలానాకి" సహించలేక పోయాడు ఆ "త్తాన్" ఆ నీచుడు, కంసుడు అని పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడై పోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే  "తీంగు నినైంద" కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, "కరుత్తై పిరపిత్తు" అది వారికే జరిగేట్టు చేసాడు. "కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న" కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించి పోయేవాడు.

స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. "నెడుమాలే" అయన దీర్గమైన వ్యామోహం, ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడి తమపై ప్రేమలేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు , అయన కుండేది మనపై ప్రేమ విభువంతా. సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు "మార్తా దూర్దం న జీవిష్యే" నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది.  హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో "యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి" అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండ వచ్చును. మరి తనో, "నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం" నేను క్షణ కాలం కూడా జీవించలేను అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్ళకు ఈరోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు.

సరే ఇంక ఏంకావాలి అని స్వామి అడిగాడు. "ఉన్నై అరుత్తిత్తు వందోం" మేం నిన్ను కోరి వచ్చాం. "పఱై" వ్రత పరికరాలు "తరుతియాగిల్" నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్ళను పాపం శ్రమ  పడి వచ్చారర్రా అని అనగానే, "తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్" లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్టి వారు.

తాత్పర్యము:

ఓ కృష్ణా! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున   చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము.

మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.

అవతారిక:

'మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సల్యాలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి 'మీకేమి కావలయుననిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి మాలోని అన్యకామనలేమైనయున్న వాటిని 'నశింపచేసి' మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన అండాళ్ తల్లి, ఈ పాశురంలో అర్ధించుచున్నది.

(బిలహరి రాగము _ ఝుంపెతాళము)

    ప.. పురషార్ద మర్దింప వచ్చినారము స్వామి

          పురుషార్దమిడి మా మనోరథ మీడేర్పుమా!

    అ..ప.. వరలక్ష్మి యాశించు పరమ సంపదనేల్ల

                 కీర్తించి దుఃఖమ్ము బోవ సుఖియింతుము

    చ.. దేవకికి పుత్రునిగ అవతరించిన రాత్రి

           దేవి యశోధకును వరసుతుడవై పేరుగ

           తా విన్న కంసుడట కీడు దులపగ నెంచ

           నీవె కంసుని గర్భ మగ్నివలె వ్యాపించి

           ఆ యత్నమంతము వమ్ముజేసిన స్వామి

           పురుపార్దమర్దింప వచ్చినారము స్వామి

           పురుషార్ధామిడి మా మనోరథ మీడేర్పుమా..

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/UgxoRZ3rrsSW563m50h4AaABCQ

No comments: