Ads

16 January, 2022

రాముడిని ఊర్మిళా దేవి కోరిన వింత వర ప్రభావం! Weird boon of Sri Rama

 

రాముడిని ఊర్మిళా దేవి కోరిన వింత వరం! - ఆ వర ప్రభావం నేటికీ మన పూరీ క్షేత్రంలో కనబడుతుంది!

రామాయణము భారతీయ వాఙ్మయంలో ఆది కావ్యంగానూ, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని, ఆదికవిగానూ సుప్రసిధ్ధము. ఎంతో ఆదరణీయము, పూజనీయము అయిన ఈ కావ్యంలోని ఘట్టాలలోకి వెళితే, రావణ సంహారం జరిగిన తరువాత, రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా, ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒక రోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా, యుద్ధానికి సంబంధించిన విషయాలు, చర్చకు వచ్చాయి. 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేని మనిషే, ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే, ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడని, ఎవరో గుర్తుచేశారు. ఎంతో ఉత్సుకతను రేకెత్తించే ఈ చర్చలో అంశాలను తెలుసుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/E2BEx7J9lyg ]

తమ అరణ్యవాసం మొత్తం, నిద్రాహారాలు లేకుండా గడిపిన లక్ష్మణుడి గురించిన ఆ మాటలు విన్న రాములవారికి, ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు, నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ, ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని తాననుభవించిందనీ తెలుసు. కానీ, రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు?' అని అడిగారు.

దానికి లక్ష్మణుడు, 'మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని, పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,' అని జవాబిచ్చాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ, సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ, ఓసారి లెక్కపెడదామని అనుకున్నారు. దాంతో, వాటిని తెప్పించి, సైనికులతో లెక్కించారు. కానీ, లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది.

అప్పుడు రాములవారు, 'లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!' అని పరిహాసంగా అడిగారు.

అందుకు లక్ష్మణుడు, 'అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున, మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున, ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే, మనకు రాలేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో, మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున, ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ, ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున, బ్రహ్మహత్యా పాతకం జరిగిందన్న బాధతో, ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా, మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో, అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,' అని బదులిచ్చాడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనస్సు కరిగిపోయిందని, వేరే చెప్పాలా.

అదే సమయంలో, ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు.. 'తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే, మేము అక్కడ అన్ని సమస్యలనూ తట్టుకుని నిలబడగలిగాము. అందుకే, సీతా లక్ష్మణులతో పాటుగా, నువ్వు కూడా మా ప్రక్కనే ఆశీనురాలివై ఉండు!' అని అన్నారు, రాముల వారు.

రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. అప్పుడు ఊర్మిళ, 'ప్రభూ! నాకు మీ పాదపద్మముల దగ్గర చోటుకంటే, వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ మీ పాదాల చెంతకి చేరుకుని, మీ అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేనుండేలా, అనుగ్రహించండి' అని వేడుకుంది.

అప్పుడు శ్రీరాముడు, 'కలియుగంలో పూరీక్షేత్రంలో, నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు, బలరాముని రూపంలో, నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో, ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,' అంటూ వరాన్ని అందించారు.

ఆ వరం కారణంగా, ఇప్పటికీ పూరీలోని జగన్నాథుని ఆలయం ప్రక్కన, విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ, భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం, 56 రకాల ప్రసాదాలతో, వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం, తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో, ఈ ఊర్మిళా దేవి కథ కూడా, విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది..

శ్రీరామ జయ రామ జయజయ రామ! లోకాః సమస్తా సుఖినోభవంతు!

12 January, 2022

జ్ఞానంతో శాశ్వతమైన శాంతి! Bhagavadgita

  

జ్ఞానంతో శాశ్వతమైన శాంతి!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (37 – 42 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 37 నుండి 42 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7rwg9mZpgVw ]

అలౌకిక జ్ఞానంతో శాశ్వతమైన పరమ శాంతిని ఎలా పొందాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।। 37 ।।

ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని, కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా, భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ, భస్మము చేయును.

మనందరికీ కూడా, అనంత జన్మల నుండి చేసిన పుణ్య, పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి, పేరుకుని పోయి ఉంటుంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ, తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు. అంతేకాక, ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని ప్రక్రియగా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నింటినీ, ఈ జన్మ లోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే, ఆత్మ యొక్క జ్ఞానం, మనలను భగవంతుని శరణాగతి దిశగా తీసుకువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు. ఎలా అయితే ఒక చిన్న నిప్పు తునక మహా జ్వాలగా మారి, ఒక పెద్ద కొండను సైతం భస్మం చేయగలదో, అలాగే, మనలో రగిలే జ్ఞానాగ్ని, మన క్రియలన్నింటినీ భస్మం చేస్తుంది.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్దః కాలేనాత్మని విందతి ।। 38 ।।

దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనర్చేది, ఈ లోకంలో వేరే ఏమీ లేదు. చాలా కాలం, యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత, కాల క్రమంలో ఈ జ్ఞానం, సాధకుని హృదయంలో పొందబడుతుంది.

ఒక వ్యక్తిని పవిత్రమొనర్చి, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి, ముక్తిని ప్రసాదించి, మరియు భగవంతుని దగ్గరకు చేర్చే శక్తి, కేవలం జ్ఞానానికి మాత్రమే ఉంది. కాబట్టి, అది మహోన్నతమైనదీ, అత్యంత పవిత్రమైనది. వేద శాస్త్రాలను చదవటం, మరియు గురువు గారి ప్రవచనాలను వినటం ద్వారా, ఒక రకమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ, ఈ పుస్తక పరిజ్ఞానం సరిపోదు. ఆత్మ, భగవంతుడూ, మాయ, కర్మ, జ్ఞానం, భక్తీ అనే విషయముల మీద, సంపూర్ణ అవగాహన, కేవలం గురువు గారి దగ్గర నుండే నేర్చుకోగలం. ఈ పద్ధతిలో కాకుండా భగవత్ ప్రాప్తి నొందడం, ఎవరికైనా అసాధ్యం. ఎప్పుడైతే వారు తెలుసుకున్న పుస్తక జ్ఞానం ప్రకారంగా సాధన చేస్తారో, అది వారి అంతఃకరణను శుద్ధి చేస్తుంది. అప్పుడు, ఆత్మ తత్వము, దానికీ భగవంతునికీ ఉన్న సంబంధం, హృదయంలో అంతర్గతంగా ప్రకటితం చేస్తుంది.

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ।। 39 ।।

గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారూ, మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారూ, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. ఇటువంటి శ్రేష్ఠమైన, అలౌకిక జ్ఞానంతో, వారు అతిత్వరగా, శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.

అన్ని ఆధ్యాత్మిక సత్యాలూ, తక్షణమే అర్థం కావు. కొన్నింటిని ఆధ్యాత్మిక పథంలో, ఉన్నతమైన స్థాయిని చేరుకున్న తరువాతే, అనుభవించగలము. గురువు, మరియు శాస్త్రముల పట్ల ధృఢ విశ్వాసమునే, శ్రద్ధ అంటారు. ఒకవేళ ఇలాంటి శ్రద్ధ, తప్పుడు వ్యక్తి మీద పెడితే, అది భయానక పరిణామాలకు దారి తీస్తుంది. కానీ, అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే, అది శాశ్వత సంక్షేమం దిశగా, మనలను తీసకువెళుతుంది. అదే సమయంలో, గుడ్డి విశ్వాసం కూడా మంచిది కాదు. ఒక గురువు గారి మీద, అటువంటి శ్రద్ధ ఉంచే ముందు, మన బుద్ధిని ఉపయోగించి, ఆ గురువు పరమ సత్యాన్ని ఎరిగినవాడనీ, దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడనీ, నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తరువాత, అటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి, కృషిచేయాలి. అదేవిధంగా, వారి మార్గదర్శకత్వంలో, భగవంతునికి శరణాగతి చేయాలి. గురువు, మరియు భగవంతునిపై, నిస్సంకోచమైన, దృఢమైన విశ్వాసం కలవారికి, వేదముల జ్ఞాన సారం, వారి హృదయంలో తెలియ చేయబడుతుంది.

అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ।। 40 ।।

జ్ఞానమూ, విశ్వాసమూ, రెండూ లేని వారూ, అనుమానపడే స్వభావం కలవారూ, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి, ఈ లోకంలో, ఇంకా, పర లోకంలో కూడా, సుఖం ఉండదు.

సాధకులను వారి విశ్వాసం, మరియు జ్ఞాన స్థాయిలను బట్టి, మూడు రకాలుగా వర్గీకరించాయి, శాస్త్రాలు. శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండి, దృఢ విశ్వాసం కలిగినవాడు, అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా, గురువు, మరియు భగవంతుని పై విశ్వాసం కలిగి ఉన్నవాడు, మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, విశ్వాసం కూడా లేనివాడు, నిమ్న స్థాయి సాధకుడు. ఈ మూడవ రకం వారు, ఈ జన్మలో గానీ, లేదా, ఆ పై జన్మలలో గానీ, ఎన్నటికీ సుఖాన్ని పొందలేరు. ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా, నమ్మకం, ఎంతో అవసరం.

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।। 41 ।।

ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ సందేహాలన్నీ నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని, కర్మలు బంధించవు.

కర్మ అంటే, విహిత ఆచారములూ, మరియూ సామాజిక విధులు నిర్వర్తించటంలో ఉన్న అన్ని క్రియాకలాపములూ. సన్యాసం అంటే, “త్యజించుట/విడిచిపెట్టుట”. “యోగ” అంటే, “భగవంతునితో ఐక్యత”. ఇక్కడ శ్రీ కృష్ణుడు, యోగసన్న్యస్త కర్మాణం అన్న పదం వాడాడు. అంటే, “పూజాది అన్ని కర్మలను త్యజించి, తమ శరీర-మనస్సు-ఆత్మ లను భగవంతునికే అంకితం చేసేవారు” అని అర్థం. అలాంటి వారు, తమ క్రియలన్నింటినీ, భగవత్ సేవగానే చేస్తారు. భక్తి యుక్తంగా వారు చేసే పనులు, వారిని కర్మ బంధములలో పెనవేయవు. తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే, వ్యక్తిని కర్మ బంధములలో కట్టివేస్తాయి. ఎప్పుడైతే, పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేస్తామో, వాటికి, కర్మ ప్రతిక్రియలుండవు. అంటే, సంఖ్యలను సున్నాతో గుణించినట్టే. పదిని సున్నాతో గుణించినా, కోటిని సున్నాతో గుణించినా, ఫలితం శూన్యమే. అదే విధంగా, జ్ఞానోదయం అయిన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు, వారిని కర్మ బంధములలో పడవేయవు. ఎందుకంటే, వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితము చేస్తారు. కర్మలను భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా, అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, మహాత్ములు కర్మ బంధములలో చిక్కుకోరు.

తస్మాదజ్ఞానసంభూతం హృత్-స్థం జ్ఞానాసినాత్మనః ।
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ।। 42 ।।

కాబట్టి, జ్ఞానమనే ఖడ్గంతో, నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా, కర్మ యోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము.

అర్జునుడి ఆధ్యాత్మిక గురు స్థానంలో ఉన్న శ్రీ కృష్ణుడు, తన శిష్యునికి కర్మ యోగాభ్యాసం ద్వారా, లోతైన విజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఉపదేశించాడు. ఇప్పుడు ఈ విజ్ఞానాన్నీ, విశ్వాసాన్నీ ఉపయోగించుకుని, తన మనస్సులో ఉన్న సందేహాలను పెకలించివేయమని ఉపదేశిస్తున్నాడు. అర్జునుడిని తన కర్తవ్య నిర్వహణ కోసం, లేచి, తన విధిని, కర్మ-యోగ దృక్పథంలో నిర్వర్తించమని, పిలుపునిస్తున్నాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, జ్ఞానకర్మసన్న్యాసయోగోనామ చతుర్థోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, నాలుగవ అధ్యాయం, జ్ఞానకర్మసన్న్యాసయోగంలోని, 42 శ్లోకాలూ, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని అయిదవ అధ్యాయం, కర్మసన్న్యాస యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

10 January, 2022

కచ దేవయానిల గాథ! నేటికీ మానవులు ఎదుర్కొంటున్న శుక్రాచార్యుడి కఠోర శాసనం! Love Failure Story of Kacha Devayani

 

కచ దేవయానిల గాథ! నేటికీ మానవులు ఎదుర్కొంటున్న శుక్రాచార్యుడి కఠోర శాసనం!

రాక్షస రాజైన వృషపర్వుడి ఆస్థానంలో ఉంటూ, దానవులకు శుక్రుడు ఆచార్యుడిగా ఉండేవాడు. ఇంద్రుడి కుమార్తె జయంతి, శుక్రాచార్యుడి భార్య. వీరికి దేవయాని అనే కుమార్తె ఉంది. మన గత వీడియోలో, శుక్రాచార్యుడు మృత సంజీవనీ విద్యను ఎలా సంపాదించుకున్నాడు? జయంతిని వివాహం చేసుకోవడానికి గల కారణాలూ తెలుసుకున్నాము. చూడని వారి కోసం, ఆ విడియో లింక్ ను, క్రింది డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాను. ఇక ఈ రోజుటి మన వీడియోలో, రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర, మృత సంజీవనీ విద్యను నేర్చుకోవడానికి వచ్చిన, దేవ గురువు బృహస్పతి కొడుకు కచుడి గురించీ, దేవయానీ కచుల భగ్న ప్రేమ గురించీ తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Dx7C2ueSyt4 ]

పూర్వం దేవ దానవ సంగ్రామం తరచుగా జరుగుతూ ఉండేది. దేవతలతో యుద్ధం చేస్తున్న సమయంలో, చనిపోయిన దానవులందరినీ తక్షణమే బ్రతికించేవాడు శుక్రుడు. దాంతో దేవదానవ సంగ్రామంలో దేవతల సైన్యం రాను రాను క్షీణించసాగింది. ఇక దానవ సైన్యం తరుగూ విరుగూ లేకుండా శుక్రాచార్యుని మృత సంజీవని ప్రభావం చేత, నిత్య నూతనంగా ఉండేది. దేవతలకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాగే కొనసాగితే, సంగ్రామంలో దేవతలకు పరాజయం తప్పదని, గురువైన బృహస్పతిని ఆశ్రయించారు. ఆయనను పలు విధాల ప్రార్థించారు. బృహస్పతి ఈ సమస్యకు పరిష్కారంగా, దేవతలలో ఎవరో ఒకరు మృత సంజీవనీ విద్యను, శుక్రాచార్యుడి దగ్గర అభ్యసించి రావాలని, సెలవిచ్చాడు. అందుకు సమర్ధుడు, బృహస్పతి కుమారులలో జేష్ఠుడైన కచుడే అని, ఏకగ్రీవంగా తీర్మానించారు దేవతలు.

కచుడిని సమీపించి, 'ఓ పురుషోత్తమా, శుక్రుని మృత సంజీవని ప్రభావంతో, యుద్ధంలో చచ్చి కూడా బ్రతికేస్తున్నారు రాక్షసులు. మన సేనలు నానాటికీ బలహీనమైపోతున్నాయి. ఇలాగే జరిగితే, మనకు పతనం తప్పదు.' అని సమస్యను సమూలంగా విన్నవించారు. దానికి కచుడు సరేనని చెప్పి, చేయాల్సిన పనిని వివరించమన్నాడు. అప్పుడు దేవతలు, ‘నీవు మహాతేజస్వీ, తపస్వీ అయిన శుక్రాచార్యుని ఆశ్రయించి, విద్యాభ్యాసం చేసి, మృత సంజీవనిని పరిగ్రహించాలి. ఈ కార్యానికి అన్ని విధాలా నువ్వే అర్హుడవు. నీ సదాచార సంపత్తీ, సద్భావనా స్వభావం, మాకు శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ఈ దేవకార్యం తప్పక పూర్తి చేయాలని, పరిపరి విధాలా ప్రార్థించారు. దేవతల విన్నపాన్ని ఆలకించిన కచుడు, రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు బయలుదేరాడు.

శుక్రాచార్యుడిని సమీపించి, దండ ప్రణామాలర్పించాడు. అనేక విధాలా స్తుతించాడు. 'మహాత్మా! నేను కచుడను, అంగీరసుని పౌత్రుడను. బృహస్పతీ పుత్రుడను. మీ వద్ద, విద్యనర్థించ కోరి వచ్చాను. నన్ను మీ శిష్యునిగా అంగీకరించి, కృతార్థుడను చేయండి' అని ప్రార్ధించాడు కచుడు. అతని వాక్కులకు శుక్రుడు ఆనందభరితుడయ్యాడు. 'బృహస్పతీ నందనా! నీవు నాకు ప్రేమపాత్రడవయ్యావు. నిన్ను సత్కరిస్తే, సాక్షాత్తూ బృహస్పతిని సత్కరించినట్లే. నిన్ను అనుగ్రహిస్తున్నాను'. అని కచునికి బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించాడు శుక్రాచార్యుడు.

అది మొదలు, వ్రత నియమాలు పాటిస్తూ, ఇంత మంచి శిష్యుడు లేడనిపించాడు కచుడు. ఆచార్యుడైన శుక్రుడినీ, ఆయన ముద్దుల పుత్రిక దేవయానినీ, నిత్యం సేవిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. పథకంలో భాగంగా, గురుపుత్రిక దేవయానికి మరీ విధేయుడిగా, ఆమె కనుసన్నల్లలో మసలుతూ ఉండేవాడు. నవ యవ్వన శోభతో ఉన్న కచుడు, మధురంగా పాడుతూ, ఉల్లాసంగా ఆడుతూ, యవ్వన వసంత ఊహలలో విహరిస్తున్న దేవయానిని, సంతోషపెట్టసాగాడు. ఆమె కొరినదే తడవుగా, ఫలపుష్పాదులను తెచ్చి ఇచ్చేవాడు. తండ్రీ కూతుళ్లకు ఇలా ఎన్నో సంవత్సరాలు శుశ్రూష చేశాడు, కచుడు. అతను ఒక్క నిముషం లేకపోతే గడిచేది కాదు, శుక్రుడికి. కచుడే సర్వం, సమస్తం అయిపోయింది దేవయానికి. ఇదంతా చూసి సహించలేకపోయారు, దానవులు. కచుణ్ణి ఎలాగైనా సంహరించాలని భావించారు.

కచుడి తండ్రియైన బృహస్పతిపై వారికి గల వైరం ఒక కారణం కాగా, శుక్రాచార్యుని వద్ద ఉన్న మృత సంజీవనీ విద్య ఎక్కడ కచుడికి స్వాధీనమవుతుందో, అనే భయం వారి ద్వేషానికి ప్రబల కారణమైంది. ఒకనాడు అడవిలో ఒంటరిగా ఆవులను కాస్తున్న కచుణ్ణి పట్టుకుని కిరాతకంగా చంపేశారు రాక్షసులు. అతడి శవాన్ని ఓ చెట్టు మొదలుకు కట్టివేసి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సాయంత్రమయ్యేసరికి, పశువులన్నీ ఆశ్రమానికి చేరాయి. కచుడు మాత్రం రాకపోయేసరికి, దేవయాని మనస్సు కీడు శంకించింది. హృదయ వేదనతో రగిలిపోయింది. దేవయాని తండ్రిని సమీపించి, 'నాన్నా!  సాయం సంధ్యలో, మీ అగ్ని క్రతువులు పూర్తయ్యాయి. చీకట్లు ముసురుతున్నాయి. ఆవులన్నీ ఆశ్రమం చేరాయి. కచుడు మాత్రం రాలేదు. ఎందుకో గానీ, నా మనస్సు తీవ్రంగా కలత చెందుతోంది. కచుడు లేడనే ఊహను కూడా తట్టుకోలేకపోతున్నాను.' అని విలపించింది.

చింతించకు దేవయానీ, నిన్నలా చూడలేను. అంటూ, తన దివ్యదృష్టితో జరిగిన తంతు తెలుసుకున్నాడు, శుక్రుడు. విషయం అవలోకించి, మృత సంజీవనీ విద్యను ఉపాసించి, కచుడిని పునర్జీవుడిని గావించాడు. తనను తిరిగి బ్రతికించిన గురువుకు, శిరమోడ్చి నమస్కరించాడు కచుడు. శుక్రచార్యుడు, కచుడిని మృత సంజీవని చేత బ్రతికించాడని తెలుసుకున్నారు, రాక్షసులు. మరికొంతకాలం గడిచింది. రాక్షసులు మరొక పన్నాగం పన్నారు.

ఒకనాడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి, 'గురుదేవా, మీకిష్టమని, రుచికరమైన మద్యాన్ని, ప్రత్యేకించి తీసుకు వచ్చాము.' అని మధు పాత్రను చేతికిచ్చారు. ఆ మద్యంలో, కచుడిని చంపి కాల్చిన బూడిదను కలిపారు, రాక్షసులు. ఆ విషయం తెలియని శుక్రాచార్యుడు, ఆ మద్యాన్నంతా తాగేశాడు. పువ్వులు తెస్తానని అడవికి వెళ్ళిన కచుడు, పొద్దెక్కినా ఇంటికి రాకపోవడంతో, మళ్ళీ గాబరా పడింది దేవయాని. ఈ విషయం తండ్రికి చెప్పింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి, ‘పోనీలే తల్లీ, రాక్షసులు కచుడంటే మండిపడుతున్నారు. మళ్ళీ చంపేసి ఉంటారు. చచ్చి స్వర్గానికే పోతాడు. మధ్యలో నీకెందుకు విచారం? ఊరుకో.. అంటూ సముదాయించాడు. 'నాన్నా కచుడు బుద్ధిమంతుడు. నా మనస్సుకు ఆహ్లాదం కలిగించినవాడు. అలాంటి ఉత్తముడు, మన దగ్గర ఉంటూ, అకారణంగా మరణించడం నేను భరించలేక పోతున్నాను. కచుడు లేకుండా నేను జీవించలేను' అంటూ దేవయాని రోదించసాగింది.

కొంతసేపయ్యాక, నిషా తగ్గిన శుక్రాచార్యుడికి, తన ముద్దుల కూతురి దు:ఖాన్ని చూసి, హృదయం ద్రవించింది. తన యోగ దృష్టితో, కచుడి ఆచూకీ కోసం చూశాడు. పద్నాలుగు లోకాల్లో, ఎక్కడా కనబడలేదు. తుదకు చూస్తే, తన ఉదరంలోనే బూడిద రూపంలో ఉన్నాడు కచుడు. ఇదంతా మద్య పానం వలన కలిగిన అనర్థమని గ్రహించాడు, శుక్రాచార్యుడు. 'ఎన్నో జన్మలెత్తి సంపాదించిన జ్ఞానమంతా, క్షణంలో నాశనం చేస్తుంది మద్యం. ఇకపై మద్యం తాగడమే కాదు. కనీసం తాకనన్నా తాకకూడదు' అనే నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాదు.. ఒక కఠోర శాసనం కూడా చేశాడు. 'నేటి నుండీ, మనిషన్న వాడు మద్యపానం చేయకూడదు. ఇది నా శాసనం. కాదని తాగినవాడు, కఠోరమైన నరక యాతనలు అనుభవిస్తాడు' అని శపించాడు.

మళ్లీ మృత సంజీవని ఉపయోగించి, తన కడుపులో ఉన్న కచుడిని బ్రతికించాడు. అప్పుడు కడుపులో ఉన్న కచుడు, శుక్రుడిని కడుపులోంచే ప్రార్థించాడు. 'ప్రాణం పోసి బ్రతికించారు. అలాగే మీ కడుపులోంచి పైకి వచ్చే మార్గం కూడా ప్రసాదించండి' అని కోరాడు. శుక్రుడు ఆలోచించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కడుపు చీల్చుచుకుని గానీ, కచుడు బయటకు రాలేడు. అలా చీలిస్తే, తన గతేంకాను? శుక్రాచార్యుడి పరిస్థితి, ముందు నుయ్యీ వెనుక గొయ్యీ అన్నట్లుగా తయారయ్యింది. గత్యంతరం లేక, కచుడికి మృత సంజీవనీ విద్యనుపదేశించాడు. ఆ తరువాత కచుడితో, 'నాకడుపు చీల్చుకుని బయటకురా, తిరిగి మృత సంజీవనితో నన్ను బ్రతికించు.' అని ఆదేశించాడు శుక్రుడు. ఆచార్యుడి ఆదేశం మేరకు, కడుపు చీల్చుకుని బయటకు వచ్చాడు, కచుడు. అలాగే, నిర్జీవంగా పడివున్న తన గురువును, మృత సంజీవనితో బ్రతికించాడు.కడకు బ్రహ్మచర్య దీక్ష పూర్తయ్యింది. మృత సంజీవనీ విద్య ప్రాప్తించింది. వచ్చిన దేవ కార్యం, ఎలా అయితే నేం, నేరవేరింది. కొన్నాళ్లయ్యాక, గురువు గారి దగ్గర సెలవు తీసుకుని, దేవలోకానికి పయనమయ్యాడు కచుడు.

బయలుదేరే ముందు, చెప్పి వెళదామని, దేవయాని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు దేవయాని, భావోద్వేగ భరితురాలై, 'కచుడా! నీ సదాచార జీవనం, భావనాపటిమ, నన్నెంతగానో ముగ్ధురాలిని చేశాయి. నీ దీక్షాకాలంలో, నువ్వు అనుకోని గండాలెన్నో ఎదుర్కున్నావు. అటువంటి ఆపద సమయంలో, నేను నీకు అండగా నిలిచాను. ఇంతకాలం, నా మనంబున నిన్నే ఊహించుకున్నాను. నీ దీక్ష సమాప్తమయ్యింది. మృత సంజీవని, నీ వశమైంది. దాంతో పాటు, నన్ను కూడా అర్థాంగిగా స్వీకరించు' అని అన్నది. కచుడు ఒక్క క్షణం, నిర్ఘాంతపోయాడు. తేరుకుని, 'దేవయానీ, నీవు నా గురుపుత్రికవు. నా సహోదరితో సమానం. నేను సదా నిన్ను ధర్మ దృష్టితో చూశానే కానీ, ఏనాడూ కామ దృష్టితో చూడలేదు. నీవు నాపై చూపిన ఆదరాభిమానాలు, ఎన్నటికీ మరువలేను. వెళ్ళేముందు నీ ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. నన్ను కృతార్థుణ్ణి చేయి' అని కోరాడు కచుడు. ఆ మాటలు కర్ణ కఠోరంగా వినిపించాయి దేవయానికి. కచుడి నిరాకరణం, సహించలేకపోయింది. దెబ్బతిన్న త్రాచులా లేచింది. 'నా కొరికను నిరాకరించావు. నన్ను కాదనుకుని వెళ్ళిపోతున్నావు. వెళ్ళు. నీవు నేర్చుకున్న మృత సంజీవని నీకు పనిచేయకుండు గాక.' అని శపించింది.

ఆమె ఇచ్చిన శాపం మిక్కిలి బాధించింది, కచుడిని. వెంటనే దేవయానితో, 'అకారణంగా, అనాలోచితంగా నన్ను శపించావు. మృత సంజీవని నాకు పని చేయకపోతే పోయింది. నా వల్ల ఉపదేశం పొందిన వాళ్ళకు, అది పనిచేస్తుంది. ఇక అహంకారంతో, అధర్మంగా నన్ను శపించావు. నిన్ను బ్రాహ్మణుడన్న వాడు పెళ్లాడకూడదు గాక' అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇక ఒక్క క్షణం కూడా నిలవకుండా, సురలోకం బయలుదేరాడు కచుడు. దేవహితార్థమై, ఎన్నో కష్టనష్టాలను భరించి, మృత సంజీవనీ విద్యను గ్రహించి వచ్చిన కచునికి, దేవతలందరూ ఘన స్వాగతం పలికారు. అంతేగాక, కచుని కీర్తి స్థిరంగా ఉంటుందనీ, యజ్ఞ భాగంలో, కచునికి కూడా ప్రాతినిధ్యం ఉంటుందనీ, శాసనాన్ని చేశారు.

ఇక మరో భాగంలో, కచుడు నిరాకరించిన దేవయాని, ఆ తరువాత ఏం చేసింది? తన వివాహం ఎవరితో జరిగింది? తన జీవితంలో ఎదురైన సంఘటనలేంటి – వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాము..