Ads

29 December, 2020

తిరుప్పావై గోదాదేవి 14వ పాశురం!


 తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

పద్నాలుగవ రోజు అనగా 29.12.2020 మంగళవారము..

14 వ రోజు - వేదమే ప్రమాణం..

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము:

ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్

శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్

శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్

తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్

ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్

నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్

శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం

పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:

ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. 

ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె? ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో) తొమ్మిదవ గోపికను లేపిచున్నది.

అవతారిక:

ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతియైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకను నిద్రబోవుచున్నదీ గోపిక.

తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసి పోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నయైనత్తిట్టి యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు.

(లలితరాగము - ఏకతాళము)

ప.. ముందుంగ లేపుదు నంటివి ముచ్చటలెన్నో చెప్పితి

      వెందుబోయె నోటిమాట! సిగ్గు నీకు లేకపోయె!

1 చ.. పెరటి దిగుడు బావిలోని ఎర్రని కలువలు నవ్వెను!

    పరికించవె సఖి! ఆ నీలోత్పలములు ముకుళించెను!

    తిరు కోవెల 'కుచ్చికోల' తెరువగ నదె తపోధనులు

    వర కాషాయాంబరులౌ శుభ్రదంతు లేగ గనవె!

2 చ.. శంఖ చక్రములు గల్గిన శ్రీహస్తుని హరిని

    పంకేరుహ నేత్రుని - శ్రీ కృష్ణుని సర్వేశుని

    పంకజలోచనీ! పాడుమో మంజుల భాషిణీ'

    ఇంకనైన లేవవె! నీ నిద్దుర చాలించవె!

మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.

ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు.

ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం.

వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. 

లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. 

సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు.

ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు,

ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు.  పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక. 

"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు.  

తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ  "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్"  ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటం లేదా? "నావుడైయాయ్" పెద్ద మాటకారి దానివి.

జ్ఞానులు తమ హృదయంలో  భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో.  లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో 

"శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/UgynsiyAxF0VOD6BxY94AaABCQ

No comments: