Ads

Showing posts with label ఇదే యధార్థం..!. Show all posts
Showing posts with label ఇదే యధార్థం..!. Show all posts

08 February, 2021

ఇదే యధార్థం..! Facts of Life


ఇదే యధార్థం..!

ధనము ఉన్నదనీ, అనుచరణ గణం ఉన్నదనీ, యౌవనం ఉన్నదనీ గర్వించే వారికి సూచన.. ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవీ, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూచుకుని మనిషి గర్విస్తాడు.. అహంకరిస్తాడు.. శాశ్వతమనుకుని భ్రమ పడతాడు..

[ తిరుమల గీరులలో అద్భుతాలు! ఈ వీడియో చూడండి: https://youtu.be/NP3o-Ynr15w ]

ధన, జన, యౌవన గర్వం..

కొందరికి ధన గర్వం.. కావలసినంత ధనం ఉన్నదనీ, ఇళ్లూ, వాకిళ్లూ, తోటలూ, దొడ్లూ, భూములూ, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయనీ, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదనీ, గర్విస్తారు. వీటిని చూసుకుని కళ్లు మూసుకు పోతాయి. ధన పిశాచి పట్టిన వాడికి, భార్యా, పిల్లలూ, బంధువులూ, మిత్రులూ, ఇరుగూ, పొరుగూ అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు. అన్నింటినీ డబ్బుతోనే విలువ కడతారు..

కొందరికి జనగర్వం.. తన వెనుక ఎందరో ఉన్నారనుకుంటారు. తననుంచి ఏదో ప్రయోజనం పొందాలని ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా, రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని వాడుకోవడానికి తన చుట్టూ చేరిన వారిని చూచి, గర్విస్తారు. కానీ, ‘అధికారాంతము నందు చూడవలె, ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు, అధికారం పోతే తెలుస్తుంది, తన శ్రేయోభిలాషులు ఎవరో, ఎంత మందో..

ఇంకొందరికి యౌవన గర్వం.. యవ్వనం శాశ్వతం అనుకుంటారు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని, అతడి/ఆమె గర్వం.. ఆ గర్వంలో అతడు/ఆమె, మంచీ చెడూ గమనించరు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. అహంభావంతో ఉంటారు. ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు..

హరతి నిమేషాత్కాలః సర్వం.. ఈ మొత్తం, ఒక్క క్షణంలో హరించిపోతాయని తెలిసుకోలేరు. ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే, నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ, అన్నీ నేలమట్టమైపోతాయి. నాకేం? కోట్ల ఆస్తి ఉంది.. బ్రహ్మాండమైన భవనం ఉంది.. అని గర్వించిన వాడు, మరు క్షణంలో, ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది.. ఇప్పుడు ఏమైంది ఆ గర్వం? నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ జనం నిన్ను రక్షిస్తారా?

అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం వెక్కిరిస్తూ, ప్రతీ జీవి మీదికీ వచ్చి కూర్చుంటుంది. కాబట్టి, ఇదంతా మాయా జాలమనీ, క్షణికమైనవనీ భావించు.. అంటే, అనుభవించు తప్పులేదు.. కానీ, వాటితో సంగభావం పెట్టుకోకు.. ఉన్నంత కాలం, పది మందికీ సహాయపడు. పది మందికీ మంచి మాత్రమే చేసి, భగవంతుడికి దగ్గరవ్వు.. శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/Ugx1xxnAey6z9PY3V314AaABCQ