Ads

30 March, 2019

గోమాబాయి కథ - Story of Gomabai, Devotee of Lord Pandarinatha! MPlanetLeaf

This story of 'గోమాబాయి' the devotee of Lord Panduranga was published in the monthly magazine 'Anasuya' dated: 1917-07-01. Writer unknown...

చాలా కాలం క్రితం, మాహారాష్ట్రలో గోమాబాయి అనే ఒక పేద పండరీనాథునికి మహాభక్తురాలు ఉండేది. ఆమె ఎప్పుడూ హరినామ సంకీర్తనం, బిక్షాటనతో దేహ పోషణ. అంతే...

వితంతువు, సంతానహీనురాలు, పేదరాలు కావడంతో బిక్షాటన ఒక్కటే గతయ్యింది తనకు. ఎవరైనా చిరిగిన బట్టలు ఇస్తే, చిరుగులు కొట్టుకుని ఆ బట్టలు వేసుకుని ఉండేది. అత్యంత పేదరాలు. తనకు వచ్చిన బిక్షలో తన శరీరపోషణ కు ఎంత అవసరమో అంత ఉంచుకుని, మిగిలినది ఇతర పేదలకు పంచిపెట్టేది. ఒక్కోసారి తనకు వచ్చిన పిండి, బియ్యం లాంటి మూలపదార్థాలు దాచి, ఆ ఊరికి వచ్చిపోయే భాగవత బృందాలకు వండి పెట్టి భాగవత కైంకర్యం చేసేది.


ఒకనాడు పండరీపురం లో మహోత్సవం దర్శించాలని ఆ ఊరినుండి ఎంతో మంది భాగవతులు బృందాలుగా ఏర్పడి వెళ్తున్నారు. అప్పటికే వృద్ధురాలైన గోమాబాయి మళ్ళీ వచ్చే మహోత్సవాల సమయానికి ఉంటానో లేదో అని అనుకుని బయలుదేరడానికి నిశ్చయించుకుంది. తన దగ్గర ఉన్న కొంచెం సత్తుపిండి ని మూటకట్టుకుని రంగా రంగా అని అంటూ కాలినడకన బయలుదేరింది.

మార్గమధ్యంలో ఆకలి అనిపించినప్పుడు కొంచెం పిండితో రొట్టెలు చేసుకుని తిని మళ్ళీ బయలుదేరేది. అలా నడిచి నడిచి భీమానది తీరం చేరింది. మర్నాడే మహోత్సవ ఆరంభం. భీమనాది పొంగు మీద ఉండడంతో కచ్చితంగా పడవ మీదే తీరం దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోమాబాయి దగ్గర సత్తుపిండి తప్ప ఒక్క కాసు కూడా ధనం లేదు. ధనం ఉన్నవాళ్లు పడవలు ఎక్కి తీరం దాటి పండరీపురానికి వెళ్తున్నారు. ఈమె దగ్గర ఒక్క కాసు కూడా లేకపోవడం తో రద్దీ ని బట్టి రుసుము వసూలు చేసే అలవాటు ఉన్న పడవ నడిపే వాళ్ళు ఈమెను ఎక్కించుకోలేదు. ఎంతోమందిని బతిమాలింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.

గట్టు మీద కూర్చున్న గోమాబాయి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ కూర్చుంది. చీకటవుతుంది. కానీ, ఎవరూ పడవలో ఎక్కించుకోలేదు. గట్టు అవతల పండరీపురం లో కాగడాలు వెలుగుతున్నాయి. ఉత్సవాలు మొదలవుతున్నాయి అన్న సూచనగా భేరీలు వినిపిస్తున్నాయి.

గోమాబాయి తనలో తాను గొణుక్కుంటుంది. అయ్యా, పండరీనాథా, నీ పండుగ చూడాలని ఎంతో కోరికతో ఇక్కడిదాకా వచ్చాను. కానీ, ఇంతలోనే నా అదృష్టాన్ని ఇలా వక్రీకరించావా... అంతమంది భక్తులను అనుమతించినవాడివి, నీకు నేనొక్కత్తినే బరువయిపోయానా? రంగా, అంతేలేవయ్యా, కమ్మలు వేసుకోవాలని చెవులైతే కుట్టించుకోగలను కానీ, కమ్ములను ఎడినుండి తేగలను? ఇదీ అంతే, నా ప్రాప్తం ఇంతేనేమో. ఇక్కడినుండి ఆ వెలుగులను చూసి తృప్తి పాడమని చెప్తున్నావా తండ్రీ అంటూ గొణుగుతుంది.

సరిగ్గా అప్పుడే ఒక ఖాళీ పడవ గోమాబాయి ఉన్న తీర్థం వైపు వచ్చింది. ఆ పడవ నడిపేవాడు ఆ ముసలవ్వను చూసాడు. పలకరించాడు. ఏమమ్మా అవ్వా, అక్కడ అంత పెద్ద పండుగ జరుగుతుంటే, నీవు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేమిటి అని అడిగాడు. ఆ పలకరింపుకే ఆ గోమాబాయి పులకరించిపోయింది. తన కష్టాన్ని చెప్పుకుంది. అవతలి గట్టుకు చేర్చు నాయనా, నీకు పుణ్యముంటుంది, అని వేడుకుంది.

ఏ కళన ఉన్నాడో ఆ యువకుడు సరే అవ్వా, నేను చేరుస్తాలే అని అంటూ, అవ్వా, ఇక్కడంతా బురదగా ఉంది, నీవు నడవలేవు అని దగ్గరకు వచ్చి, అవ్వని అమాంతం చిన్న పిల్లని వళ్ళో ఎత్తుకున్నట్టు ఎత్తుకుని పడవ వరకూ తీసుకెళ్లి జాగ్రత్తగా పడవలో కూర్చోబెట్టి అవతలి వడ్డుకు తీసుకెళ్లాడు. పడవనడుపుతూ ఆ అవ్వ కష్టసుఖాలగురించి అడిగాడు. ఇక కష్టం ఏముంది నాయనా, సమయానికి పాండురంగాడిలా నీవు వచ్చి నన్ను అవతలకి చేరుస్తున్నావు. ఆ రంగనాథుడి రంగరంగ వైభోగం చూడబోతున్నాను, ఇక కష్టాలెక్కడుంటాయి అని అన్నది గోమాబాయి.

అవతలి తీరంలో కూడా బురద అంటకుండా ఎత్తుకుని నేలపై దిగబెట్టాడు ఆ యువకుడు. గోమాబాయి తన దగ్గర ఉన్న పిండిలో సగభాగం ఇవ్వబోయింది .. ఆ యువకుడు, వద్దు అవ్వా, పోద్దటినుండీ చాలానే సంపాదించాను. నీవు ఒక్కత్తివి ఇవ్వకపోతే నాకు తక్కువేం కాదులే. ఒక పని చేయి. ఆ సత్తుపిండిని రొట్టెలు గా చేసి ఎవరైనా భాగవతులు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు.

గోమాబాయి ఉత్సవవేడుకల్లో మునిగిపోయింది. ఆ రాత్రంతా భాగవతుల సమక్షంలో కీర్తనలు, భజనలు లాంటివాటిలో గడిచిపోయింది. ఆ మర్నాడు ఉదయం నదిలో స్నానం చేసి, గుడికెళ్లింది. స్వామిని సేవించుకుంది.

తరువాత జ్ఞాపకం వచ్చింది .. తన దగ్గరవున్న సత్తుపిండిలో సగభాగం రొట్టెలు చేసి ఎవరైనా భాగవతులకు ఇవ్వాలి. పనిగట్టుకుని ఈమె వద్దకు వచ్చి రొట్టెలు అడిగి తినేవాళ్లు అక్కడ ఎవరుంటారు. ఎవరూ రాలేదు. అసలే వృద్దాప్యం. దాంట్లో ప్రయాణం, జాగరణ, అలసట అయ్యింది. గోమాబాయి నీరసంగా ఉంది. ఏ భగవతులకైనా రొట్టెలు దానం చేసి కానీ ఆమె ఏమీ తినకూడదని నియమం పెట్టుకుంది. అలా నీరసంగా ఆపసోపాలు పడుతుంది కానీ, ఒక్క బ్రాహ్మణుడూ రాలేదు.

శోష వచ్చి పడిపోయేలా తయారయ్యింది ఆమెకు. ఆ క్షణంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. చూస్తే భాగవతుడిలా ఉన్నాడు. అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం కడుపులో పడితే కానీ, కాలు కూడా కదిపే పరిస్థితి లేదు అని అడిగాడు గోమాబాయిని.

తన దగ్గర ఉన్న పిండితో రెండు రొట్టెలు చేసి ఉంచింది. దాంట్లో ఒకదాన్ని తీసి ఇచ్చి ఆ వృద్దుడికి ఇచ్చింది. ఆ వృద్ధుడు ఆ రొట్టె తిని, దీవించాడు. కానీ, తన వెంట ఉన్న వృద్ధిరాలికి కూడా ఏదైనా పెట్టమ్మా అని అన్నాడు. తనగురించి ఉంచుకున్న రొట్టెను ఆ బ్రాహ్మణుడి వెంట ఉన్న స్త్రీకి ఇచ్చాడు. ఆమె నోట్లో ఆ రొట్టెను పెట్టుకుందో లేదో, ఆ వృద్ధ దంపతులు పాండురంగడు, రుక్మిణీ మాతగా దర్శనం ఇచ్చారు.

గోమాబాయి సంతోషానికి హద్దులు లేవు. సంతోషంతో వణికిపోతూ గోమాబాయి కళ్ళలో నీళ్లు ధారగా కారుతుండగా రుక్మిణీ రంగనాథుల పాదాలపై ప్రార్థిస్తూ పడిపోయింది. ఆ పుణ్యదంపతులు గోమాబాయి ని లేవనెత్తి , గోమాబాయి, దరిద్రానికి చింతించకు. మేము నిన్ను ఎప్పుడో మా ఆంతరంగిక భక్తుల్లో ఒకరిగా స్వీకరించాము. అందుకే, రాత్రి పడవవానిగా, ఇవ్వాళ విప్రదంపతులుగా, ఇప్పుడు యదార్థరూపాల్లో దర్శనమిచ్చాము. దుఃఖాన్ని మాని, మమల్ని ఎప్పటిలాగే సేవించుకో. నీకు త్వరలోనే నా సన్నిధిలో స్థానం ఇస్తాను అని చెప్పి వెళ్లిపోయారు రుక్మిణీ పాండురంగలు.

జీవితాంతం ఆమె రంగనాథ భక్తురాలిగా ఉంటూ అంత్యకాలంలో కృష్ణునిలో ఐక్యమయిపోయింది.

No comments: